బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబిన్ పార్టీ కార్యాలయంలో బాధ్యత స్వీకరణ బిహార్ రాజకీయాల్లో తనదైన ముద్ర..
బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన బీహార్ మంత్రి నితిన్ నబిన్ బాధ్యతలు స్వీకరిం చారు. సోమవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర పార్టీ నాయకుల సమక్షంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న తర్వాత నితిన్ నబిన్ కు ఘన స్వాగతం లభించింది. అమిత్ షా, నడ్డా, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, రవిశంకర్ ప్రసాద్, ఢిల్లీ సీఎం రేఖ గుప్తా సహా వివిధ నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం చెప్పారు. అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి నబిన్ మాట్లాడుతూ.. నాలాంటి చిన్న కార్యకర్తకు పార్టీ చాలా పెద్ద బాధ్యత అప్పగించిందన్నారు. కార్యకర్తల నిబద్ధత, కృషిని పార్టీ గుర్తిస్తుందనడానికి ఇదే నిదర్శమని చెప్పారు.
దివంగత నవీన్ కిశోర్ ప్రసాద్ సిన్హా కొడుకే నితిన్ నబీన్. కాయస్త కమ్యూనిటీకి చెందిన ఆయన.. ఇప్పటివరకూ ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2006లో ఆయన తండ్రి నవీన్ కిశోర్ మరణంతో పాట్నా వెస్ట్ అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికకు బీజేపీ అధిష్టానం నితినన్ను నిలబెట్టింది. అప్పటి నుంచి గత రెండు దశాబ్దాల్లో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇటీవల ముగిసిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం బంకీపూర్ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తోన్న నబిన్ బీహార్ ప్రజా పనుల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ పార్లమెంటరీ బోర్డు పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నితిన్ నబిన్ను నియమించింది. త్వరలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగానూ ఆయనకు బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు బీజేపీ వర్గాల సమాచారం.
బిహార్ రాజకీయాల్లో తనదైన ముద్ర..
ఎన్నికల్లో కీలకమైన బిహార్ బీజేపీ యువజన విభాగం బాధ్యతల్ని నిర్వహించారు. నితిన్ నబిన్ ఇటీవల కాలంలో బీజేపీ యువజన విభాగం, యువ మోర్చాతో విస్తృతంగా పనిచేశారు. అనేక సంస్థాగత, ఎన్నికలకు సంబంధించిన బాధ్యతలను నిర్వర్తించారు. వీటిలో ఛత్తీస్ గఢ్ ఎన్నికల నియామకాలు ఉన్నాయి. ఇక్కడ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వచ్చింది. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని చేపట్టిన అతి పిన్న వయస్కులలో ఒకరైన నితిన్ నబిన్, పరిపాలనా అనుభవం, సంస్థాగత బలం రెండింటి కలయికగా పార్టీలో భావిస్తారు.
సీనియర్ నాయకులు ఆయన పాలనా రికార్డు, క్షేత్రస్థాయిలో ప్రజలతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తుంటారు. బిహార్ మంత్రిగా ఉన్న నితిన్ నబీన్ కు బీజేపీ ఒక ముఖ్యమైన బాధ్యతను అప్పగించింది. పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించారనే వార్త రాగానే, పట్నాలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పెద్ద ఎత్తున సంబరాలు మొదలయ్యాయి. కార్యకర్తలు భారీగా బాణాసంచా కాల్చి, డప్పుల మోతతో డ్యాన్స్ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు.
బిహార్ కు దక్కిన గౌరవం
ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు ఒకరికొకరు లడ్డూలు, మిఠాయిలు పంచుకుని అభినందనలు తెలుపుకున్నా రు. ఈ వేడుకల్లో బిహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, పరిశ్రమల శాఖ మంత్రి డా. దిలీప్ జైస్వాల్ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ సాధించిన ఘన విజయం కారణంగా బిహార్ కు ఈ గిఫ్ట్ లభించిందని అన్నారు. రాష్ట్రానికి ఇది చాలా గర్వకారణ మని, బిహార్ నుండి ఒక నాయకుడిని జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు.
