Tuesday, March 3, 2026
HomeతెలంగాణKTR | కాంగ్రెస్ కు కాలం చెల్లింది…

KTR | కాంగ్రెస్ కు కాలం చెల్లింది…

  • పల్లె ప్రజలు ఓటుతో తేల్చిచెప్పారు
  • పంచాయితీ ఎన్నికలతో కాంగ్రెస్ పతనం
  • బీఆర్ఎస్ రెండోవిడతలోనూ అద్భుత ఫలితం
  • కాంగ్రెస్ మోసాలతో ప్రజలు విసుగెత్తారు
  • రేవంత్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత స్పష్టం
  • పార్టీ శ్రేణులకు అభినందనలు తెలిపిన కేటీఆర్

రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో అద్వితీయ ఫలితాలు సాధించిన గులాబీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కష్టకాలంలో బీఆర్ఎస్ వెన్నంటి నిలిచిన ప్రతిఒక్కరి ఉజ్వల రాజకీయ భవిష్యత్తుకు తప్పకుండా పార్టీ బంగారు బాటలు వేస్తుందన్నారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ సత్తా చాటిన బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందించారు. అడ్డదారిలో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఇక కాలం చెల్లిందని ప్లలె ప్రజలు తమ ఓటు ద్వారా మరోసారి తేల్చిచెప్పారని అన్నారు. ప్రభుత్వ పెద్దలు ప్రాతినిథ్యం వహించే నియోజకవర్గాల్లోనూ అధికార పార్టీ కోటలు బీటలు వారడం, రాష్ట్రంలో మారుతున్న రాజకీయ ముఖచిత్రానికి నిదర్శనమని పేర్కొన్నారు.

రేవంత్ రెండేళ్ల పరిపాలనా వైఫల్యాలకు తోడు, గ్యారెంటీల అమలులో చేసిన ఘోరమైన మోసాలే, కాంగ్రెస్ కు ఉరితాళ్లుగా మారి ఆ పార్టీని ప్రజాక్షేత్రంలో కూకటివేళ్లతో పెకిలిస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. పార్టీ గుర్తు లేని ఎన్నికల్లోనే అధికార పార్టీ దుస్థితి ఇలా ఉంటే, ఇక పార్టీ గుర్తుపై జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు ఇంతకన్నా ఘోర పరాభవం తప్పదని వ్యాఖ్యానించారు. అరాచక పాలనతో తెలంగాణ బతుకుచిత్రాన్ని ఛిద్రంచేస్తున్న రేవంత్ రెడ్డికి పంచాయతీ ఎన్నికల్లో వస్తున్న ఈ ఫలితాలు చెంపపెట్టులాంటివని అన్నారు. నాడు బీఆర్ఎస్ హయాంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార పక్షం ఏకపక్షంగా విజయం సాధిస్తే, నేడు కాంగ్రెస్ సగం పంచాయితీలను కూడా గెలవకపోవడం, పల్లె పల్లెనా అధికారపార్టీపై పెల్లుబుకుతున్న ప్రజాగ్రహానికి స్పష్టమైన సంకేతమని అన్నారు.

- Advertisement -

కాంగ్రెస్ అంటే అభయహస్తం కాదు, రిక్త హస్తం అని రెండేళ్ల పాలనలోనే తేలిపోయిన నేపథ్యంలో ఇక సీఎం రేవంత్ అసమర్థ పాలనలో అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికార పార్టీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని కేటీఆర్ హెచ్చరించారు. రెండేళ్లుగా కాంగ్రెస్ సర్కారు చేస్తున్న అరాచకాలు, మోసాలు, అవినీతి కుంభకోణాలపై అనునిత్యం బీఆర్ఎస్ సాగిస్తున్న సమరాన్ని గుండెల నిండా ఆశీర్వదిస్తున్న తెలంగాణ సమాజానికి శిరస్సు వంచి పాదాభివందనలు తెలిపారు.

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కాంగ్రెస్ కబందహస్తాల నుంచి విడిపించే ఈ పోరాటాన్ని తమ భుజాలపై మోస్తున్న గులాబీ సైనికులను పార్టీ కంటికి రెప్పలా కాపాడుకుంటుందని భరోసానిచ్చారు. నాడు బీఆర్ఎస్ హయాంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార పక్షం ఏకపక్షంగా విజయం సాధిస్తే, నేడు కాంగ్రెస్ సగం పంచాయతీలను కూడా గెలవకపోవడం, అధికారపార్టీపై పెల్లుబుకుతున్న ప్రజాగ్రహానికి స్పష్టమైన సంకేతం అన్నారు. కష్టకాలంలో బీఆర్ఎస్ వెన్నంటి నిలిచిన ప్రతిఒక్కరి ఉజ్వల రాజకీయ భవిష్యత్తుకు తప్పకుండా పార్టీ బంగారు బాటలు వేస్తుంది’ అంటూ మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News