- అధికారులతో అర్చకులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆలయ ఈవో వెంకట్రావు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో ఈనెల 30వ తేదీన నిర్వహింపబడే వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి దేవస్థానంలో అత్యంత వైభవంగా నిర్వహించుటకు ఆలయ ఈవో వెంకట్రావు ఆదివారం సాయంత్రం అర్చకులతో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఆలయ ఈవో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు ఉత్తర ద్వార దర్శనం మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఉండేదని,కానీ ఈ సంవత్సరం భక్తుల రద్దీ దృష్ట్యా సామాన్య భక్తులందరికీ స్వామివారి ఉత్తరద్వార దర్శనం భాగ్యం కలిగే విధంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఉదయం నుండి రాత్రి వరకు భక్తులందరికీ ప్రత్యేక ఉత్తర ద్వార దర్శనం చేసుకొనుటకు అవకాశం కల్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మరియు ప్రస్తుత అర్చక సిబ్బందితో పాటు అదనముగా వైకుంఠ ఏకాదశి రోజు పారాయణ దారులు అధ్యాపక స్వాములచే విశేష సేవారాధన,అలంకార స్వాములచే శోభాయమానంగా శ్రీస్వామివారి సేవ అలంకరణలు, చేయుటకు నిర్ణయించారు.మరియు ఆలయంలో ప్రత్యేకంగా ఉత్తరద్వారము పూల అలంకరణతో మామిడి తోరణములతో అత్యంత సుందరంగా అలంకరించాలని నిర్ణయించారు.ఉత్తరద్వార దర్శనం చేసుకుని భక్తులకు,దాతలకు, ప్రముఖులకు,ప్రత్యేకంగా ఉత్తర ద్వారం ముందు మాడవీధుల యందు,సెక్టార్ ఏర్పాటు చేయుటకు ఇంజనీర్ అధికారులను ఆదేశించారు.ఆలయ గోపురం దేదీప్యమానంగా వెలుగొందే విధంగా విద్యుత్ ఏర్పాట్లు చేయవలసిందిగా ఇంజనీరింగ్ విభాగం వారిని ఆదేశించారు.

వైకుంఠ ఏకాదశి రోజున భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున భక్తుల రద్దీకీ అనుగుణంగా ట్రాఫిక్ రెగ్యులేట్ మరియు భద్రతాపరమైన ఏర్పాట్లు చేయాలని సిఎస్ఓ ఎస్పీఎఫ్ వారిని తగు ఏర్పాట్లు చేయవలసినదిగా ఆదేశాలు జారీ చేశారు.స్వామివారి దర్శనానంతరం భక్తులందరికీ ప్రత్యేకంగా ఉత్తర వైకుంఠ ఏకాదశి రోజున పొంగలి ప్రసాదం అందజేయాలని అంతేకాక త్వరితగతిన దర్శనములు కల్పించుటకు క్యూలైన్లు నిర్వహణకు,సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.భక్తుల సౌకర్యార్థం వైకుంఠ ఏకాదశి రోజున సుమారు 2000 మందికి అన్నప్రసాద వితరణ చేయాలని నిర్ణయించారు.ఈ కార్యక్రమంలో డీఈఓ దోర్బల భాస్కర్ శర్మ,ఏఈఓ గజవెల్లి రఘు, నవీన్,జూసెట్టి కృష్ణ ,శంకర్ నాయక్, ఈఈ దయాకర్ రెడ్డి, ఎస్పీఎఫ్ ఆర్ఐ శేషగిరిరావు, ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు ,సురేంద్రచార్యులు,సూపర్డెంట్ రాజన్ బాబు,నటరాజ్, శ్రీలత,వెంకటేష్,సురేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
