అంగట్లో అమ్మకానికి విలేజ్ ప్రెసిడెంట్ పదవి
ఏకగ్రీవం పేరుతో రాజకీయం చేస్తున్న నాయకులు
పదవీ వ్యామోహంతో పైసలు పెట్టి కుర్చీకి వెలకడుతున్న వైనం
పలు చోట్ల వేలంపాటలను తలపిస్తున్న తీరు
ఉద్దేశపూర్వకంగా పోలింగ్‌ను ముందే అడ్డుకుంటున్న నేతలు
కొందరి నిర్ణయాన్ని అందరిపై రుద్దటం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
ఓటు పవిత్రతను నోట్లతో కొనుగోలు చేసే పరిస్థితులు
రూ.50 లక్షల నుంచి కోటి వరకు ఖర్చు చేసేందుకు సిద్ధం
ప్రజాప్రతినిధులు కూడా ఈ వ్యవహారాలను ప్రోత్సహిస్తుండటం విడ్డూరం
ప్రతి ఐదేళ్లకు ఒకసారి గ్రామాల్లో పారదర్శక స్థానిక పాలనకు నాంది కావాల్సిన పంచాయతీ ఎన్నికలు (Panchayat Elections) ఇప్పుడు అంగట్లో సరుకులా (Goods in the market) మారాయి. వేలం (Auction) పాటలతో ఓటింగ్ జరగకుండా పదవులను ముందే కొనేసుకుంటున్నారు. నాయకత్వం, సేవాభావం తదితర ఆదర్శవంతమైన భావాలు కలిగిన వ్యక్తులు చేపట్టాల్సిన సర్పంచ్ పదవి (Sarpanch Post) ప్రస్తుతం అమ్మకపు వస్తువులా మారిపోయింది. పెట్టుబడి (Investment) పెట్టి తిరిగి సంపాదించుకునే ‘లాభాల కుర్చీ’లా చూస్తున్నారు. స్వార్థానికి అభివృద్ధి అనే దొంగ పేరు పెడుతున్నారు. ఓటు (Vote) పవిత్రతను నోట్ల కట్టలతో కొనుగోలు చేసే పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామాల్లో ఎవరూ పోటీ చేయకుండా పైకి ‘ఏకగ్రీవం’(unanimity)గా, లోపల ఏకపక్షంగా జరుగుతున్న ఈ వ్యవహారాలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా మారాయి. ఈ నేపథ్యంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. పల్లెల్ని నడిపించాల్సింది పైసలా? నిజమైన నాయకత్వమా? అనేది ప్రజలే తేల్చుకోవాలి.
మచ్చుకు కొన్ని..
పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో ఎన్నికల వేడి ఒక్కసారిగా పెరిగింది. తొలి విడత ఎన్నికల ప్రకటన రాగానే సర్పంచ్ పదవిపై ఆసక్తి ఉన్న నాయకులు బహిరంగంగా రంగంలోకి దిగుతూ చర్చలు, వ్యూహాలు వేగవంతం చేశారు. ఎన్నికల పోటీని నివారించేందుకు పలుచోట్ల ఏకగ్రీవాల కోసం బేరసారాలు మొదలయ్యాయి. గుడులు, బడులు, రోడ్లు వంటి అభివృద్ధి పనుల పేరుతో పెద్ద మొత్తంలో నిధులు ఖర్చుచేస్తామని ప్రచారంలో హామీలు ఇస్తున్నారు. ప్రత్యేకంగా పట్టణ ప్రాంతాలకు ఆనుకొని ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు భారీ డిమాండ్ నెలకొంది. ఇవి అభివృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉన్న పంచాయతీలు కావడంతో సుమారు రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు పెట్టుబడులు పెట్టేందుకు పలువురు నాయకులు ముందుకు వస్తున్నారని సమాచారం. ఇదే సమయంలో తమ నియోజకవర్గాల్లో ఏకగ్రీవ పంచాయతీలు ఏర్పడితే రూ.10 నుంచి 15 లక్షల వరకు ప్రత్యేక అభివృద్ధి నిధులు కేటాయిస్తామని కొందరు ప్రజాప్రతినిధులు ప్రకటించడంతో ఏకగ్రీవాల రాజకీయాలు మరింత ఉధృతమయ్యాయి.
బ్రాహ్మణపల్లిలో బెదిరింపులు
రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం బ్రాహ్మణపల్లిలో సర్పంచ్ పదవిని రూ.55 లక్షలు పలికింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోవాల్సిన పదవిని వేలంపాట ద్వారా కట్టబెట్టారు. సర్పంచ్ పదవి కోసం ‘ఒకటోసారి.. రెండోసారి..’ అంటూ ఓపెన్‌గా వేలంపాట నిర్వహించారు. వేముల సందీప్ అనే వ్యక్తి ఈ వేలంపాటలో పాల్గొని రూ.55 లక్షలకు కుర్చీ దక్కించుకున్నాడు. ఈ తతంగమంతా గ్రామ పంచాయతీ ఆవరణలోనే జరగటం గమనార్హం. గ్రామంలో ఎవరైనా ఈ వేలంపాటకు వ్యతిరేకంగా నామినేషన్ వేస్తే కోటీ పది లక్షల రూపాయల జరిమానా విధిస్తామని హుకుం జారీచేయటం ఘోరం. మూడో విడత నామినేషన్ల పర్వం ప్రారంభం కాగా వేలంపాట నిర్ణయానికి గ్రామస్తులంతా కట్టుబడి ఉంటారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కొత్త తండా.. కొత్త దందా..
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం కొత్త తండాలో ధరావత్ మంగీలాల్ అనే వ్యక్తి.. గ్రామంలో ఆంజనేయ స్వామి గుడికి 3 గుంటల స్థలం ఇవ్వడంతోపాటు ఆలయం నిర్మించి ప్రతిష్ట మహోత్సవాలు సైతం నిర్వహించాడు. ఇందుకు సుమారు రూ.25 లక్షలు ఖర్చు చేశాడు. 623 మంది ఓటర్లు ఉన్న ఈ గ్రామంలో మంగీలాల్‌ను సర్పంచ్‌గా ఏకగ్రీవం చేసుకోవాలని ఏడాది క్రితమే గ్రామస్తులు నిర్ణయించారు. గతంలోనూ ఈ పంచాయతీ ఏకగ్రీవమే అయింది. ఇదే మండలంలోని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య స్వగ్రామం టేకులగూడెం గ్రామ పంచాయతీని కూడా ఏకగ్రీవం చేసేందుకు గ్రామస్తుల మధ్య మంతనాలు జరుగుతున్నాయి. గతంలో ఈ గ్రామ పంచాయతీ సైం ఏకగ్రీవమే కావటం చెప్పుకోదగ్గ విషయం. కొత్త కమలాపురం గ్రామ పంచాయతీ ఎస్టీ మహిళకు రిజర్వ్ చేశారు. ఈ గ్రామ పంచాయతీలో ఎస్టీ మహిళలు ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఇక్కడ కూడా పోటీ లేకుండా ఏకగ్రీవం చేసేందుకు గ్రామ పెద్దలు ప్రయత్నం చేస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి ఏకగ్రీవ పంచాయతీగా రూప్లా నాయక్ తండా
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని రూప్లా నాయక్ తండా సర్పంచ్‌గా జవహర్ నాయక్‌ను ఏకగ్రీవం చేసుకోవాలని గ్రామస్తులు బుధవారం తీర్మానం చేశారు. 200 మంది జనాభా ఉన్న ఈ తండాలో 100 శాతం మంది గిరిజనులే కావడంతో సర్పంచ్ పదవి ఎస్టీకి రిజర్వ్ అయింది. దీంతో పార్టీలకతీతంగా గ్రామ పంచాయతీ వద్ద సమావేశమైన ప్రజలు జవహర్ నాయక్‌ను సర్పంచ్‌గా చేసుకోవాలని తీర్మానం చేశారు. తొలి నుంచి గ్రామస్తులకు ఏ సమస్య వచ్చినా అండగా ఉండటం, అధికారులు, నాయకులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించడం వంటివి చేసేవాడు. అందుకే.. జవహర్ నాయక్‌ను సర్పంచ్‌గా ఎన్నుకున్నామని తండావాసులు తెలిపారు. కాగా.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి ఏకగ్రీవ పంచాయతీగా రూప్లా నాయక్ తండా నిలవడం విశేషం.
ఆశపడి.. ఆఫర్ ఇచ్చి..
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని ఓ గ్రామ పంచాయతీలో గుడి కడుతున్నారు. ఏండ్లుగా సర్పంచ్ కావాలని ఆశపడుతున్న ఓ పెద్దాయన రెండ్రోజుల క్రితం గ్రామస్తుల ముందు ఏకగ్రీవ ప్రతిపాదన పెట్టాడు. తనను గెలిపిస్తే గుడి నిర్మాణానికి సొంతగా రూ.15 లక్షలు ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తున్న ఇద్దరు కుమారులు కూడా తండ్రి కోరిక తీర్చేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ గ్రామంలో మరో ఇద్దరు కూడా ఇలాంటి ఆఫర్లతో ముందుకొచ్చారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నందున ఒకటీ రెండు రోజుల్లో ఏకగ్రీవంపై ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
ఎవరు ఎక్కువ ఇస్తే.. వారికేనా..
గ్రామాభివృద్ధికి నిధులివ్వడం ముఖ్యమే. ఎవరూ కాదనరు. కానీ.. సర్పంచ్ పదవిని ‘ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే వారికే’ అనే ప్రాతిపదికన కేటాయించడం ప్రజాస్వామ్యానికి హానికరం. ఇలా చేయటం ద్వారా గ్రామస్తులు తమ భవిష్యత్తును కేవలం ఆర్ధిక శక్తి ఆధారంగా నిర్ణయించుకుంటే కష్టం. నాయకత్వం, విలువ, నిబద్ధత, పారదర్శకత వంటివాటికి ఆస్కారమే ఉండదు. ఈ ఎన్నికలు కేవలం డబ్బు పోటీగా మారకుండా నిజమైన ప్రతినిధులను ప్రజలు ఎన్నుకోవాలి. గ్రామాభివృద్ధి కోసం నిధులు రాకపోతే బాధ్యతాయుతమైన నాయకులే ముందుకు రావాలి. ప్రజల్లో చైతన్యం కలిగించాలి. సమగ్ర అభివృద్ధి, ప్రజల విశ్వాసం, న్యాయ సంస్కారం ఉన్నప్పుడు మాత్రమే గ్రామాలు నిజంగా ఎదుగుతాయి.
