పదేళ్లుగా సీడ్ సర్టిఫికేషన్ అథారిటీ డైరెక్టర్‌గా బాధ్యతలు
అతికష్టం మీద కమిషనర్‌కు బాధ్యతల అప్పగింత
ఇంకా అగ్రి వర్సిటీలో రిపోర్టు చేయని వైనం
‘ఆదాబ్’ కథనాలతో కేశవులు డిప్యూటేషన్ రద్దు
నేను అగ్రి యూనివర్సిటీకి పోనే పోను.. వ్యవసాయ సహకార శాఖలోనే ఏదైనా పోస్టు ఉంటే ఇవ్వండి.. ఇక్కడే ఉంటూ పనిచేస్తా.. అంటూ ఓ వర్సిటీ ప్రొఫెసర్ సెక్రటేరియట్ (Secretariat) వద్ద పడిగాపులు కాయడం ఆశ్చర్యంగా ఉంది కదూ. వినేందుకు, చదివేందుకు కొంత కష్టంగా ఉన్నా, ఇది మాత్రం నిజమే. దీంతోనే అర్ధంచేసుకోవచ్చు విశ్వవిద్యాలయం కంటే డిప్యుటేషన్ (deputation) మీద పొందిన పదవికి ఎంత పవర్, మరెంత ఆదాయం ఉంటుందో స్పష్టమవుతోంది. ఇది ఎవరి గురించో కాదు.. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి (Jayashankar Agricultural University) చెందిన ప్రొఫెసర్ (Professor) కేశవులు గురించి. వర్సిటీ ఉద్యోగం ఇచ్చి గుర్తింపు తెచ్చినప్పటికీ దీని కంటే డిప్యుటేషన్ పదవుల మీదనే మోజు ఉంది.
పదేళ్లు చేసినా తీరని మోజు..
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2015లో అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుంచి డిప్యుటేషన్‌పై ప్రొఫెసర్ కేశవులు విత్తన ధ్రువీకరణ సంస్థ(Seed Certification Institute)కు వచ్చారు. ఈ సంస్థ డైరెక్టర్(Director)గా బాధ్యతలు చేపట్టిన కేశవులు పదేళ్లకుపైగా పదవీలో కొనసాగారు. ఈ పదేళ్ల కాలంలో చేయని అక్రమాలు లేవు. పాల్పడని అవినీతి లేదు. ఈ అంశాలపై ‘ఆదాబ్ హైదరాబాద్’ వరుస కథనాలు ప్రచురించింది. వీటితో రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageshwar rao) స్పందించడమే కాకుండా ఈ ఇష్యూని చాలా సీరియస్‌గా తీసుకున్నారు.
ఈ నెల 24తో కేశవులు డిప్యుటేషన్ పదవీ కాలం పూర్తవ్వడంతో తిరిగి దాన్ని కొనసాగించలేదు. ఇదే కాకుండా మాతృ సంస్థ అయిన జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు తక్షణమే రిపోర్ట్ చేయాలని జీవో నం.505లో స్పష్టం చేశారు. అయినా నేటి వరకు కూడా కేశవులు వర్సిటీలో రిపోర్టు చేయలేదు. ఇదే కాకుండా జీవోలో పేర్కొన్న విధంగా వ్యవసాయ శాఖ కమిషనర్ డాక్టర్ గోపీకి విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ బాధ్యతలను అతి కష్టం మీద గురువారం అప్పగించారు. అంటే కేశవులుకు ఈ సంస్థ డైరెక్టర్ పదవిని వదిలేయడం అసలు ఇష్టమే లేనట్టుగా కనిపిస్తోంది. పదవీ వ్యామోహం ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇంకా ఆగని పైరవీలు.. ప్రయత్నాలు..
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీఓ నం.505 ప్రకారం ప్రొఫెసర్ కేశవులు డిప్యూటేషన్ పూర్తిగా రద్దయింది. ఇదే కాకుండా తన మాతృ సంస్థకు వెళ్లాలని కూడా ఆ జీఓ స్పష్టం చేసింది. అయినప్పటికీ కేశవులు మాత్రం మాతృ శాఖలో రిపోర్టు నేటికి కూడా చేయలేదు. ఇదే కాకుండా తను గతంలో చేసినట్లుగానే డిప్యుటేషన్ కొనసాగింపుకు పైరవీలు చేస్తూనే ఉన్నారు. జీవో ప్రకారం వ్యవసాయ శాఖ కమిషనర్ డాక్టర్ గోపీకి బాధ్యతలను గురువారం అతికష్టం మీద అది కూడా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన తర్వాత అప్పగించడం విశేషం.
దీంతో.. ప్రొఫెసర్ కేశవులు కోసం స్వయానా వ్యవసాయ శాఖ కమిషనర్ పేషీ, తుమ్మల పేషీ నుంచి మళ్లీ సమాచారం ఇచ్చినా కూడా అవి కూడా లెక్క చేయకుండా అందుబాటులో లేనని ఈ నెల 24 నుంచి సమాధానం చెబుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మంత్రి తుమ్మల కూడా తీవ్రంగా పరిగణించి ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సీడ్ సర్టిఫికేషన్‌లో కేశవులు చేసిన అవకతవకలు, అక్రమాలపై విజిలెన్స్ విచారణకు యోచిస్తున్న నేపథ్యంలో మరో పదవి కేశవులుకు ఇచ్చే ప్రసక్తే లేదని మంత్రి తుమ్మల స్పష్టం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
కేశవులు అక్రమాలపై విచారణ జరిపించాలి: ధరావతు రాజేష్ నాయక్, చైర్మన్, గిరిజన జేఏసీ
అగ్రి వర్సిటీ ప్రొఫెసర్ కేశవులు విత్తన ధ్రువీకరణ సంస్థలో అనేక అక్రమాలకు పాల్పడ్డారు. ఆయన చేయని అవినీతి లేదు. ఇదే విషయమై తెలంగాణ పౌరుడిగా నేను గవర్నర్‌కి, ఏసీబీకి, విజిలెన్స్‌కి, ఇలా అన్ని సంస్థలకు ఆధారాలతో సహా రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాను. నాకు ఆబాద్ హైదరాబాద్ అండగా నిలిచింది. దీంతో.. కేశవులు డిప్యుటేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం హర్షించదగిన విషయం. పదేళ్ల కాలంలో కేశవులు చేసిన అవినీతి, అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. తగు చర్యలు తీసుకోవాలి.
