మెదక్ ఎంపీ (Medak MP) మాధవనేని రఘునందన్ రావు అధ్యక్షతన ఐడిఓసి ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి, పర్యవేక్షణ కమిటీ (DISHA-దిశా) సమావేశం జరిగింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, పనుల పురోగతిపై సమీక్షించారు. రఘునందన్ రావు మాట్లాడుతూ గత దిశా సమావేశానికి సంబంధించిన యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (ATR), గత ఎంపీల కాలంలో మంజూరైన నిధుల వివరాలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 17వ లోక్‌సభకు సంబంధించిన పెండింగ్ బిల్స్ (Pending Bills) చెల్లిస్తున్నారని తెలిపారు. 16వ లోకసభ కాలానికి సంబంధించిన పెండింగ్ బిల్లుల వివరాలు సమర్పిస్తే పార్లమెంట్‌లో మాట్లాడి వాటి మంజూరుకు ప్రయత్నిస్తానని చెప్పారు.
దుబ్బాక నియోజకవర్గం(Dubbaka Constituency)లో మొత్తం 998 రెండు పడక గదుల ఇళ్లు నిర్మించగా, 600 మంది లబ్ధిదారులకు మంజూరు జరిగిందని, మిగిలిన ఇళ్లలో నివసిస్తున్న అర్హులైన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని సూచించారు. జిల్లాకు మొత్తం 13,276 ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Illu) మంజూరు కాగా, 11,201 శాంక్షన్ అయినట్లు హౌసింగ్ అధికారులు తెలిపారు. మొదటి విడతలో 10,300 ఇళ్లకు నిర్మాణ స్థాయిలవారీగా నిధులు విడుదలయ్యాయని చెప్పారు. పంచాయతీరాజ్ శాఖలో 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.8 లక్షల చొప్పున 75 అంగన్వాడీ భవనాలు మంజూరు అయ్యాయని, వాటి నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని ఎంపీ సూచించారు.

స్థలం సమస్యలున్న ప్రదేశాల్లో కలెక్టర్ (Collector) పర్యవేక్షణలో తక్షణ పరిష్కారం చూపాలని ఆదేశించారు. జిల్లాకు 37 గ్రామపంచాయతీ భవనాలు మంజూరు కాగా, వాటిలో 18 గ్రౌండింగ్ అయినట్లు అధికారులు తెలిపారు. 50 సంవత్సరాలు పూర్తయిన మరియు ఇంకా పంచాయతీ భవనం లేని గ్రామాల వివరాలు, అలాగే పెండింగ్ ఎంపీ ల్యాండ్ వివరాలు సమర్పించాలని ఎంపీ ఆదేశించారు. 2019-20 నుండి పెండింగ్‌లో ఉన్న లోకసభ పనులను వెంటనే పూర్తి చేయాలని, గుత్తేదారులు (Contractors) అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
జాతీయ రహదారి విస్తరణ పనులు రైతులకు ఇబ్బందులు కలగకుండా, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం వచ్చేలా చేపట్టాలని అన్నారు. గోసాన్‌పల్లి సబ్‌స్టేషన్ పనులు త్వరగా ప్రారంభించాలని, విద్యుత్ ప్రమాదాలకు గురైన బాధిత కుటుంబాలకు సహాయం అందించాలని సూచించారు. మల్లన్నసాగర్ ద్వారా దుబ్బాక నియోజకవర్గంలోని చివరి గ్రామాలవరకు నీటి సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలని, ‘పీఎం సూర్యఘర్’ పథకం దుద్దేడలో త్వరగా అమలు చేయాలని అన్నారు. జిల్లాలోని వెనుకబడిన గ్రామాల సమస్యలను అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిష్కరించాలని సూచించారు.
డ్రాగన్ ఫ్రూట్, అవకాడో పంటలను సాగు చేస్తున్న రైతులను ప్రోత్సహించాలని, ములుగు గ్రామంలోని యువ రైతులను ఆదర్శంగా చూపి మరికొందరిని ప్రోత్సహించాలని అన్నారు. అన్ని మండల కేంద్రాల్లో వారసంత ప్రాంతాల్లో కమ్యూనిటీ, పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. మిల్లర్లు రైతుల ధాన్యం లోడును తరుగు పేరుతో ఇబ్బందులకు గురి చేయకుండా చర్యలు తీసుకోవాలని, కొనుగోలు కేంద్రాల్లో దళారుల ప్రమేయం లేకుండా పద్ధతిగా కొనుగోలు జరిగేలా చూడాలని ఆదేశించారు.
మత్స్యకారుల కోసం స్థానిక చేప పిల్లల పెంపకం కేంద్రాల స్థాపనకు స్థలాలు గుర్తించాలని, తద్వారా నాణ్యమైన తెలంగాణ చేప పిల్లలు అందించగలమని చెప్పారు.
ప్రైవేట్ ఆసుపత్రులపై నిఘా పెట్టి, ఫైర్ సేఫ్టీ మరియు పార్కింగ్ సదుపాయాలు లేకుండా నిర్వహిస్తున్న ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రుల్లో రేట్ చార్టులు తప్పనిసరిగా ప్రదర్శించాలని, యంసీహెచ్ లపై పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. గజ్వేల్ ఆసుపత్రిలో పనిచేయని సిబ్బందికి చెల్లించిన వేతనాలను రికవరీ చేయాలని, రోగులను ప్రైవేట్ ఆసుపత్రులకు పంపిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. గజ్వేల్ ఆసుపత్రి నిధుల వివరాలను కూడా అందించాలని సూచించారు.
జిల్లాలో లక్షకు పైగా కార్మికులు ఉన్న ప్రదేశాల్లో ఈఎస్ఐ ఆసుపత్రి మంజూరుకు వివరాలు సమర్పిస్తే ప్రతిపాదనలు పంపిస్తానని తెలిపారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించాలని, చేనేత కార్మికుల కోసం అప్పారెల్ పార్క్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు. కాటన్ కొనుగోలులో తేమ శాతం పేరుతో రైతులను ఇబ్బందులు పెట్టకుండా చర్యలు తీసుకోవాలని, మిల్లుల్లోపలికి వచ్చిన లారీలపై కవర్లు కప్పే బాధ్యత మిల్లర్లదేనని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అబ్దుల్ హమీద్, డీఆర్‌డీవో జయదేవ్ ఆర్య, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, దిశా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
