30వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొంతి గోపీ ఎద్దేవా
కరీంనగర్, నవంబర్ 12 (ఆదాబ్ హైదరాబాద్): గత 9 ఏళ్ల పాలనలో ప్రజల కష్టార్జితాన్ని దోచుకొని జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో (JubileeHills Bye Election) బీఆర్ఎస్ పార్టీ (Brs Party) తమ అభ్యర్థి గెలుపు కోసం నగదు, మద్యం ఏరులై పారించిందని 30వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొంతి గోపీ అన్నారు. అభ్యర్థి ఎంపికలో తన రాజకీయ అనుభవాన్ని ప్రదర్శించిన హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) వ్యూహానికి తోడు పీసీసీ అధ్యక్షుడు (PCC President) మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) సారథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, కార్యకర్తల విస్తృత స్థాయి ప్రచారంతోపాటు అభివృద్ధిని ఆకాంక్షించేవారు విజ్ఞతతో ఓటువేయాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన విజ్ఞప్తిని స్వీకరించిన జూబ్లీహిల్స్ ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించనున్నారని పలు ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) ఫలితాలు నిరూపించాయని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఇతర నేతలు రంగంలోకి దిగి, ఓటర్లను ప్రభావితం చేయడానికి ఎన్ని పన్నాగాలు పన్నినా జూబ్లీహిల్స్ ప్రజలు నమ్మలేదని తెలిపారు. ఈ ఎన్నిక ఫలితాలతో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయిందని స్పష్టం అవుతుందని చెప్పారు. ఇక కేటీఆర్ మూటాముల్లె సర్దుకొని ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే చేరుకునే సమయం ఆసన్నమైనదని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ద్వారా రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని స్పష్టమైందని, ఇక భవిష్యత్తులో ఎన్నిక ఏదైనా గెలుపు కాంగ్రెస్ పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు.
ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి రాజకీయ పరిపక్వతలేని నాయకుల్లా స్థాయి దిగజారి చేసిన ప్రసంగాలతో ఇటు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు, అటు రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసేలా, ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించేలా వారు చేసిన ఉపన్యాసాలతో హైదరాబాద్ ప్రజలు ఆందోళన చెందడంతోపాటు ఈ విష సంస్కృతికి ఆద్యం పోస్తున్న బీజేపీని బొందపెట్టాలని భావించినట్లు ఫలితాలు వెల్లడించనున్నాయని వివరించారు.
