- కేసీఆర్ విధానాలనే కొనసాగిస్తున్నారు..
- ఎస్ఎల్బీసీ, నక్కలగండి, డిండి ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తి చేస్తారు?
- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత…
బీఆర్‌ఎస్‌ను విమర్శించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యల పట్ల అలసత్వం ప్రదర్శిస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు మేఘా సంస్థతో ‘ఫెవికాల్ బంధం’ కొనసాగిస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. “జాగృతి జనం బాట” కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లాలో పర్యటించిన ఆమె బుధవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన పలు కీలక అంశాలను, తాగునీరు, సాగునీరు, ఆరోగ్య, విద్యా రంగాల్లోని సమస్యలను ప్రస్తావించారు.
కృష్ణా జలాల సాధనలో వైఫల్యంపై…
నల్గొండ జిల్లాకు కృష్ణా నది నీళ్లు పూర్తి స్థాయిలో వచ్చాయో లేదో ప్రజలు ఆలోచించాలని కవిత అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెలంగాణ తెచ్చుకున్నా, గత 12 ఏళ్లలో (బీఆర్‌ఎస్ పదేళ్లు, కాంగ్రెస్ రెండేళ్లు) కృష్ణా జలాలను పూర్తి స్థాయిలో తెచ్చుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్ ఆనకట్ట జిల్లాలోనే ఉన్నా, చుట్టూ ఉన్న ఐదు మండలాలకు సాగునీరు అందడం లేదని, నెల్లికల్లు ప్రాజెక్టు పూర్తి చేస్తే ఈ సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు. ”బీఆర్‌ఎస్‌ను విమర్శించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లయినా ప్రాజెక్టుల పనులు ఎందుకు చేయడం లేదు? సమస్యలు అలాగే ఉన్నాయి. ప్రభుత్వాలపై ఒత్తిడి పెడితేనే పనులు జరుగుతాయి” అని కవిత స్పష్టం చేశారు..
