Wednesday, February 11, 2026
Homeనల్లగొండFuel Scam | ప్రభుత్వ బంకులోనే మోసం!

Fuel Scam | ప్రభుత్వ బంకులోనే మోసం!

  • ఐదు లీటర్ల డీజిల్ కి.. ఒక లీటర్ డిజిల్ మాయం?
  • ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన జైళ్ల శాఖ..ఇండియన్ ఆయిల్ బంకు!
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు ఫోటోలు.!
  • చోద్యం చూస్తున్న లీగల్ మెట్రాలజీ అధికారులు.!

నల్గొండ పట్టణంలో వందలాది మంది ప్రజలు నమ్మకంతో జైళ్ల శాఖకు చెందిన ప్రముఖ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో నమ్మకం మాటున డీజిల్ కొలతల్లో మోసం బట్టబయలైంది. ప్రభుత్వ బంక్ అని, పారదర్శకత ఉంటుందని విశ్వసించిన వినియోగదారులకు కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగుచూశాయి. నాణ్యత, కొలతల విషయంలో ఏకైక నమ్మకమైన కేంద్రంగా భావించే బంకులోనే ఇలాంటి అక్రమం జరగడంతో వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

డజిల్ గన్ నుండి గాలి… మీటర్లో రీడింగ్ తక్కువ

- Advertisement -

​బుధవారం రోజున పట్టణానికి చెందిన ఓ యువకుడు తన కారులో రూ.1500 విలువైన డీజిల్ పోయమని సిబ్బందిని కోరాడు. డీజిల్ పోసే క్రమంలో…డీజిల్ గన్ నుండి ఇంధనం రాకపోగా, కేవలం గాలి మాత్రమే వస్తుండటాన్ని యువకుడు గమనించి షాక్ తిన్నాడు. మెషిన్ రీడింగ్ వేగంగా పెరుగుతున్నప్పటికీ, కారు ట్యాంకు లోకి ఇంధనం మాత్రం చేరకపోవడంతో మోసాన్ని గుర్తించిన యువకుడు వెంటనే సిబ్బందిని నిలదీస్తూ.. వినియోగదారుడు ఆగ్రహం వ్యక్తం చేయడంతో, సిబ్బంది ఆందోళన చెందారు.

“మిషన్ సాయంత్రం నుంచి ప్రాబ్లమ్ ఉంది, కంప్లైంట్ కూడా రేస్ చేశాం” అంటూ బుకాయించే ప్రయత్నం చేశారు. సమస్య ఉన్న యంత్రాన్ని ఎందుకు ఆపకుండా ప్రజలను మోసం చేస్తున్నారని యువకుడు గట్టిగా ప్రశ్నించాడు. దీనికి బంకు ఇంచార్జ్ అత్యంత దురుసుగా స్పందించడం గమనార్హం. వాస్తవాన్ని అంగీకరించాల్సింది పోయి, బదులుగా ఆ యువకునిపై కేకలు వేస్తూ, “తాగి రచ్చ చేయడానికే వచ్చారు” అని అవమానకరంగా మాట్లాడటం సిబ్బంది నిర్లక్ష్య ధోరణికి అద్దం పట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను, ఫోటోలను యువకుడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో విషయం వేగంగా వ్యాపించింది.

​ప్రమాణిక కొలతలో లీటరు డీజిల్ తేడా బట్టబయలు..

​విషయం తీవ్ర రూపం దాల్చడంతో, బాధితుడు అక్కడే ఉన్న ఐదు లీటర్ల ప్రమాణిక కొలత డబ్బాలో (సీల్డ్ క్యాన్) డీజిల్ పోసి చూపాలని డిమాండ్ చేశాడు. అందరి సమక్షంలో నిర్వహించిన ఈ తనిఖీలో… ఐదు లీటర్లకు గాను కేవలం నాలుగు లీటర్ల డీజిల్ మాత్రమే వచ్చింది. దీంతో బంకు సిబ్బంది మోసం, కొలతల్లోని వ్యత్యాసం పచ్చిగా బట్టబయలైంది.తమ మోసం బహిర్గతం కాగానే, సిబ్బంది మరోసారి కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. “ఈ డబ్బాకు ముద్రణ (సీల్) లేదు” అని చెప్పడం కోసమెరుపు అంటే, కొలత డబ్బాలు కూడ మారుస్తూ, తప్పును దాచేందుకు ప్రయత్నించారని స్పష్టమైంది. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిబ్బంది, అధికారుల తీరుపై ప్రజలు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

​తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్..

​ప్రభుత్వ సంస్థగా నమ్మకాన్ని పొందుతున్న జైళ్ల శాఖ పెట్రోల్ బంక్ లోనే ఇలాంటి అడ్డగోలు మోసాలకు పాల్పడుతుండటంపై వినియోగదారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అమాయక ప్రజలను దగా చేస్తున్న ఈ బంక్ పై తక్షణమే పౌరసరఫరాల శాఖ, లీగల్ మెట్రాలజీ (చట్టపరమైన కొలతల విభాగం) అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులైన సిబ్బందితో పాటు, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News