Wednesday, March 4, 2026
HomeతెలంగాణOath | రాష్ట్ర మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణం

Oath | రాష్ట్ర మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణం

  • రాజ్భవన్లో ప్రమాణం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
  • హాజరైన సీఎం రేవంత్, మంత్రులు, కాంగ్రెస్ నేతలు
  • మంత్రిగా ప్రమాణం చేయడం సంతోషంగా ఉంది
  • జూబ్లీహిల్స్ ఎన్నికలకు తన పదవికి ఏం సంబంధం లేదు
  • నన్ను కేబినెట్లోకి తీసుకోవడం సీఎం, హైకమాండ్ నిర్ణయమే : మంత్రి అజారుద్దీన్

తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణం చేయించారు. కార్యక్రమం లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు. హైదరాబాద్ రాజభవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అజారుద్దీన్తో ప్రమాణం చేశారు. అల్లా సాక్షిగా ఇంగ్లీషులో ఆయన ప్రమాణం చేశారు. అనంతరం గవర్నర్, సీఎంలు పుష్ప గుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలియచేశారు. మధ్యాహ్నం 12.15గంటల ప్రాంతంలో ప్రమాణ స్వీకారం చేయించారు. కేబినెట్ విస్తరణలో భాగంగా ఆయన ఒక్కరే మంత్రిగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు హాజరయ్యారు. నూతన మంత్రికి శు భాకాంక్షలు తెలిపారు.

ఇంతకీ ఏ శాఖను కేటాయిస్తారు అనే అంశంపై క్లారిటీ లేదు. మంత్రి వర్గ విస్తరణపై గత కొన్ని రోజులుగా ఏఐసీసీలో కసరత్తు జరిగింది. రాష్ట్రమంత్రి వర్గ విస్తరణకు ఇటీవల ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్లో 15 మంది ఉండగా.. మరో ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చేందుకు అవకాశముంది. అయితే, ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన అజాహరుద్దీను మాత్రమే ప్రస్తుతం మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఎప్పుడు కేబినెట్ ఏర్పడినా.. ముస్లిం మైనార్టీకి ఒక మంత్రి పదవి ఉండేది. కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా మంది ముస్లిం మైనార్టీలు ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఈసారి ఎక్కడా గెలవలేదు. దీంతో వర్గానికి కేబినెట్లో అవకాశం కల్పించేందుకు సాధ్యపడలేదు.

- Advertisement -

కాగా.. అజాహరుద్దీన్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాల య్యారు. తాజాగా జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధపడ్డారు. అయితే, ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాలని నిర్ణయించింది. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా అజాహరుద్దీన్, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. అయితే, వీరిద్దరి నియామకానికి గవర్నర్ ఇంకా ఆమోదం తెలపలేదు. ఎమ్మెల్సీ నియామక పక్రియ పూర్తికాకపోయిన ప్పటికీ అజాహరుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేసేందుకు ఏఐసీసీ ఆమోదం తెలిపింది. 1963 ఫిబ్రవరి 8న హైదరాబాద్లో అజారుద్దీన్ జన్మించారు. అబిడ్స్లోని ఆల్ సెయింట్స్ హైస్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు. నిజాం కాలేజీలో బీకాం చదివారు. మేనమామ జైనులాబుద్దీన్ స్ఫూర్తితో క్రికెట్ వైపు అడుగులు వేశారు. 1984లో అంతర్జాతీయ క్రికెట్లో రంగప్రవేశం చేశారు. అజారుద్దీన్ క్రికెటర్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తొలి మూడు టెస్టుల్లోనూ సెంచరీలతో సంచలనం సృష్టించారు. 1989లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్గా భాధ్యతలు చేపట్టారు. 16 ఏళ్ల క్రికెట్ కెరీర్లో 99 టెస్టులు, 334 వన్డేలు ఆడారు. రిటైర్మెంట్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 2009 ఫిబ్రవరి 19న కాంగ్రెస్పార్టీలో చేరారు. అదే సంవత్సరం యూపీలోని మొరాదాబాద్ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అజారుద్దీన్ ను నియమించారు. అనంతరం మీడియాతో మంత్రి అజారుద్దీన్ మాట్లాడుతూ.. మంత్రి గా ప్రమానం చేయడం సంతోషంగా ఉందని, జూబ్లీ హిల్స్ ఎన్నికలకు తన పదవికి ఏం సంబంధం లేదని, తనని కేబినెట్లోకి తీసుకోవడం సీఎం, హైక మాండ్ నిర్ణయమని స్పష్టం చేశారు. అన్ని వర్గాల సంక్షేమం అభివృద్ధి కోసం పనిచేస్తానని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News