Wednesday, February 11, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంShamshabad | ప్రభుత్వ ఖజానాకు శఠగోపం..

Shamshabad | ప్రభుత్వ ఖజానాకు శఠగోపం..

  • శంషాబాద్లో 23 ఎకరాల అక్రమ రిజిస్ట్రేషన్..
  • వ్యవసాయ భూమికి వ్యవసాయేతర రిజిస్ట్రేషన్..
  • నాలా కన్వర్షన్ లేకుండానే రూ. కోట్ల విలువైన భూమికి డెవలప్మెంట్ అగ్రిమెంట్
  • మున్సిపాలిటీ పర్మిషన్ ఇస్తుంది.. నాలా కన్వర్షన్ అక్కర్లేదన్న ఎస్ఆర్
  • నాలా ఉత్తర్వులు ఇవ్వలేదన్న తహసీల్దార్..
  • డాక్యుమెంట్ నెం. 6619/2025 రద్దు చేసి, క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్

రాష్ట్ర ఖజానాకు రక్షణగా నిలవాల్సిన కొందరు ప్రభుత్వ అధికారులే.. స్వార్థ ప్రయోజనాల కోసం బరితెగించి, నిబంధనలను తుంగలో తొక్కి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం కేంద్రంగా జరిగిన ఓ భారీ అక్రమ రిజిస్ట్రేషన్ ఈ కోవలోనిదే.. కోట్ల రూపాయల విలువైన వ్యవసాయ భూమికి ఎలాంటి నాలా (వ్యవసాయేతర భూమిగా మార్పిడి) కన్వర్షన్ లేకుండానే డెవలప్మెంట్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేసి, ప్రభుత్వ ఖజానాకు చెల్లించాల్సిన కీలకమైన రుసుమును ఎగ్గొట్టడంలో కీలకపాత్ర పోషించారు.

  • అసలేం జరిగింది?
    శంషాబాద్ మండలం, శంషాబాద్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెం. 87/ఈ లో 5 ఎకరాల 15 గుంటలు, సర్వే నెం. 88/ఆ లో 25 గుంటలు, సర్వే నెం. 46/అ లో 1 ఎకరం 38 గుంటలు, సర్వే నెం. 89లో 15 ఎకరాల 30 గుంటల విస్తీర్ణంలో ఉన్న వ్యవసాయ భూమిని, భూ యజమానులైన మామిడి జనార్దన్ రెడ్డి, మామిడి ప్రసన్న కలిసి ఆశ్రిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారికి డెవలప్మెంట్ అగ్రిమెంట్ కం జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ విత్ పొజిషన్ చేశారు. ఈ లావాదేవీని శంషాబాద్ ఎస్ఆర్డి కార్యాలయంలో సీఎస్ నెం. 6490/2025, డాక్యుమెంట్ నెంబర్ 6619/2025 గా నమోదు చేశారు.
  • అధికారుల అడ్డగోలు వాదన.. నిర్లక్ష్యానికి పరాకాష్ట!
    సాధారణంగా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాల కోసం (ప్లాట్లు, నిర్మాణాలు) ఉపయోగించాలంటే, రెవెన్యూ చట్టం ప్రకారం తప్పనిసరిగా నాలా కన్వర్షన్ చేయించుకోవాలి. దీని ద్వారా ప్రభుత్వానికి నిర్దిష్ట రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ 23 ఎకరాలకు పైగా ఉన్న భూమికి ఎలాంటి నాలా కన్వర్షన్ ప్రక్రియ జరగలేదు. డాక్యుమెంట్ లో భూమి విస్తీర్ణం స్పష్టంగా “ఎకరాలు, గుంటలలో” పేర్కొనబడి ఉన్నప్పటికీ, సబ్-రిజిస్ట్రార్ పి. రమాదేవి దానిని వ్యవసాయ భూమిగా పరిగణించకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. భారీ మొత్తంలో ముడుపులు చేతులు మారడం వల్లే ఎస్ఆర్డిఓ నిబంధనలను బేఖాతరు చేసి ఈ రిజిస్ట్రేషన్కు పాల్పడినట్లు సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ విషయంపై ఆదాబ్ హైదరాబాద్ ప్రతినిధి శంషాబాద్ ఎస్ఆర్ ఓ పి. రమాదేవిని వివరణ కోరగా, “శంషాబాద్ మున్సిపాలిటీలో 85% భూమి ప్లాట్లుగా మారింది, మున్సిపాలిటీ అధికారులు పర్మిషన్లు ఇస్తున్నారు. కాబట్టి దీనికి నాలా కన్వర్షన్ అవసరం లేదు” అంటూ వింత వాదన వినిపించారు. మున్సిపాలిటీ పర్మిషన్లు ఇవ్వడానికి, రిజిస్ట్రేషన్ సమయంలో రెవెన్యూ నిబంధనలు పాటించడానికి సంబంధం ఏమిటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి చెబుతున్న కుంటిసాకు స్పష్టమవుతోంది.

  • తహసీల్దార్ కార్యాలయం స్పష్టత
    ఈ వ్యవహారంపై శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించగా, పైన పేర్కొన్న సర్వే నంబర్లకు తమ కార్యాలయం నుండి ఎలాంటి నాలా కన్వర్షన్ ఉత్తర్వులు జారీ కాలేదని వారు స్పష్టం చేశారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్పై తమకు ఫిర్యాదు అందితే సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
  • ప్రభుత్వానికి ఆర్థిక నష్టం.. బాధ్యులెవరు?
    ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కాపాడాల్సిన అధికారులే ఇలా అవినీతికి పాల్పడటం రాష్ట్రానికి తీరని నష్టం కలిగిస్తోంది. ఈ ఒక్క లావాదేవీలోనే ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, ఈ అక్రమ రిజిస్ట్రేషన్ వెనుక ఉన్న సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. డాక్యుమెంట్ నెం. 108/2025ను తక్షణమే రద్దు చేసి, బాధ్యులైన ఎస్ఆర్ అధికారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు, భూమికి నాలా రుసుమును వసూలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో, ఇలాంటి ఆక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా పెరిగిపోయి ప్రభుత్వ ఖజానా దివాళా తీసే ప్రమాదం ఉంది.
    ఎస్ఆర్డి చేసిన మరిన్ని అవినీతి అక్రమాలపై మరో కథనం ద్వారా మీ ముందుకు తీసుకురానుంది ఆదాబ్ హైదరాబాద్.. మా అక్షరం.. అవినీతిపై అస్త్రం..
- Advertisement -
RELATED ARTICLES

Latest News