Wednesday, February 11, 2026
Homeకరీంనగర్Bandi Sanjay Bumper Offer | ఏకగ్రీవం చేస్తే రూ.10 లక్షలు

Bandi Sanjay Bumper Offer | ఏకగ్రీవం చేస్తే రూ.10 లక్షలు

బీజేపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే ప్రోత్సాహక నిధులు
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నజరానా
మాట ఇస్తే తప్పే ప్రసక్తే లేదని వెల్లడి
ఏకగ్రీవ పంచాయతీలకు రూ.5 లక్షల ఇన్సెంటివ్ ఇస్తానని మాట తప్పిన బీఆర్ఎస్
కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద నయాపైసా నిధుల్లేవు
నిధులు తెచ్చేది, ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే
ఎన్నికలు జరిగేది కూడా కేంద్ర నిధుల కోసమే
ఆలోచించి నిర్ణయం తీసుకోండి
పొరపాటు చేస్తే 5 ఏళ్ల నరక యాతన తప్పదని హితవు

గ్రామ పంచాయతీ ఎన్నికల (Grama Panchayat Elections) నేపథ్యంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి (Union Minister of State for Home Affairs) బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) బంపర్ ఆఫర్ ప్రకటించారు. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ (Bjp) బలపర్చిన సర్పంచ్ (Sarpanch) అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆ గ్రామాభివృద్ధి కోసం ప్రత్యేకంగా రూ.10 లక్షల నిధులను అందజేస్తానని ప్రకటించారు. తాను ఒక్కసారి మాట ఇస్తే తప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ ప్రజలను ఏకం చేసి అభివృద్ధి వైపు దృష్టిసారించేలా ప్రోత్సహించేందుకే ఈ నిధులను ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ మేరకు బండి సంజయ్ ఈ రోజు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన సారాంశం..

- Advertisement -

‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు రూ.5 లక్షల ప్రోత్సాహక నిధులిస్తామని హామీ ఇవ్వడంతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో దాదాపు 70 గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవం చేశారు. కానీ ఐదేళ్లయినా ఆయా గ్రామాలకు కేసీఆర్ ప్రభుత్వం నయాపైసా ఇవ్వకుండా మొండి చేయి చూపింది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సైతం ఏకగ్రీవం పేరుతో నజరానా ప్రకటించి మోసం చేసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకుల మాటలు నమ్మి ఏకగ్రీవం చేసిన పంచాయతీల ప్రజలు ఆర్థికంగా నష్టపోయారు. ఆయా గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. దయచేసి ఈ ఎన్నికల్లో మరోసారి మోసం చేసేందుకు ఆ రెండు పార్టీలు మళ్లీ ప్రలోభ పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. మాయ మాటలు నమ్మి మోసపోవద్దని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ (Karimnagar Parliament Constituency) ప్రజలను కోరుతున్నా.

భారతీయ జనతా పార్టీ మాట ఇస్తే తప్పదు. మీ బండి సంజయ్ ఎన్నడూ చేసేదే చెబుతాడు. చెప్పేదే చేస్తాడు. ఇచ్చిన మాట ప్రకారం ఈ పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులుగా ఏకగ్రీవం చేస్తే ఆ గ్రామాలకు రూ.10 లక్షల చొప్పున ప్రోత్సాహక నిధులిస్తానని మాట ఇస్తున్నా.

ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ప్రజల ముందు కొన్ని వాస్తవాలు ఉంచుతున్నా. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నయాపైసా ఇవ్వలేదు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసల్లేవు. నన్ను కోసినా నయా పైసా రాదు’’అని సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి చెప్పడమే ఇందుకు నిదర్శనం. అట్లాగే బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలోనూ గ్రామ పంచాయతీల అభివ్రుద్ధికి పైసా ఇవ్వలేదు. అప్పులు తెచ్చి అభివృద్ధి చేసిన సర్పంచ్‌లకు బిల్లులు రాక అప్పులపాలై ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఏర్పడటమే నిదర్శనం.

గ్రామాల అభివృద్ధికి నిధులు ఇస్తోంది నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం మాత్రమే. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కేంద్ర నిధులతో కొనసాగుతున్నవే. భవిష్యత్తులోనూ గ్రామాలకు నిధులిచ్చేది కేంద్ర ప్రభుత్వమే. అసలు పంచాయతీ ఎన్నికలు నిర్వహించేది కూడా కేంద్ర నిధుల కోసమేననే వాస్తవాన్ని ప్రజలు గుర్తించాలని కోరుతున్నా. పంచాయతీ ఎన్నికలు జరగకపోతే కేంద్ర నిధులు రావనే భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తోందే తప్ప వాస్తవానికి స్తానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే చిత్తశుద్దే లేదు.

ఇక ఎమ్మెల్యే, ఎంపీల విషయానికొస్తే.. ఎమ్మెల్యేలకు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ప్రత్యేకంగా నిధులు లేవు. గతంలో ఇచ్చిన సీడీఎఫ్(కాన్‌స్టిట్యుయెన్సీ డెవలెప్‌మెంట్ ఫండ్)ను ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసింది. ఫలితంగా ఎమ్మెల్యేగా గెలిచినా పంచాయతీలకు నయా పైసా కూడా ఇవ్వలేని పరిస్థితి. కానీ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న నాకు ఎంపీ లాడ్స్ నిధులు ఉన్నాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ (సీఎస్సార్) ఫండ్ రూపంలో పెద్దఎత్తున కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి ఇప్పటికే విద్య, వైద్య రంగాలను అభివృద్ధి చేసేందుకు ఖర్చు చేస్తున్న విషయం మీకు తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవం చేసినట్లయితే.. ఆయా గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తా. పూర్తి స్థాయిలో ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు పాటుపడతా. దీంతోపాటు కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నందున కేంద్రాన్ని ఒప్పించి మరిన్ని నిధులు తెచ్చి పంచాయతీలను అభివృద్ధి చేస్తా.

చివరగా ఒక్కమాట.. నిధులు ఇచ్చేది, తెచ్చేది బీజేపీ మాత్రమే. మరి అట్లాంటప్పుడు ఇతర పార్టీలు బలపర్చిన అభ్యర్థులకు ఓటేసి ఏం లాభం? పొరపాటున కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపిస్తే కొత్తగా నిధులు రాకపోగా కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా దారిమళ్లించే ప్రమాదముంది. అందుకే మాయ మాటలు నమ్మకండి. ప్రలోభాలకు మోసపోకండి. పొరపాటు చేస్తే 5 ఏళ్ల పాటు నరకయాతన తప్పదు. అందుకే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. బీజేపీ బలపర్చిన అభ్యర్ధులకు ఓటేసి గెలిపిద్దాం. మన గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందాం.

- Advertisement -
RELATED ARTICLES

Latest News