వాయిదా వేశాం.. త్వరలోనే కొత్త తేదీ ప్రకటిస్తాం..
ఒక్క రోజే 4,574 మందికి ఉద్యోగాలు
హైదరాబాద్ వెళ్లకుండానే గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి
సూర్యాపేట: హుజూర్ నగర్(Huzur Nagar)లో మెగా జాబ్ మేళా(Mega Job Mela)ను రెండో రోజు నిర్వహించట్లేదని నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) చెప్పారు. రెండో రోజు జాబ్ మేళాను వాయిదా వేశామని, కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. ఇతర ప్రాంతాల్లోనూ మేళాలు జరగాల్సి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. శనివారం నిర్వహించిన మెగా జాబ్ మేళా వివరాలను ఆయన వెల్లడించారు.
‘ఈ జాబ్ మేళాకు ఆన్‌లైన్ ద్వారా 40 వేల మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారిలో 20,463 మంది ఇంటర్వ్యూలకి హాజరయ్యారు. 3,041 మంది వివిధ రంగాల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మరో 1,533 మందిని షార్ట్‌లిస్ట్ చేశాం. ఐటీ, ఎడ్యు టెక్నాలజీ, స్కిల్స్ ట్రైనింగ్ విభాగంలో 5,547 మంది హాజరు కాగా 827 మంది ఎంపికయ్యారు. 370 మంది షార్ట్ లిస్ట్ అయ్యారు. సర్వీస్, మొబైల్ సేల్స్ విభాగంలో 3,850 మంది ఇంటర్వ్యూలకు రాగా 391 మంది ఎంపికయ్యారు. మ్యానుఫ్యాక్చరింగ్, టెక్నికల్ రంగాలకు 4,520 మంది రాగా 610 మందికి ఉద్యోగాలు లభించాయి.
బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ విభాగం 2,440 మంది ఇంటర్వ్యూలకు హాజరైతే 713 మంది ఎంపికయ్యారు. ఫార్మా, హెల్త్‌కేర్, హాస్పిటాలిటీ రంగంలో 2,167 మంది హాజరైతే 210 మందికి ఉద్యోగాలు లభించాయి. ఆటోమొబైల్స్ రంగంలో 952 మంది ఇంటర్వ్యూలకు హాజరైతే 102 మంది ఎంపిక కాగా 154 మంది షార్ట్‌లిస్ట్ అయ్యారు. లాజిస్టిక్స్, ఎయిర్‌పోర్ట్ రంగంలో 1047 మంది ఇంటర్వ్యూలకు హాజరైతే 188 మంది ఎంపికయ్యారు. మొత్తం 4,574 మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించాయి.
మారుమూల ప్రాంతాల్లో ఇంజనీరింగ్, డిగ్రీ పూర్తి చేసిన యువత ఉద్యోగాల కోసం హైదరాబాద్ వంటి మెట్రో నగరాలకు వెళ్లే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా వారి ఊర్లోనే అవకాశాలు కల్పించాం. హుజూర్‌నగర్ పట్టణానికి దేశవ్యాప్తంగా పేరొందిన 259 కంపెనీలను తీసుకురావడం ద్వారా స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించటాన్ని గర్వంగా భావిస్తున్నాం. ఈ రోజు జాబ్ మేళాలో పాల్గొన్న వేలాది మంది యువతీ యువకులతో మాట్లాడగా చాలా మంది ఈ సమస్య గురించే చెప్పారు. అర్హతలున్నా అవకాశాలు దొరకవు. ఇప్పుడు ఈ మేళా.. వాళ్లకు ఆశాకిరణం.
ముందుగా ఈ జాబ్ మేళా 2 రోజులపాటు నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ కుదరలేదు. జాబ్ మేళా విజయవంతం కావడానికి సహకరించిన ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్, ఎస్పీ, అధికారులు, సిబ్బందికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామరావు, చింతల లక్ష్మీనారాయణ రెడ్డి, తన్నీర్ మల్లిఖార్జున్, దొంగరి వెంకటేశ్వర్లు, కొత్త శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
