- విత్తన ధృవీకరణ సంస్థలో పదేళ్ల దోపిడీ
- రూ.5 లక్షలకు చెక్ పవర్ పెంచుకొని అవినీతికి పాల్పడ్డాడు?
- నలుగురు సెక్రటరీలు మారినా సీటు వదలని ప్రొ.కేశవులు
- ఈ నెల 24తో ముగియనున్న డైరెక్టర్ పదవీకాలం
తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ గడ్డి కోసమన్నట్లు ఉంది విత్తన ధృవీకరణ సంస్థ (Seed Certification Agency) డైరెక్టర్ ప్రొ.కేశవులు తీరు. ప్రొ.జయశంకర్ (Prof.Jaishankar) వ్యవసాయ విశ్వవిద్యాలయం(Agricultural University)లో పాఠాలను బోధించాల్సిన ప్రొఫెసర్ ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పదేళ్లు డిప్యుటేషన్(Deputation)పై కొనసాగుతున్నారంటే అసలు మతలబేంటో అర్థంచేసుకోవచ్చు. ఈ పదేళ్లలో ఈయన.. సంస్థకు, ప్రభుత్వానికి, రైతులకు చేసింది శూన్యం. పదేళ్ల క్రితం 2 లక్షల ఎకరాల్లో ఉండే సీడ్ సర్టిఫికేషన్ ఏరియా నేడు లక్ష ఎకరాలకు పడిపోయింది.
రాష్ట్రాన్ని సీడ్ హబ్ (Seed Hub) చేస్తానంటూ ప్రభుత్వాల మెప్పు కోసం పదేపదే ప్రసంగాలు చేసి చివరకు విత్తన ధృవీకరణ సంస్థలో అవినీతి, అక్రమాలకు తెర లేపారు. కేశవులు డైరెక్టర్ (Director) పదవీ కాలం ఈ నెల 24తో ముగుస్తోంది. పదేళ్ల దోపిడీ, అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం విచారణ చేయాల్సి ఉంది. కేశవులు పదవి నుంచి వెళ్లిపోతే వీటిపై ఎవరిని ప్రశ్నిస్తారు?. నష్టం ఎవరు పూడుస్తారు. సంస్థలోని ఏ అధికారి బలి కావాలి? సంస్థ బాగు పడాలంటే గతంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageshwar Rao) ప్రకటించినట్లు విజిలెన్స్ విచారణ జరిపితేనే కేశవులు అక్రమాలు, అవినీతి, దోపిడీ వెలుగులోకి వస్తాయి.
డిప్యుటేషన్ కోసం.. డీల్స్..
కేశవులు 2015లో ఈ వర్సిటీకి డిప్యుటేషన్‌పై విత్తన ధృవీకరణ సంస్థ డైరెక్టర్‌గా వచ్చారు. 50 ఏళ్ల చరిత్ర గల ఈ సంస్థలో దశాబ్ధ కాలం డైరెక్టర్‌గా కొనసాగింది ఈయన ఒక్కరు మాత్రమే. సాధారణంగా డిప్యుటేషన్ అంటే 5 ఏళ్లు. కేశవులు మాత్రం పదేళ్లు సంస్థను వదల్లేదు. పదవిలోకి రాగానే ప్రైవేట్ సీడ్స్ కంపెనీలకు కీలు బొమ్మగా మారాడనేది అతని ప్రాక్టీసే స్పష్టం చేస్తుంది. ప్రతిసారీ డిప్యుటేషన్ పెంపు సమయంలో బడా సీడ్స్ సంస్థల యజమానుల పైరవీలతోనే డైరెక్టర్ సీటు కాపాడుకుంటూ వచ్చాడన్నది బహిరంగ రహస్యం. దీనికోసం ఆయన చేయని పైరవీ లేదు. తొక్కని గడప లేదు.
పదేళ్లలో బడా ప్రైవేట్ సీడ్ కంపెనీల నుంచి స్పాన్సర్‌షిప్పుల కింద పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ డబ్బంతా ఏం చేశారనేది తేలాల్సి ఉంది. మరోవైపు.. అవసరం లేకున్నా రూ.5 కోట్లు పెట్టి సిద్దిపేట, సూర్యాపేట, వనపర్తిలో కొత్త ఆఫీసులు కట్టి నిధులు దుర్వినియోగం చేశారు. సంస్థ అభివృద్ధి కోసమే భవనాలను నిర్మిస్తే వాటిని నేటి వరకూ ఎందుకు వాడకంలోకి తేలేదు?. సంస్థకు లాభం చేయకపోగా భారం చేశారు. కరీంనగర్ సీడ్ ల్యాబ్‌లో విత్తన పరీక్షలు చేయకున్నా చేస్తున్నట్లు నేటికీ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తూనే ఉన్నారు.
అవసరంలేకున్నా రూ.28 లక్షలు పెట్టి విత్తన రథం పేరుతో బస్సు కొన్నారు. దాన్ని జీడిమెట్లలో వేస్ట్‌గా వదిలేశారు. ప్రైవేట్ సంస్థతో చేతులు కలిపి రూ.50 లక్షలతో నిర్మించిన GOT ఫామ్‌ను సైతం నిరూపయోగంగా పడేశారు. రాష్ట్రాన్ని సీడ్ హబ్ చేయకపోవటంతో తెలంగాణలోని ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ నుంచి సీడ్ ప్రొడక్షన్ ఏపీలోని ఏలూరు, రాజమండ్రి, నంద్యాల, ప్రకాశం జిల్లాలకు, కర్ణాటకలోని బళ్లారి, గజేంద్రగాడ్ ప్రాంతాలకు తరలిపోయింది. ఇవ్వన్నీ ప్రైవేట్ విత్తన సంస్థల కోసం చేసినవే అని తేలింది.
చెక్ పవర్ రూ.5 లక్షలకు పెంచుకొని మరీ..
విత్తన ధృవీకరణ సంస్థ డైరెక్టర్లు అంతర్గత వ్యవహారాల కోసం రూ.లక్ష చెక్ పవర్‌తో డబ్బు డ్రా చేసుకొని సంస్థను నడిపించారు. రూ.లక్షకు మించి ఏదైనా ఖర్చు ఉంటే ప్రభుత్వ అనుమతి తీసుకునేవారు. దీంతో ఖర్చుల విషయంలో ప్రభుత్వ పర్యవేక్షణ ఉండేది. ఖర్చులూ పరిమితిలోనే ఉండేవి. కేశవులు బాధ్యతలు తీసుకొని ఏడాది కాగానే చెక్ పవర్‌ను రూ.5 లక్షలకు పెంచుకున్నారు. సంస్థ రెవెన్యూను, ప్రభుత్వ నిధులను విచ్చలవిడిగా ఖర్చుపెట్టారు.
అక్రమాలపై విచారణ ఇంకెప్పుడు?
కేశవులు అవినీతి, అక్రమాలు ఏజీ ఆడిటింగ్‌తో తవ్వేకొద్దీ పుట్టగొడుగుల్లా వచ్చాయి. RKVY & SMSP కింద వచ్చిన రూ.20 కోట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులను దుర్వినియోగం చేశాడు. రూ.2 కోట్లు ఖర్చు పెట్టి 25 దేశాలకు, 385 రోజులు, 45 ఫారిన్ ట్రిప్‌లు వెళ్లాడు. ప్రభుత్వానికి ఒక్క టూర్ రిపోర్టూ సబ్మిట్ చేయలేదు. నిబంధనలకు విరుద్ధంగా ఫారిన్ టూర్లకు వెళ్లినపుడల్లా పెర్ డెమ్ కింద దాదాపు రూ.25 లక్షలు, ఏటా లక్షా యాబై వేల చొప్పున రూ.15 లక్షల మెడికల్ రియింబర్స్‌మెంట్(MR)ను క్లెయిమ్ చేసుకున్నారు.
అధికార, అనధికార టూర్లు కలిపి నేటికి 100 సార్లకు పైగా విమానాల్లో దేశీయ ప్రయాణాలు చేశారు. టెండర్ లేకుండా ఎగ్జోటిక్ ఈవెంట్స్ లాంటి ప్రైవేట్ కంపెనీలకు రూ.2 కోట్లకు పైగా బిల్లులు చెల్లించారు. రైతు సమన్వయ సమితి మీటింగ్ నిర్వహణకు రూ.94 లక్షలు, వరంగల్‌లో ఆఫీస్ నిర్మాణం చేయకముందే కాంట్రాక్టర్‌కు రూ.95 లక్షలు చెల్లించారు. సొంత అవసరాల కోసం ప్రభుత్వ వాహనాలు వాడి రూ.12 లక్షల సంస్థ రెవెన్యూ దుర్వినియోగం చేశారు. చిర్రా ధనలక్ష్మి, విజయ్ కుమార్ సహా సంస్థకు సంబంధంలేని 13 మంది వ్యక్తులకు ఇప్పటికే రూ.85 లక్షల జీతాలు ఇస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా సెదాట్స్ అనే ప్రైవేట్ సాఫ్ట్‌వేర్ కంపెనీకి చెందిన ఇద్దరికి నెలకు రూ.లక్షా 20 వేల చొప్పున ఏడాదికి రూ.15 లక్షల జీతాలు చెల్లించారు.
2019లో ISTA విత్తన సదస్సుకు 10 కోట్ల ప్రభుత్వ సొమ్ము దుబారాగా ఖర్చు చేశాడు. హైదారాబాద్‌లో పేరొందిన హైటెక్స్, నోవాటెల్, తాజ్ కృష్ణా, గోల్కొండ, రాడిసన్ బ్లూ లాంటి స్టార్ హోటళ్లలో రూ.లక్షలు ఖర్చు పెట్టి మీటింగులు నిర్వహించారు. ప్లేట్‌కు రూ.10 వేలతో కాక్ టెయిల్ డిన్నర్లు పెట్టారు. సొంత అవసరాల కోసం సంస్థ డబ్బుతో లెక్కలేనన్ని ఐఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు కొన్నారు. మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సన్నిహితుడైన కాకాని కన్సల్టెన్సీ ఔట్ సోర్సింగ్ కంపెనీ.. ఉద్యోగులకు రూ.10 లక్షలు PF ఎగ్గొట్టినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
మంత్రి తుమ్మలను కాదని..
పదవిని కాపాడుకోవటానికి వ్యవసాయ శాఖ మంత్రులను, కార్యదర్శులను బుట్టలో వేసుకోవటంలో కేశవులు దిట్ట. ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలకు కూడా మాయమాటలు చెప్పి నమ్మించాలని ప్రయత్నం చేసినా పప్పులు ఉడకలేదు. నవంబర్ 24వ తేదీ దగ్గర పడుతుండటంతో తుమ్మల దగ్గర పనవ్వట్లేదని భావించి మంత్రిని కాదని సీఎస్ పేషీ, CMO పెషీల చుట్టూ తిరుగుతూ.. డైరెక్టర్ పదవి కోసం తెలంగాణలోని బడా ప్రైవేట్ విత్తన కంపెనీల ద్వారా ప్రభుత్వంలో పైస్థాయి వారికి ముడుపులు ఆశచూపుతూ.. తుమ్మలపై ఒత్తిడి పెంచుతున్నాడని విశ్వసనీయ సమాచారం.
కేశవులుపై చర్యలు తీసుకోవాలి: డా.రాధావత్ రాజేష్‌నాయక్, ఛైర్మన్, గిరిజన జేఏసీ
పదేళ్లలో కేశవులు విత్తన సంస్థలో దోపిడీ చేశారు. ఇదే విషయాన్ని గతంలో మంత్రి తుమ్మల, వ్యవసాయ శాఖ కార్యదర్శి, ఏసీబీ, విజిలెన్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. వీరికే కాకుండా గవర్నర్‌కి కూడా వినతిపత్రాలు అందజేశాను. అయినా విచారణ చేయలేదు. దీంతో.. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌కూ ఫిర్యాదు చేశాం. ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతారనే నమ్మకం ఉంది. విచారణతోనే అవినీతి, అక్రమాలు వెలుగులోకి వస్తాయి.
