Friday, October 3, 2025
ePaper
HomeతెలంగాణCold Storage | రైతును రాజును చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

Cold Storage | రైతును రాజును చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

  • శీతల గోదాముల నిర్మాణానికి శంఖుస్థాపన
  • కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే యూరియా సమస్య
  • మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

రైతును రాజు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ,గృహ నిర్మాణ,సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలో గురువారం జిల్లా కలెక్టరు అనుదీప్ దురిశెట్టి, సిపి సునీల్ దత్ తో కలిసి ఆయన పర్యటించారు. పర్యటనలో భాగంగా యం. వెంకటాయపాలెం గ్రామంలో 15 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 9 వేల 700 మెట్రిక్ టన్నుల శీతల గోదాముల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత 10 సంవత్సరాల కాలంలో గత పాలకులు గిడ్డంగుల సామర్థ్యం 3 లక్షల మెట్రిక్ టన్నుల పెంచితే,ప్రజా ప్రభుత్వం 5 లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల గోదాముల నిర్మాణ పనులు చేపట్టిందని,రాబోయే 3 సంవత్సరాలలో వీటిని పూర్తి చేస్తామని అన్నారు. గిడ్డంగుల సంస్థ ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా మొదటిసారిగా జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ గా కోల్డ్ స్టోరేజ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, 9700 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో కోల్డ్ స్టోరేజ్ ను 15 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నామని, సంవత్సర కాలంలో కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం పూర్తి చేసి, వాణిజ్య పంటలు పండించే రైతన్నలకు ప్రైవేటు కంటే అతి చౌకగా కోల్డ్ స్టోరేజ్ అందుబాటులోకి తీసుకుని వస్తామని అన్నారు. రైతులను రాజు చేయడమే లక్ష్యంగా నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్ల యూరియా సమస్య ఏర్పడితే ఢిల్లీలో రైతుల పక్షాన పోరాటం చేసి రైతులకు యూరియా సరఫరా చేసామని, రాబోయే వారం రోజులలో యూరియా సమస్య పరిష్కారం అవుతుందని మంత్రి పొంగులేటి తెలిపారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరావు మాట్లాడుతూ స్థానిక రైతులకు ఉపయోగపడే విధంగా కార్పోరేషన్ చరిత్రలో మొట్టమొదటి సారిగా కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, దీనిని రైతులు పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని కోరారు.

ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభం..
ఆరెంపుల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన జెల్ల విజయ కుమారి, చెన్నబోయిన నరేష్, షేక్ నాగుల్ పాషా, చిర్ర రాజ్యం, సమర్థపు మమత, షేక్ రంజాన్ పాషా లకు చెందిన ఇళ్లను మంత్రి పొంగులేటి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి, లబ్ధిదారులతో కలిసి గృహ ప్రవేశంలో పాల్గొన్నారు. లబ్ధిదారులు చిర్ర రాజ్యం ఇంట్లో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సిపి సునీల్ దత్ తో కలిసి ఆయన భోజనం చేశారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ అధికారం, స్వార్థం కోసం కాకుండా పేద ప్రజల ఆత్మగౌరవం కోసం ఉపయోగపడాలనే తాపత్రయంతో సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో గృహ నిర్మాణ శాఖను తనకు కేటాయించారని తెలియజేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యంలో దివంగత వైఎస్ఆర్ హయాంలో 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తే, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో గత పాలకులు హౌసింగ్ కార్పోరేషన్ ను రద్దు చేశారని ఆయన విమర్శించారు.

పేదల ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇందిరమ్మ ఇళ్లు
పేదల ఆత్మగౌరవానికి చిహ్నంగా, భరోసా, ధైర్యం అందించేలా ఇందిరమ్మ ఇండ్లను ప్రజా ప్రభుత్వం నిర్మిస్తుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. గత పాలకులు పేదల సొంతింటి నిర్మాణాలను పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేశారని, ధనార్జన కోసం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వారి హయంలోనే కూలిపోయిందని ఎద్దేవా చేశారు. గిరిజన ప్రాంతంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం జరిగిందని, తర్వాత రాష్ట్రంలోనే పాలేరు నియోజకవర్గంలో నేడు గృహ ప్రవేశాలు జరుగుతున్నాయని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. తదుపరి ఆరెంపులలో సీసీ రోడ్డు, పశు సంవర్ధక ఉప కేంద్రం నూతన భవనం, ప్రహరీ గోడ, మరుగుదొడ్ల నిర్మాణాలకు, ప్రాథమిక పాఠశాలలో అదనపు తరగతి గదిల నిర్మాణ పనులకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు.ఎదులాపురం మున్సిపాలిటీ ప్రాంత లబ్ధిదారులకు సిఎంఆర్ఎఫ్ చెక్కులను మంజూరైన నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇరిగేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఎండి కొర్ర లక్ష్మీ, ఆర్ అండ్ బి ఎస్ఇ యాకోబు, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, పీఆర్ ఇఇ మహేష్ బాబు, జిల్లా బీసీ సంక్షేమ అధికారిణి జి. జ్యోతి, హౌజింగ్ పిడి భూక్యా శ్రీనివాస్, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ లు హరినాథ బాబు, వెన్నపూసల సీతారాములు, తహసీల్దార్ రాంప్రసాద్, ఎంపిడివో శ్రీదేవి, ఎంఇఓ శ్రీనివాసరావు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News