- యువత కలలను కళ్ళు చేసిన ప్రభుత్వం..
- సాంప్రదాయ కోర్సులకే విద్యార్థులు పరిమితం..
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన నూతన మార్పులు తెలంగాణ యువత కలలను కల్లలు చేయనున్నాయి. నూతన సాంకేతిక విద్యావకాశాలకు బడుగు విద్యార్థులను దూరం చేయనున్నాయి. సంప్రదాయ కోర్సులకే వారు మళ్లీ పరిమితం కానున్నారు. ఈనాటి నిరుపేద విద్యార్థులు కూడా మళ్లీ దశాబ్దన్నర క్రితం నాటి దుర్భర పరిస్థితులను అనుభవించనున్నారు. విద్యా అసమానతలు పెరుగనున్నాయి. సూటిగా చెప్పాలంటే పురోగమన మార్గం నుంచి తిరోగమనం వైపునకు ఈనాటి యువతను నడిపించే పరిస్థితులే కనిపిస్తున్నాయి. తెలంగాణ విద్యావేత్తల్లో సర్వత్రా ఇవే భయాందోళనలు నెలకొన్నాయి.
నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంతో వేసిన పునాదులపై కేసీఆర్ ఆశల సౌధాలను నిర్మిస్తే.. నేడు రేవంత్ సర్కార్ అందుకు భిన్నంగా ఉన్న ఆయువునే తీసే చర్యలకు పూనుకొన్నదనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 7 ద్వారా డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్) పద్ధతిని ప్రవేశపెట్టాలని నిర్ణయించడంతో బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు తీరని నష్టం చేకూరనున్నది.
ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధన వల్ల ఉన్నత విద్యావకాశాలు ఇకపై కొన్ని పట్టణాలకే పరిమితమయ్యే అవకాశమున్నది. ఫీజుల భారాన్ని భరించలేక బడుగు విద్యార్థులు కాలేజీల్లో చేరకుంటే సీట్లు నిండక ప్రస్తుతమున్న అరకొర కాలేజీలను సైతం ప్రైవేట్ యాజమాన్యాలు ఎత్తివేయక తప్పని పరిస్థితులు ఎదురవనున్నాయి. గ్రామీణ విద్యార్థులు, తల్లిదండ్రులపై అదనపు భారం కూడా పడనున్నది. అంతిమంగా ఉన్నత విద్య మళ్లీ మిథ్యగానే మిగిలిపోయే పరిస్థితులు దాపురించనున్నాయి.
