Homeఆదాబ్ ప్రత్యేకంSrini Developers | సీఎం గారూ.. ఈ అక్రమ క్రషర్‌ను ఆపండి..

Srini Developers | సీఎం గారూ.. ఈ అక్రమ క్రషర్‌ను ఆపండి..

  • యాదాద్రి-భువనగిరి జిల్లా రాజాపేట మండలం చల్లూరులో రోజురోజుకూ ముదురుతున్న క్రషర్ వివాదం
  • తాజాగా.. డైరెక్టర్ ఆఫ్ మైనింగ్ అండ్ జియాలజీకి శ్రీని డెవలపర్స్‌పై ఫిర్యాదు
  • ప్రజల సంపదను బహిరంగంగా దోచుకుంటుంటే ఎవరికీ పట్టదా?
  • ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం జరుగుతుంటే ప్రజాప్రతినిధులకు చీమ కుట్టినట్లయినా ఉండదా?
  • పెద్దఎత్తున ఉద్యమిస్తామంటున్న ప్రజలు, ప్రజా సంఘాలు, సామాజికవేత్తలు, రాజకీయ నాయకులు

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అంటే అధికారులకు భయం లేకుండా పోయినట్లుంది. ప్రజా పాలన అని ఆయన చెబుతున్న మాటలు నీటి మీద రాతలుగానే మిగిలిపోతున్నట్లు కనిపిస్తోంది. అక్రమాలను సహించేది లేదంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఇచ్చే ఆదేశాలే అమలుకు నోచుకుంటే ఒట్టు. ప్రజల సొమ్మును దోచుకునేవారికి కటకటాలు తప్పువంటూ రేవంత్ రెడ్డి పలు మీటింగ్‌ల్లో జారీచేస్తున్న హెచ్చరికలను ఎవరూ ఖాతరు చేస్తున్నట్లు లేదు. శ్రీని డెవలపర్స్ సంస్థ నాలుగేళ్ల నుంచి అక్రమంగా క్రషింగ్ (Illegal Crushing) బిజినెస్‌ చేస్తూ అందినకాడికి దండుకుంటూ ఉంటే అందరూ మౌనంగా చూస్తూ ఉండటమే దీనికి తిరుగులేని ఉదాహరణ అని చెప్పొచ్చు.

Srini Developers Illegal Crusher Scam in Yadadri0

ఏడాదికి రూ.72 కోట్లు..

యాదాద్రి-భువనగిరి జిల్లా రాజాపేట మండలం చల్లూరు గ్రామంలోని సర్వే నంబర్ 322/4లో శ్రీని డెవలపర్స్ అనే క్రషర్ 2021 నుంచి ఇప్పటివరకు నాన్ స్టాప్‌గా మైనింగ్ చేస్తూ ఉంది. 2020లోనే అమ్మిన భూమి పత్రాలను పెట్టి 2021లో పర్మిషన్ తెచ్చుకొని ప్రజా సంపదన దోచుకుంటూ ఇప్పటికే కొన్ని వందల కోట్లను సంపాదించినట్లు తెలుస్తోంది. ఈ కంపెనీ ఓనర్లు.. కర్నాటి శ్రీదేవి w/o కర్నాటి నారాయణరావు(లేట్), కర్నాటి యశ్వంత్ శ్రీనివాస్ s/o కర్నాటి నారాయణరావు. ఈ క్రషర్‌తో ఒక్క గంటలో సుమారు 300 టన్నుల కంకరను వెలికితీస్తున్నారు. దీన్ని అమ్మటం ద్వారా రోజుకు సుమారు రూ.20 లక్షలు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా నెలకు రూ.6 కోట్లు, ఏడాదికి సుమారు రూ.72 కోట్లు సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం.

- Advertisement -
Srini Developers Illegal Crusher Scam in Yadadri3

మీకూ వాటాలు అందుతున్నాయా?

ఈ విధంగా గత నాలుగేళ్లలో దాదాపు రూ.300 కోట్ల ప్రభుత్వ సంపదను శ్రీని డెవలపర్స్ తమ ఖాతాలో వేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంత బహిరంగంగా.. భూమి అమ్మేసిన పేపర్లు పెట్టి అనుమతులు పొంది ఇష్టారాజ్యంగా వ్యాపారం చేస్తుంటే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో గానీ ప్రస్తుత కాంగ్రెస్ సర్కారులో గానీ అధికారులు చర్యలు చేపట్టకపోవటంపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  ఆలేరు శాసన సభ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత గొంగిడి సునీత, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య (Beerla Ilaiah) ఈ ఇల్లీగల్ బిజినెస్‌పై ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వాళ్ల వాటాలు వాళ్లకు చేరుతుండటం వల్లే నోరెత్తట్లేదా అని స్థానికులు విమర్శిస్తున్నారు.

Srini Developers Illegal Crusher Scam in Yadadri2

ఆధారాలున్నా ఎందుకీ మౌనం..

ప్రజాప్రతినిధులై ఉండి ప్రజా సంపద ఏమైపోతున్నా వీళ్లు పట్టించుకోకపోవటం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భువనగిరి లోక్‌సభ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) ఎందుకు ప్రజా సంపదను కాపాడే ప్రయత్నం చేయట్లదని ప్రజా సంఘాలు నిలదీస్తున్నాయి. అందరికీ చెందాల్సిన సంపదను కొందరే బొక్కుతున్నా ఎమ్మెల్యే, ఎంపీ నోరు మెదపట్లేదంటే వీళ్లు కూడా ఆ అక్రమ వ్యాపారంలో వాటాదారులేనా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ అడ్డగోలు తతంగాన్ని ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచుతున్నా నాయకులు, అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారో సమాధానం చెప్పాలని జిల్లా మరియు మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Srini Developers Illegal Crusher Scam in Yadadri1

వదిలిపెట్టే ప్రసక్తే లేదు..

ఈ అక్రమ వ్యవహారంపై తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫరర్స్ అసోసియేషన్ తాజాగా డైరెక్టర్ ఆఫ్ మైనింగ్ అండ్ జియాలజీకి ఫిర్యాదు చేసింది. ఈ అనధికారిక క్రషర్‌ను, శ్రీని డెవలపర్స్ సంపాదించిన రూ.300 కోట్లను వెంటనే రికవరీ చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని చెబుతున్నారు. అక్రమ క్రషర్ బంద్ అయ్యే వరకు, యాదాద్రి భువనగిరి జిల్లా సంపద జిల్లా ప్రజలకే చెందే వరకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అంటున్నారు.

srini

అయ్యా సీఎం గారూ..

గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ.. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మైనింగ్ శాఖకు, మీకు తెలియకుండా శ్రీని డెవలపర్స్ అక్రమంగా క్రషర్ నడుపుతూ కోట్లు కొల్లగొడుతోంది. ఈ సంస్థపైన ఎంతో మంది లిఖితపూర్వకంగా ఆధారాలతో సహా ఫిర్యాదు చేయటం జరిగింది. ఇదే ఏరియా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మీ పార్టీకి చెందినవారే. ఈ విషయాన్ని స్థానిక ప్రజలు చాలా సార్లు ఆయన దృష్టికి తీసుకెళ్లినా దీని మీద కన్నెత్తి చూసిన పాపానపోలేదు. అయ్యా సీఎం గారూ.. మన రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో శ్రీని డెవలపర్స్ అక్రమంగా దోచుకున్న సొమ్మును స్వాధీనం చేసుకుంటే మీరు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు, సబ్సిడీలకు, రాజాపేట మండలం ప్రజలకు ఉపయోగపడతాయి.

త్వరలో మరో కథనం

ఇంటలిజెన్స్ ద్వారా, మీ చుట్టూ ఉన్న అధికారుల ద్వారా ఈ ప్రభుత్వ సంపద దోపిడీపై విచారణ జరిపిస్తే మరిన్ని అక్రమాలు బయటపడతాయి. కాబట్టి ఇప్పటికైనా శ్రీని డెవలపర్స్‌పై చర్యలు తీసుకొని ఇల్లీగల్ సంపదను రికవరీ చేసి అక్రమార్కులకు బుద్ది చెప్పాలని యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలు కోరుతున్నారు. ఈ కుంభకోణంలో చక్రం తిప్పుతున్నవారికి సంబంధించిన మరిన్ని వివరాలను మరో కథనం ద్వారా ఆదాబ్ హైదరాబాద్ దినపత్రిక త్వరలో వెలుగులోకి తేనుంది. మా అక్షరం అవినీతిపై అస్త్రం.

- Advertisement -
RELATED ARTICLES

Latest News