- ప్రజారంజకంగా పాలించిన మహనీయుడు..
- అభిజిత్ నక్షత్రంలో జన్మించిన శ్రీరామచంద్రుడు..
శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో పరిపూర్ణ మానవావతారం శ్రీరాముడు. భగవంతుడైన రాముడు తానే స్వయంగా మనిషిగా జన్మించి సామాన్య మానవుని వలే ఎన్నో కష్టనష్టాలు భరించి, భార్య వియోగాన్ని పొంది తుదకు రావణాసుర సంహారం చేసి తన పరాక్రమాన్ని చాటుకున్నాడు. వేలాది సంవత్సరాలు ప్రజారంజకంగా పరిపాలించి తుదకు సరయు నదిలో జలప్రవేశం చేసి అవతార పరిసమాప్తి చెందాడు. చైత్ర శుద్ధ నవమి రోజు శ్రీరాముని జన్మదినమే కాదు, సీతారాముల కల్యాణం కూడా! ఈ సందర్భంగా సీతారాముల కల్యాణ వైభోగాన్ని గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
శ్రీరాముడు చైత్ర శుద్ధ నవమి రోజు పునర్వసు నక్షత్ర యుక్త కర్కాటక లగ్నంలో సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు జన్మించాడు. ఈ ముహుర్తాన్ని అభిజిత్ లగ్నం అంటారు. పురాణాల ప్రకారం శ్రీరాముడు త్రేతాయుగంలో జన్మించాడని తెలుస్తోంది. ఈ ముహుర్తాన్ని అనుసరించి జ్యోతిష్య శాస్త్ర పండితులు ఎన్నో పరిశోధనలు జరిపి శ్రీరాముడు క్రీస్తు పూర్వం 5114, జనవరి 10వ తేదీన జన్మించి ఉండవచ్చని అంచనా వేశారు. అప్పట్లో జనవరి నుంచి చైత్ర మాసం ప్రారంభమయ్యేది.
దశరథుని ప్రియ పుత్రుడైన రాముడు విశ్వామిత్రుని యాగాన్ని రక్షించడానికి ఆయన వెంట వెళ్లి అతి చిన్న వయసులోనే రాక్షస సంహారం చేశాడు. అక్కడ నుంచి లేత యవ్వన ప్రాయంలో ఉన్న రామలక్ష్మణులను విశ్వామిత్రుడు మిథిలా నగరానికి తీసుకెళ్తాడు.
జనకుని ముద్దుల కుమార్తె సీతాదేవి. ఈమె అయోనిజ. భూమిలో నాగటి చాలుకు తగిలి జనకునికి దొరుకుతుంది. జనక మహారాజు ఇంట పెరుగుతుంది. జనక మహారాజు అంతఃపురంలో ఆయన పూర్వీకుల నుంచి వస్తున్న శివధనుస్సు ఉండేది. ఈ శివధనుస్సును సాక్షాత్తు శివుడే జనకుని పూర్వీకులకు అందించాడు.
సీతాదేవి బాల్యంలో ఒకసారి బంతితో ఆడుకుంటూ ఉండగా ఆ బంతి శివధనస్సు కిందకు వెళ్తుంది. అమిత పరాక్రమవంతులు కనీసం జరపలేని శివధనుస్సును సీతాదేవి ఎడమచేతితో అవలీలగా పక్కకు జరిపి బంతిని తీసుకుంటుంది. ఈ అద్భుతాన్ని చూసిన జనక మహారాజు ఎవరైతే ఈ శివధనుస్సును విరుస్తారో వారికే సీతను ఇచ్చి వివాహం జరిపిస్తానని చాటింపు వేయిస్తాడు. ఆ ప్రకారంగా సీతా స్వయంవరానికి సుమూర్తం నిశ్చయిస్తారు. విశ్వామిత్రునికి ఈ విషయం తెలిసి రామలక్ష్మణులను వెంట బెట్టుకుని మిథిలా నగరానికి వెళ్తాడు. అక్కడ జరుగుతున్న స్వయంవరంలో ఎందరో రాజులు, పరాక్రమవంతులు, వీరులు శివధనుస్సును ఎక్కుపెట్టాడానికి ప్రయత్నించి విఫలమవుతారు.
ఆ సమయంలో శ్రీరాముడు విశ్వామిత్రుని ఆదేశం మేరకు శివధనుర్బంగం చేసి సీతమ్మను వరించి ఆమె మనసులో ఆనందాన్ని నింపుతాడు. కల్యాణ ఘడియలు సమీపించినప్పుడు అన్నీ అలా కలిసి వస్తాయని పెద్దలు అంటారు కదా! అదే మన రామయ్య విషయంలో కూడా జరిగింది. శివధనుర్బంగం జరిగాక జనకుడు పరమ సంతోషంతో విశ్వామిత్రునితో ‘ఓ మహర్షీ! ఎంతో అసాధ్యమైన పనిని శ్రీరాముడు అవలీలగా చేశాడు.
మీరు అనుమతి ఇస్తే సీతను శ్రీరాముని కిచ్చి వివాహం జరిపిస్తాను’ అని పలుకుతాడు. అప్పుడు శ్రీరాముడు ‘శివధనుస్సును అయితే విరిచాను కానీ వివాహానికి మా తండ్రి దశరథ మహారాజు గారి అనుమతి కావాలి అని అంటాడు’ విశ్వామిత్రుడు కూడా శ్రీరాముడు చెప్పింది సబబే కాబట్టి అందుకు కావలసిన ఏర్పాట్లు చేయమని జనక మహారాజుకు చెప్తాడు.
జనకుని మంత్రులు వాయువేగంతో అయోధ్యకు పయనమై వెళ్లారు. దశరథ మహారాజును కలిసి శ్రీరాముడు చేసిన శివధనుర్బంగం గురించి వివరించి సీతారాముల కల్యాణానికి ఆహ్వానిస్తారు. అప్పుడు దశరథ మహారాజు ఎంతో సంతోషించిన పరివారంతో కలిసి మిథిలా నగరానికి బయల్దేరి వెళ్లారు. దశరథ మహారాజుకు జనక మహారాజు సకల లాంఛనాలతో స్వాగతం పలుకుతాడు. వివాహానికి ముందు జరగాల్సిన యజ్ఞయాగాది క్రతువులు పూర్తయ్యాక జనక మహారాజు సర్వాలంకార భూషితమైన సీతాదేవిని వివాహ వేదిక వద్దకు స్వయంగా తీసుకు వస్తాడు. సమంత్ర పూర్వకంగా జలాన్ని విడుస్తూ కన్యాదానం చేస్తాడు.
శ్రీరాముడు సీతాదేవిని పాణిగ్రహణం చేసిన సమయంలో ఆకాశంలో దేవదుందుభులు మ్రోగుతాయి. పుష్ప వర్షం కురుస్తుంది. దశరథుడు ఇది చూసి ఎంతో సంతోషిస్తాడు. అపురూపమైన ఆ ఆనందకర సమయంలో దివి నుంచి పూల వర్షం కురుస్తుంది. గంధర్వులు గానం చేస్తారు.అప్సరసలు నాట్యం చేస్తారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు శ్రీరామనవమి రోజు సీతారాముల కల్యాణం అంగరంగ వైభోగంగా జరిపించడం సంప్రదాయంగా మారింది.
రాములోరి కల్యాణం అంటే ఊరంతా పండగే! శ్రీరామ భక్తులు ప్రతి ఆలయంలో, వీధుల్లో చలవ పందిళ్లు వేసి ఉత్సాహంగా సీతారాముల కల్యాణాన్ని ఘనంగా జరిపిస్తారు. శ్రీరాముడు స్వయంగా వెలసిన భద్రాచలంలో సీతారాముల కల్యాణ సంబరాలు అంబరాన్నంటుతాయి. ఇక రామజన్మభూమి అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు కోలాహలంగా సాగుతాయి. ఈ రోజు మనం కూడా మిథిలా నగరంలో సీతారాముల కల్యాణ వైభోగంలో పాలు పంచుకున్నట్లుగా భావించి తరిద్దాం.
జైశ్రీరామ్..
