సౌదీ అరేబియా(Saudi Arabia)లోని రియాద్ నగరం(Riyadh City)లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. TASA & సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్(Saudi Arabia Telugu Association-SATA) Riyadh సంయుక్త ఆధ్వర్యంలో వీటిని నిర్వహించారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగల విశిష్టతను ప్రతిబింబించేలా సంప్రదాయ పద్ధతుల్లో ఈ వేడుకలు జరగడం విశేషం. ఈ కార్యక్రమానికి TASA Founder స్వామి స్వర్ణ, TASA అధ్యక్షుడు మురారి, రియాద్ వైస్ ప్రెసిడెంట్ మహేంద్ర వాకాటి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. TASA ముఖ్య సభ్యులు అనిల్ మర్రి, ఇబ్రహీం షేక్, నటరాజ్, అజయ్ రావూరి, సాయి సహా TASA కోర్ టీమ్ సభ్యులు కార్యక్రమంలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
ప్రత్యేక ఆహ్వానంపై SATA Founder మల్లేశం హాజరు కాగా SATA రియాద్ అధ్యక్షుడు శ్రీనివాస్ మచ్చ ప్రతినిధులుగా SATA వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ నూరుద్దీన్, సురేష్, లోకేష్ కోకిల, శ్రీనివాస్, తేజ, రాకేష్, ఇతర SATA కోర్ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా మహిళలు లంగా–ఓణీలు, చీరలు ధరించగా, పురుషులు పంచె–కుర్తాల్లో మెరిశారు. ముగ్గుల పోటీలు, హరిదాసు వేషాలు, గొబ్బెమ్మల ఆటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పిల్లల కోసం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, పాటలు, స్కిట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పులిహోర, పొంగలి, గారెలు, బూరెలు వంటి సంప్రదాయ వంటకాలతో ఏర్పాటుచేసిన విందు అందరి ప్రశంసలు పొందింది.
ఈ సందర్భంగా సమాజానికి సేవ చేసిన పలువురికి అతిథి సత్కారం, అవార్డుల ప్రదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు సంస్థల నేతలు మాట్లాడుతూ.. దూర దేశంలో ఉన్నప్పటికీ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, ఐక్యతను కాపాడటంలో తెలుగు సంఘాల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ముఖ్యంగా రియాద్‌లో నివసిస్తున్న తెలుగు కుటుంబాలకు ఈ వేడుకలు స్వదేశంలో సంక్రాంతి పండుగను జరుపుకున్న అనుభూతిని అందించాయని తెలిపారు.
