- శక్తినగర్ హనుమాన్ గుడి పక్కన నరకం చూస్తున్న ప్రజలు!
సదాశివపేట మున్సిపాలిటీలో అధికారుల బాధ్యతారాహిత్యం ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. శక్తినగర్ హనుమాన్ గుడి పక్కన డ్రైనేజీ మురుగు రోడ్లపైనే పొంగిపొర్లుతూ బహిరంగ మురుగు కాలువలా మారినా, నివారించాల్సిన అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అడుగుతీసి అడుగు వేయలేని విధంగా మురుగు పేరుకుపోయి, వెలువడుతున్న భరించలేని కంపుతో స్థానికులు ఇళ్లల్లో ఉండలేక ఊపిరాడక అల్లాడిపోతున్నారు.
జీతాలు తీసుకుంటున్న అధికారులు ఏం చేస్తున్నారు? కాలనీవాసుల తీవ్ర ఆగ్రహం!Sadashivpet
పన్నులు వసూలు చేయడంలో చూపే వేగం, ప్రజల సమస్యలు తీర్చడంలో ఎందుకు కనిపించడం లేదని స్థానికులు నిలదీస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమై రోజుల తరబడి మురుగునీరు నిలిచి ఉన్నా అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం వారి నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం. మురుగు వాసనతో రోగాల బారిన పడుతున్నామని, విష జ్వరాలు ప్రబలి ఎవరైనా ప్రాణాలు కోల్పోతేగానీ అధికారుల్లో చలనం రాదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వెంటనే స్పందించి పారిశుధ్య పనులు చేపట్టాలి!
ఇప్పటికైనా మున్సిపల్ ఉన్నతాధికారులు తమ నిర్లక్ష్య వైఖరిని వీడి, వెంటనే సిబ్బందిని రంగంలోకి దించి యుద్ధప్రాతిపదికన పారిశుధ్య పనులు చేపట్టాలి. డ్రైనేజీ లీకేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి ప్రజలను రోగాల బారిన పడకుండా కాపాడాలని స్థానిక ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.(https://epaper.aadabhyderabad.in/), (Youtube)
