- వెయ్యి రోజుల ప్రజాపాలన థీమ్‌తో ప్రత్యేక గణపతి మండపం
- మెట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో వినూత్న ప్రతిమ.. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అద్దం పట్టేలా మండపం..
వినాయక చవితి సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక గణపతి మండపం భక్తులు, ప్రజలను ఆకట్టుకుంటోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబించేలా ‘తెలంగాణ రైజింగ్ – 1000 డేస్ యాజ్ సీఎం’ థీమ్‌తో మండపాన్ని తీర్చిదిద్దారు.
తెలంగాణ ఫిషర్‌మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మండపంలో గణపతి ప్రతిమను వినూత్నంగా రూపొందించారు. ‘బాహుబలి’(Baahubali Style Ganapati) చిత్రంలోని శివలింగాన్ని భుజాన మోసే సన్నివేశాన్ని పోలిన రీతిలో.. సీఎం రేవంత్‌రెడ్డి విగ్రహం భుజంపై గణనాథుడిని ఎత్తుకున్నట్లుగా ప్రతిమను తయారు చేశారు. తెల్ల చొక్కా, నల్ల ప్యాంటు, ఆకుపచ్చ కండువాతో రూపొందించిన రేవంత్ ప్రతిమ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మండపం చుట్టూ సంక్షేమ పథకాల ప్రదర్శన..
గణపతి ప్రతిమతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసేలా మండపం చుట్టూ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత వ్యవసాయ విద్యుత్, పంట నష్టపరిహారం వంటి రైతు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను ప్రదర్శించారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ వంటి కార్యక్రమాలను ఫ్లెక్సీల ద్వారా వివరించారు. ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పింఛన్లు, సన్నబియ్యం పంపిణీ, యువతకు ఉద్యోగ నియామకాలు, విద్యా భరోసా కార్డులు, రాజీవ్ ఆరోగ్యశ్రీ తదితర పథకాల వివరాలను కూడా మండపంలో పొందుపరిచారు.
అభివృద్ధి కార్యక్రమాలు అద్దం పట్టేలా..
రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ నది పునరుజ్జీవన ప్రణాళిక వంటి మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రదర్శనలో చేర్చారు. వెయ్యి రోజుల ప్రజాపాలనలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఒకే వేదికపై ప్రజలకు వివరించే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
గణపతి ప్రతిమతో పాటు మండపంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యక్రమాల ప్రదర్శన స్థానికంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. గణనాథుడిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు ప్రత్యేక ప్రతిమను ఆసక్తిగా తిలకించడంతో పాటు మండపంలో ఏర్పాటు చేసిన వివిధ పథకాల వివరాలను పరిశీలిస్తున్నారు. దీంతో ఈ వినూత్న గణపతి మండపం నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
