- నేడు కన్నీటి ధారకు నిలువెత్తు సాక్ష్యం..
- హక్కును భిక్షగా మార్చిన వైనం..
- విశ్రాంత జీవితం ` విషాద యాత్రగా మారుతున్న తీరుపై ప్రత్యేక కథనం
ప్రభుత్వం అనే మహావృక్షానికి ప్రభుత్వ ఉద్యోగి వేరు వంటివాడు. వేరు ఎంత బలంగా ఉంటేనే చెట్టు అంతగా విస్తరిస్తుంది, ఫలాలను ఇస్తుంది. కానీ దురదృష్టవశాత్తూ, నేడు ఆ వేళ్లను ఎండబెట్టే ప్రక్రియ నిస్సిగ్గుగా జరుగుతోంది. దశాబ్దాల పాటు తన రక్తాన్ని చెమటగా మార్చి, ప్రజల సేవలో జీవితాన్ని ధారపోసిన ఉద్యోగికి.. పదవీ విరమణ తర్వాత దక్కేది ‘ప్రశాంతత’ కాదు, ‘ప్రశ్నార్థకమైన భవిష్యత్తు’.
హక్కును భిక్షగా మార్చడం అన్యాయం:
ఒక ఉద్యోగి పదవీ విరమణ పొందాక వచ్చే బెనిఫిట్స్ అనేవి ప్రభుత్వం ఇచ్చే ఉచిత కానుకలు కావు. అవి వారు దశాబ్దాల పాటు దాచుకున్న జీవితకాల కష్టార్జితం. వారి సొంత డబ్బును వారికే ఇవ్వడానికి నెలల తరబడి, ఏళ్ల తరబడి వేచి చూసేలా చేయడం అంటే… ఆ ఉద్యోగి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే. ఇది కేవలం ఆర్థిక జాప్యం కాదు, ఒక రకమైన ‘వ్యవస్థాపక నేరం’. సంక్షేమ పథకాలకు కోట్లు కుమ్మరిస్తున్న పాలకులు, ఆ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లిన ఉద్యోగిని విస్మరించడం అత్యంత శోచనీయం.
విశ్రాంత జీవితం.. విషాద యాత్ర:
వృద్ధాప్యంలో సహజంగానే వైద్య ఖర్చులు పెరుగుతాయి. ఆ సమయంలో అండగా ఉండాల్సిన గ్రాట్యుటీ, కమ్యుటేషన్ సొమ్ము అందకపోవడంతో, రిటైర్డ్ ఉద్యోగులు ఆసుపత్రి ఖర్చుల కోసం ఇతరుల ముందు చేతులు చాచాల్సిన దుస్థితి నెలకొంది. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు: తన సొంత డబ్బు కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సి రావడం ఒక ఎత్తైతే.. అవినీతి కోరలు: పర్సంటేజీల పేరుతో లంచాలు అడగడం వ్యవస్థ దిగజారుడుతనానికి పరాకాష్టగా మారింది. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ‘వారధి’లా నిలిచే ఉద్యోగిని నిర్లక్ష్యం చేయడం అంటే, ప్రభుత్వ పునాదులను స్వయంగా బలహీనపరుచుకోవడమే.
నిజాయితీ గల ఉద్యోగి కన్నీరు, రాజ్యాంగ ధర్మానికే ముప్పు:
ఆర్థిక లోటుపాట్లు ఉండవచ్చు, కానీ వాటి సాకుతో ఒక మనిషి జీవిత చరమాంకాన్ని బలిపీఠం ఎక్కించడం తగదు. సంక్షేమ పథకాలపై ప్రచారాలు చేసుకునే ప్రభుత్వం, ఆ పథకాలను అమలు చేసిన ఉద్యోగి సంక్షేమాన్ని విస్మరించడం హాస్యాస్పదం. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం నిద్ర మేల్కోవాలి. విశ్రాంత ఉద్యోగుల పెండిరగ్ బిల్లులను యుద్ధ ప్రాతిపదికన విడుదల చేయాలి. వారికి అందాల్సిన గౌరవం, ఆర్థిక భరోసా సకాలంలో అందితేనే ఆశీస్సులు అందుతాయి. లేదంటే, వారి ఆవేదన అగ్నిపర్వతమై రేపు వ్యవస్థనే దహించివేస్తుందని పాలకులు గుర్తించాలి.
