- మూడు నెలలుగా వేతనాలు ఇవ్వని యాజమాన్యం.
- నాలుగేళ్లు పూర్తయ్యినా ఇంక్రిమెంట్లు ఇస్తలేరు.
- పీఎఫ్, ఈఎస్‌ఐ జీతంలో కత్తిరింపులు. ఖాతాల్లో జమ నిల్.
- వేడి వాతావరణంలో భద్రతా సదుపాయాలు లేవని కార్మికుల ఆవేదన.
- ఇష్టం ఉంటే చెయ్, లేదంటే వెళ్ళిపో.. మేనేజ్‌మెంట్ బెదిరింపులు.!
- కార్మికల రక్తం తోనే కంపెనీ నడుస్తోంది, కానీ జీవితం నిలవడం లేదు.
సూర్యాపేట జిల్లా కు కూతవేటు దూరంలో ఉన్న చివ్వెంల మండలంలో ఉన్న రావుస్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కార్మికులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడమే కాకుండా, నాల్గవ నెల కూడా ప్రారంభమైనా యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్టు నిర్లక్ష్యంగా ఉందని కార్మికులు పేర్కొన్నారు. జీతాలు ఆలస్యం కావడం వల్ల కుటుంబ పోషణ కష్టమైందని, పిల్లల స్కూల్ ఫీజులు, అద్దె, నిత్యావసర ఖర్చులు తీర్చలేక బీదరికం చుట్టుముట్టిందని కార్మికులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. కంపెనీలో ఇంక్రిమెంట్లు లేకుండా నలుగురు సంవత్సరాలు పూర్తయ్యాయి.ఏటా ఇవ్వాల్సిన బోనస్‌లు కూడా నిలిచిపోయాయి. మూడు నెలలకు ఒకసారి మాత్రమే ఒక నెల జీతం ఇస్తున్నారు అని కార్మికులు చెప్తున్నారు. జీతం పెంచమని అడిగితే ఇష్టం ఉంటే ఉండు,లేకపోతే పో అంటూ మేనేజ్‌మెంట్ బెదిరింపులు చేస్తున్నారని ఆరోపించారు.
పొమ్మనలేక పొగ పెడుతున్న యాజమాన్యం :
బీహార్ నుంచి వచ్చిన కార్మికులకు రూ.18,000 జీతం ఇస్తూ, స్థానికంగా ఉన్న కార్మికులకు కేవలం రూ.12,000 మాత్రమే ఇస్తున్నారనీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రాంతీయ వివక్షత అని స్థానిక కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మికులు చెబుతున్న ప్రకారం, గత నాలుగు సంవత్సరాలుగా పిఎఫ్,ఈఎస్‌ఐ కత్తిరిస్తున్నప్పటికీ, ఆ మొత్తాలను సంబంధిత ఖాతాల్లో జమ చేయడం లేదని ఆరోపించారు. సంస్థ పేరు పెద్దదే కానీ, లోపల శ్రమ దోపిడీ ఆగదు అంటూ వారు ఆదాబ్ కు వెళ్లబుచ్చారు.ఫ్యాక్టరీలో వెంటిలేషన్ లేకుండా ఉక్కపోతలో పని చేయాల్సి వస్తోందని, బాయిలర్ మిషన్ల దగ్గర చెమటలతో తడిసిపోయే వరకు పని చేయించుకుంటున్నారని, ఎటువంటి భద్రతా సదుపాయాలు, చల్లని గాలి వసతులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్‌ల వేడి, మేనేజ్‌మెంట్ ఒత్తిడి, తక్కువ జీతం, ఇవే మాకు దక్కిన వేతనాలు అని భావిస్తున్నారు. ఇలాంటి విషయాలను జిల్లా సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తే, వారు కూడా తూతూ మంత్రంగా విచారణ చేసి చేతులు (ముడుపులు) దులుపుకుంటున్నారని పేర్కొన్నారు. పైగా యాజమాన్యం మీద అభ్యంతరాలు లేవనెత్తే ఉద్యోగులను తొలగించి ఇంటికి పంపిస్తున్నారని అన్నారు.
కార్మికుల పట్ల దౌర్జన్యం :
యాజమాన్యం తమతో దౌర్జన్యంగా ప్రవర్తిస్తోందని, మాట వినకపోతే ఉద్యోగం పోతుంది అనే భయంతో మౌనంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిరదన్నారు.ఈ రావుస్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సుమారు 170 మందికి పైగా కార్మికులు పనిచేస్తుంన్నారు. నిత్యం 10, 12 గంటలు పనిచేస్తున్నాం, కాని గౌరవం లేదు, వేతనం లేదు. స్థానిక కార్మిక సంఘాలు దీనిపై దృష్టి సారించి, ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని, రావుస్ ఫార్మా కంపెనీపై కార్మిక చట్టాల ఉల్లంఘనలపై దర్యాప్తు జరపాలని, శ్రమించి పనిచేస్తున్న కార్మికులకు ప్రతి నెల జీతాలు సక్రమంగా విడుదల చేయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
