Wednesday, February 11, 2026
HomeతెలంగాణDGP | ‘నంబర్-1’ బాధ్యత మీదే

DGP | ‘నంబర్-1’ బాధ్యత మీదే

అతిపెద్ద ప్రొబేషనరీ డీఎస్పీల బ్యాచ్ శిక్షణ ప్రారంభ కార్యక్రమంలో డిజిపి బి.శివధర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర పోలీస్ (Telangana State Police) శాఖ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని, ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రొబేషనరీ డీఎస్పీల(Probationary Dsp)పైనే ఉందని డీజీపీ శివధర్‌రెడ్డి (Shivadhar Reddy) అన్నారు. ఆర్బీవీఆర్‌ఆర్‌(Rbvrr) తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ అకాడమీ(Telangana State Police Academy)లో గురువారం జరిగిన శిక్షణ (Training) ప్రారంభ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 112 మంది ప్రొబేషనరీ డిఎస్పిలతో కూడిన అతిపెద్ద బ్యాచ్ ఇదేనని చెప్పారు. పోలీస్‌ అధికారి కేవలం చట్టాన్ని అమలుచేయడమే కాకుండా దాని ఆత్మను అర్థంచేసుకోవాలని సూచించారు. నిష్పాక్షికత, ఓర్పు, సహానుభూతి వంటి విలువలే ఒక అధికారిని ఉత్తమంగా తీర్చిదిద్దుతాయని ఉద్భోదించారు. ప్రజలు మిమ్మల్ని అధికారులుగా కాకుండా న్యాయప్రతినిధులుగా చూస్తారని గుర్తు చేశారు. క్రమశిక్షణ అంటే శిక్ష కాదని, సంసిద్ధత అని స్పష్టం చేశారు.

- Advertisement -

ఆయన ఇంకా ఏమన్నారంటే..

గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌, సీఐ సెల్‌, టిజీసీఎస్‌బీ, ఈగల్‌ వంటి ప్రత్యేక సంస్థల ద్వారా తెలంగాణ పోలీస్‌ ఆధునిక పోలీసింగ్‌లో దేశానికి ఆదర్శంగా నిలిచింది. కమాండ్ కంట్రోల్ సెంటర్‌, షీ టీమ్స్‌, భరోసా సెంటర్స్‌, కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలు ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నాలకు నిదర్శనాలు. ఈ బ్యాచ్‌లో 38 మంది మహిళా అధికారులు ఉండటం గొప్ప విషయం. ఇతరులను నడిపించాలంటే ముందుగా సేవ చేయటం నేర్చుకోవాలి. యూనిఫాం ధరించే ప్రతిసారీ విలువలు మీ ప్రవర్తనలో ప్రతిఫలించాలి. పోలీస్ అధికారికి నిజమైన అధికారం యూనిఫాం మీద ఉన్న నక్షత్రాల వల్ల రాదు. ప్రజల కళ్లలో కనిపించే విశ్వాసం వల్ల వస్తుంది. మొదటి దశలో 42 వారాల పాటు శిక్షణ కొనసాగుతుంది.

ఐజిపి ఎస్.చంద్రశేఖర్ రెడ్డి, ఎం .రమేష్, రమేష్ నాయుడు, అకాడమీ డిప్యూటీ డైరెక్టర్లు ఎన్.వెంకటేశ్వర్లు, మురళీధర్, జి.కవిత తదితరులు శిక్షణ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిష్ట్, టీజీ సీఎస్బి డైరెక్టర్ శిఖా గోయల్, ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా, శాంతి భద్రతల అడిషనల్ డిజిపి మహేష్ ఎం భగవత్, పోలీస్ కమిషనర్లు వి.సి.సజ్జనార్ (హైదరాబాద్), సుధీర్ బాబు(రాచకొండ), అవినాష్ మహంతి(సైబరాబాద్) తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News