- హెచ్చరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్..
- కమిషన్ పేరుచెప్పుకుని అడ్డగోలు దోపిడీ..
- ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న సంస్థలు..
- అలాంటి వాటిని వెంటనే రద్దు చేయండి..
- రాష్ట్రాలకు సూచించిన జాతీయ మానవ హక్కుల కమిషన్..
నకిలీ ‘ఎన్‌హెచ్‌ఆర్‌సీ’లపై ఉక్కుపాదం: రాష్ట్ర ప్రభుత్వాలకు జాతీయ మానవ హక్కుల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది.. జాతీయ మానవ హక్కుల కమిషన్ పేరుతో చలామణి అవుతున్న నకిలీ సంస్థలు, వ్యక్తుల పట్ల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, నిధుల వసూళ్లకు పాల్పడుతున్న ఇటువంటి సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది.
ఎన్.హెచ్.ఆర్.సి. పేరును పోలిన పేర్లతో రిజిస్టర్ అయిన సంస్థలను గుర్తించి, వాటి రిజిస్ట్రేషన్లను వెంటనే రద్దు చేయాలని ఆదేశం.
తీసుకున్న చర్యలపై రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది.. 2022లో ‘నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్’ పేరుతో రిజిస్టర్ అయిన ఒక ఎన్జీవో అక్రమాలను కమిషన్ ఎండగట్టింది. ఢిల్లీలో రిజిస్టర్ అయిన ఒక నకిలీ సంస్థ, తమకు నీతి ఆయోగ్, కేంద్ర మంత్రిత్వ శాఖల గుర్తింపు ఉందని ప్రచారం చేసుకుంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తోంది.
కర్ణాటకకు చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి దీనికి ‘స్టేట్ చైర్మన్’గా వ్యవహరిస్తున్నట్లు గుర్తించిన కమిషన్, దీనిపై సుమోటోగా విచారణ చేపట్టింది. ఇలాంటి నకిలీ సంస్థల వల్ల ప్రజల్లో గందరగోళం ఏర్పడటమే కాకుండా, రాజ్యాంగబద్ధమైన ఎన్‌హెచ్‌ఆర్‌సీ పట్ల ప్రజలకున్న నమ్మకం దెబ్బతింటోంది. గతంలో హెచ్చరించినా మార్పు రాకపోవడంతో ఇప్పుడు కఠిన చర్యలకు ఆదేశించాం అని తెలియజేసింది..
రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు :
ప్రభుత్వ విభాగాల పేర్లను పోలిన సంస్థలను గుర్తించి తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.. ఢిల్లీలో రిజిస్టర్ అయి కర్ణాటకలో అక్రమాలకు పాల్పడుతున్న సంస్థపై తక్షణమే విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వాలని ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులను ఆదేశించింది. ప్రజలు ఇటువంటి నకిలీ సంస్థల ట్రాప్‌లో పడకుండా అవగాహన కల్పించాలని సూచించింది.
