Tuesday, March 3, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంLocal Body Elections | ‘స్థానిక’ ఎన్నికలు ఫిబ్రవరిలోనే?

Local Body Elections | ‘స్థానిక’ ఎన్నికలు ఫిబ్రవరిలోనే?

మార్చి వరకు వాయిదా పడ్డా ఆశ్చర్యంలేదు
అప్పటిదాక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లకు బ్రేక్
2026 జనవరి నెలాఖరు వరకు నో షెడ్యూల్
ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియే ప్రధాన అడ్డంకి
న్యాయపరంగా చిక్కులు రాకూడదని ముందస్తు జాగ్రత్త
రాష్ట్ర ఎన్నికల సంఘం వర్గాల సమాచారం
రాజకీయ పార్టీలు, ఎన్నికల్లో పోటీచేయాలనుకునేవారి ఆశలపై నీళ్లు

తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోలాహలం ముగిసింది. దీంతో.. ఇప్పుడు రాజకీయ వర్గాల దృష్టి మొత్తం ఎంపీటీసీ (Mptc), జెడ్పీటీసీ(Zptc), మునిసిపల్(Municipal) ఎన్నికల(Elections)పైనే కేంద్రీకృతమైంది. గ్రామీణ, పట్టణ స్థాయిలో స్థానిక సంస్థల్లో అధికారాన్ని నిర్ణయించే ఈ ఎలక్షన్ల కోసం అన్ని రాజకీయ పార్టీలు(Political Parties), ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

అయితే.. ఈ ఎన్నికల నిర్వహణకు ఇప్పటికిప్పుడు అవకాశం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం(State Election Commission) స్పష్టం చేసింది. అధికారిక వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మునిసిపల్ ఎలక్షన్ షెడ్యూల్ 2026 జనవరి నెలాఖరు దాక విడుదలయ్యే పరిస్థితి లేదు. ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియే(Voter List Comprehensive Revision Process) దీనికి ప్రధాన కారణమని చెబుతున్నారు.

గతంలో మాదిరిగా ఈసారి ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా చట్టపరంగా ఎలాంటి వివాదాలకు తావులేని ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అందులో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం 2026 జనవరి మొదటి వారంలో విడుదల చేయనున్న తాజా ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.

ఆ జాబితా అందిన తర్వాతే.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మునిసిపల్ వార్డుల వారీగా ఓటర్ల విభజన చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తికాకుండా ఎన్నికలకు వెళ్తే, న్యాయపరమైన చిక్కులు తప్పవని ఎన్నికల సంఘం స్పష్టమైన అభిప్రాయానికి వచ్చింది. గత జులై నెలలో చివరిసారిగా ఓటరు జాబితా సవరణ జరిగింది.

ఆ తర్వాత సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటికీ కోర్టు ఆదేశాలతో నోటిఫికేషన్ రద్దయింది. ఈ అనూహ్య పరిణామం రాష్ట్ర ఎన్నికల సంఘానికి తీవ్ర ఇబ్బందిగా మారింది. చివరకు కేవలం పంచాయతీ ఎన్నికలకే పరిమితమైంది. దీంతో.. జులై నుంచి డిసెంబర్ వరకు ఓటరు నమోదుకు అర్హత పొందిన కొత్తవారికి ఆ అవకాశం దక్కలేదు.

ఈ అంశాన్ని ఆధారంగా చేసుకొని దాదాపు 50 వరకు కోర్టు కేసులు నమోదయ్యాయి. అందువల్ల ఈసారి అలాంటి పొరపాట్లు పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ఎన్నికల సంఘం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోందని విశ్లేషకులు వివరిస్తున్నారు. ఇదిలాఉండగా.. మునిపల్ ఎన్నికల విషయంలో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.

మునిసిపాలిటీల్లో వార్డుల విభజనకు సంబంధించిన పూర్తి వివరాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందలేదు. ఈ కారణంగానే మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ కూడా ఆలస్యమవుతోంది. జనవరి మూడో వారం నుంచి ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. జాబితా ఖరారైన తర్వాతే ఎన్నికల ఏర్పాట్లు వేగవంతమవుతాయి.

ఏదిఏమైనా.. చట్టపరమైన అడ్డంకులు లేకుండా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలన్నదే అధికారుల లక్ష్యం. అందుకే ఫిబ్రవరి లేదా ఆ తర్వాతి నెలలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మునిసిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అంతవరకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ వ్యూహాలకు పదును పెడుతూ క్షేత్రస్థాయిలో బలాన్ని నిలుపుకొనే ప్రయత్నాల్లో నిమగ్నమవుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News