పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్దే నా ధ్యేయం
మామునూరు ఎయిర్‌పోర్ట్ పనులను వేగవంతం చేయాలి
నియోజకవర్గ సమస్యలపై పార్లమెంట్‌లో గళమెత్తుతా
జిల్లా అభివృద్ధికి కేంద్రం నుంచి అదనపు నిధులకు కృషి చేస్తా
వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య
వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద(Sathya Sharada)తో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య (MP Kavya) శుక్రవారం సమావేశమయ్యారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వ నిధుల వినియోగం, ప్రత్యేక ప్రాజెక్టుల పురోగతిపై కలెక్టరేట్‌లో చర్చించారు. కేంద్రం నుంచి మంజూరైన పలు స్కీములు, ప్రజాప్రయోజన పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ కావ్య మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధి వేగం మరింత పెంచడానికి కేంద్ర నిధులను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. జిల్లాలో జరుగుతున్న కీలక ప్రాజెక్టుల పురోగతిపై సమగ్రంగా చర్చించారు. మామునూరు ఎయిర్‌పోర్టు (Mamunur Airport) విస్తరణకు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.

మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన పీఎం మిత్ర (PM Mitra) నిధుల వినియోగం, ప్రాజెక్ట్ ముందడుగు విషయాలపై సమీక్షించారు. గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. కాకతీయుల చారిత్రక వారసత్వ సంపద రక్షణ అభివృద్ధితోపాటు జిల్లా పురావస్తు పరిశోధన ప్రదర్శనశాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. వరంగల్ పర్యాటక రంగ విస్తరణ కోసం పలు ఆలయాలను ప్రసాద్ స్కీమ్ కింద అభివృద్ధి చేయడానికి కేంద్ర పర్యాటక శాఖతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు.

ప్రత్యేకంగా గురుకుల పాఠశాలల్లో చదువుతున్న ఆడపిల్లల ఆరోగ్యం, భద్రత అంశాలపై ఎంపీ దృష్టి సారించారు. విద్యార్థుల్లో మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించే కార్యక్రమాలు, కౌన్సెలింగ్ తరచుగా నిర్వహించాలని సూచించారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుండి అదనపు నిధులు కేటాయించేలా ప్రయత్నాలు చేస్తానని ఎంపీ డా. కడియం కావ్య తెలిపారు. వరంగల్ అభివృద్ధి విషయంలో వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తన గళాన్ని వినిపిస్తానని ఎంపీ స్పష్టం చేశారు. జిల్లా అభివృద్ధి దిశగా కృషి చేస్తానని ఎంపీ పేర్కొంటూ, వరంగల్‌ను జాతీయ స్థాయిలో ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యం అని తెలిపారు..
