- అధికారులే లేకుంటే అర్జీదారుల గోడు వినేదెవరు?
- ఉదయం 11 గంటలైనా కొరవడిన అధికారుల హాజరు…
- ప్రజావాణి నిర్వహణపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు?
మఠంపల్లి: ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొని వాటికి సత్వర పరిష్కారం చూపించాల్సిన ప్రజావాణి కార్యక్రమం మఠంపల్లి మండలంలో అధికారుల నిర్లక్ష్యంతో(Mattampally Prajavani) లక్ష్యాన్ని కోల్పోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కల్పించిన ఈ వేదికకే అధికారులు సమయానికి హాజరుకాకపోతే సామాన్యుల గోడు వినేదెవరు? తమ సమస్యలు పరిష్కారమవుతాయనే ఆశతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ప్రజలకు ప్రజావాణి(Prajavani) కార్యక్రమం నిరాశనే మిగులుస్తోందన్న ఆవేదన అర్జిదారుల్లో వ్యక్తమవుతోంది.
కనపడని సమయపాలన… అధికారుల హాజరు ఏదీ?
ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మఠంపల్లి ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి ప్రజావాణి నిర్వహించాల్సి ఉంది. వివిధ శాఖలకు చెందిన అధికారులు అందుబాటులో ఉండి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనలు క్షేత్రస్థాయిలో ఎంతవరకు అమలవుతున్నాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఉదయం 11 గంటల సమయానికీ ఇన్చార్జి నోడల్ అధికారి, సూపరింటెండెంట్ కృష్ణవేణితో పాటు ఐసీడీఎస్‌కు చెందిన ఒక అధికారి మాత్రమే హాజరైనట్లు సమాచారం. మిగతా శాఖల అధికారులు అందుబాటులో లేకపోవడంతో తమ సమస్యలను ఎవరికి వివరించాలో తెలియక అర్జీదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే కార్యక్రమంలోనే అధికారులు అందుబాటులో లేకపోవడం పట్ల మండల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అర్జీలు స్వీకరించడమేనా… పరిష్కారాలు చూపేదెప్పుడు?
ప్రజావాణి అంటే కేవలం అర్జీలు స్వీకరించి రసీదులు ఇచ్చే కార్యక్రమం మాత్రమే కాదు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, సంబంధిత శాఖల ద్వారా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. గతంలో ప్రజావాణికి వివిధ సమస్యలపై అర్జీలు సమర్పించినప్పటికీ, వాటిలో అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.అర్జీ ఇచ్చిన తర్వాత దాని స్థితిగతులు ఏమిటి? సమస్య పరిష్కారానికి ఏ చర్యలు తీసుకున్నారు? సంబంధిత శాఖ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనే అంశాలపై స్పష్టత లేకపోవడం ప్రజల్లో అసంతృప్తికి కారణమవుతోంది. అర్జీల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు బాధ్యతాయుతమైన పర్యవేక్షణ లేకపోతే ప్రజావాణి నిర్వహణ ఆశయం నీరుగారిపోయే అవకాశం ఉందని మండల ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఏది?
మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి సంబంధిత శాఖల అధికారులు నిర్ణీత సమయానికి హాజరవుతున్నారా? ప్రజల నుంచి ఎన్ని అర్జీలు అందుతున్నాయి? వాటిలో ఎన్ని పరిష్కరించారు? పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులెన్ని అనే అంశాలపై ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది.అధికారులు గైర్హాజరైన సందర్భాల్లో కారణాలను తెలుసుకొని, విధుల పట్ల నిర్లక్ష్యం వహించినట్లు తేలితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
వివరణ కోరినా స్పందన కరువు
ప్రజావాణి కార్యక్రమానికి ఎన్ని ఫిర్యాదులు అందాయి?ఎంతమంది అధికారులు పాల్గొన్నారు? నిర్ణీత సమయానికి హాజరుకాని అధికారుల వివరాలేమిటి? అర్జీల పరిష్కారానికి తీసుకున్న చర్యలేమిటనే అంశాలపై వివరణ తెలుసుకునేందుకు ఆదాబ్ హైదరాబాద్ మండల ప్రతినిధి ప్రజావాణి కార్యక్రమం నోడల్ అధికారి,ఎఫ్ఎసి ఎంపీడీవోకి చరవాణి ద్వారా సంప్రదించగా స్పందన రాకపోవడం గమనార్హం.
ప్రజావాణిపై నమ్మకం నిలబెట్టాలి
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని అధికారులు నిర్లక్ష్యం చేయకుండా ప్రతి సోమవారం నిర్ణీత సమయంలో హాజరై అర్జీలు స్వీకరించాలని మండల ప్రజలు కోరుతున్నారు.స్వీకరించిన ప్రతి ఫిర్యాదుకు సంబంధించి పురోగతిని అర్జీదారులకు తెలియజేస్తూ, పరిష్కారానికి గడువు నిర్ణయించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మఠంపల్లి మండలంలో ప్రజావాణి నిర్వహణపై జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి అధికారుల హాజరు, అర్జీల పరిష్కారంపై సమీక్ష నిర్వహించాలని ప్రజలు, నాయకులు డిమాండ్ చేస్తున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
