అక్రమార్కులకు వత్తాసు! మారేడ్పల్లి భూవివాదంపై సంచలనం
- ముడుపులు ఇచ్చుకో సర్వే చేసుకో..!
- హైకోర్టు ఆదేశాలను దిక్కరించి, ‘తప్పుడు నివేదిక’ ఇచ్చిన సర్వే అధికారులు
- ఒక బడా నిర్మాణ సంస్థకు సెలవు రోజున ‘తక్షణ సర్వే’ – భారీ అవినీతి ఆరోపణలు!
ఉన్నత న్యాయస్థానం ఆదేశించినా, పాతాళ లోకంలో ముడుపుల మాఫియా పట్టు వదలడం లేదు! తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్పష్టమైన తీర్పును బట్టేబాదుతూ, అక్రమార్కులకు రెడ్ కార్పెట్ పరిచారు కొందరు ప్రభుత్వ అధికారులు. లక్షల కోట్లు విలువ చేసే మారేడ్‌పల్లి భూవివాదంలో, లంచాలకు లొంగిపోయి ‘తప్పుడు నివేదిక’ ఇచ్చిన ఆ సర్వే అధికారుల దౌర్జన్యం ఇది. పట్టాదారుల కన్నీళ్లు వారికి కనిపించలేదు, కబ్జాదారుల ముడుపులే కనబడ్డాయి. సెలవు రోజున హడావిడిగా ‘స్పెషల్ సర్వే’ చేసి, బడా కాంట్రాక్టర్‌కు వత్తాసు పలికిన ఈ పక్షపాత చర్య… అధికారుల అవినీతికి పరాకాష్ట! న్యాయవ్యవస్థపైనే నమ్మకం సన్నగిల్లేలా చేసిన ఈ ఘోరానికి ఎవరు బాధ్యులు? తక్షణమే విచారణ జరిపి, ఈ ‘కోర్టు ధిక్కారులను’ సస్పెండ్ చేయాల్సిందే!
సికింద్రాబాద్ డివిజన్‌లోని అత్యంత విలువైన మారేడ్‌పల్లి సర్వే నంబర్ 74 భూవివాదం మరోసారి తీవ్ర దుమారం రేపుతోంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ భూమిపై తెలంగాణ ఉన్నత న్యాయస్థానం స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ, కొందరు ప్రభుత్వ అధికారులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం, కబ్జాదారులకు వత్తాసు పలుకుతూ కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ధిక్కరిస్తున్నారని పట్టాదారులు తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నారు. ఇది అధికారుల అవినీతికి పరాకాష్టగా వారు అభివర్ణిస్తున్నారు.
న్యాయ పోరాటంలో పట్టాదారులకు అనుకూలంగా తీర్పు
మారేడ్‌పల్లిలోని సర్వే నంబర్ 74 లోని మొత్తం 306 ఎకరాల భూమిపై గతంలో వివాదం నెలకొంది. ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు (ూGజ నెం. 167/1997) సుదీర్ఘ విచారణ అనంతరం 2010లోనే… సర్వే నం. 74/1 లోని సుమారు 3 ఎకరాల 01 గుంటలు ప్రభుత్వ భూమిగానూ, 74/2 నుండి 74/13 వరకు గల భూమిని పట్టా భూమిగానూ నిర్ధారించింది. ఈ తీర్పును ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానంలో (రిట్ పిటిషన్స్ నెంబర్ 19106/2010) సవాలు చేయగా, 2010 నుండి 2025 వరకు వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు డబుల్ బెంచ్, గత మే నెలలో కీలక తీర్పునిచ్చింది.
ఈ తీర్పు ప్రకారం:
సర్వే నంబర్ 74 లో సబ్ డివిజన్ (ఉప-విభజన) జరిగిందని స్పష్టం చేసింది.
74/1 ప్రభుత్వ భూమిగానూ, 74/2 నుండి 74/13 వరకు గల భూమి వివిధ పట్టాదారుల భూమిగానూ నిర్ధారిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
న్యాయస్థానం ఆదేశాలున్నా… సర్వేలో కుట్ర!
కోర్టు తీర్పు వచ్చిన తర్వాత, పట్టాదారులు తమ భూములు అయిన సర్వే నంబర్ 74/8, 74/10 లను సర్వే చేసి, హద్దులు నిర్ణయించవలసిందిగా కలెక్టర్, ఆర్.డీ.ఓ, తహసిల్దార్లకు పదేపదే విన్నవించారు. ఫలితం లేక, ఓ పట్టాదారు కోర్టును ఆశ్రయించగా, సర్వే నం. 74/8 ని సర్వే చేసి, హద్దులు నిర్ణయించవలసిందిగా కోర్టు స్పష్టంగా ఆదేశించింది. అయితే, డిస్ట్రిక్ట్ సర్వే ఆఫీసర్ వి. శ్రీరామ్, రికార్డ్ అసిస్టెంట్ వెంకటేష్, మండల సర్వేయర్ శ్రీనివాస్ చారిలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం అక్రమార్కులతో చేతులు కలిపి, హైకోర్టు డబుల్ బెంచ్ తీర్పునకు పూర్తిగా విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తప్పుడు నివేదికతో కోర్టు ధిక్కారం:
కోర్టు సబ్ డివిజన్ జరిగిందని తేల్చినా, పై అధికారులు అందుకు విరుద్ధంగా ‘‘ఎలాంటి సబ్ డివిజన్ కాలేదు’’ అంటూ తప్పుడు నివేదికలను తహసిల్దార్‌కు పంపడం ద్వారా వీరు కోర్టు ఉత్తర్వులను ధిక్కరించారు.
ముడుపుల కోసం ‘స్పెషల్ సర్వే’ – ఆర్తి కన్‌స్ట్రక్షన్స్ సహకారం
కోర్టు ఆదేశాలు ఉన్నా, పట్టాదారులకు చెందిన 74/8, 74/10 లకు సర్వే నిలిపివేసిన అధికారులు… అదే సర్వే నంబర్ 74 లోని 74/9 విస్తీర్ణానికి సంబంధించిన ఒక బడా నిర్మాణదారు అయిన ఆర్తి కన్‌స్ట్రక్షన్స్ వారికి మాత్రం పూర్తి సహకారం అందించారు.
జాతీయ సెలవు దినమైన ఆగస్టు 15, 2025 నాడు (వర్కింగ్ డే కానప్పటికీ) ఆర్తి కన్‌స్ట్రక్షన్స్ వారికి సర్వే చేసి, ప్లాట్లకు హద్దులు నిర్ణయించడానికి అధికారులు అత్యవసరంగా ఎందుకు వ్యవహరించారు? దీని వెనుక భారీ ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలపై విచారణ జరపాల్సిన అవసరం ఉంది.
ఒకవైపు ఆర్తి కన్‌స్ట్రక్షన్స్ విషయంలో సబ్ డివిజన్ జరిగిందని అంగీకరించి సర్వే చేసిన అధికారులు, కోర్టు ఆదేశించిన మిగతా సబ్ డివిజన్ల విషయంలో ‘‘సబ్ డివిజన్ జరగలేదు’’ అని అబద్ధం చెప్పడం పక్షపాత చర్యగా పట్టాదారులు తీవ్రంగా ఖండిస్తున్నారు.
అధికారుల కుట్రను నిరూపిస్తున్న లేఖ!
ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే అయిన వి. శ్రీరామ్ తహసిల్దార్‌కు పంపిన లేఖ (ఆర్.సి. నెం. A4/891/2025, తేది 01-12-2025) అధికారుల కుట్రను స్పష్టం చేస్తోంది. హైకోర్టు తీర్పునకు విరుద్ధంగా, ‘‘సర్వే నెంబరు 74 కి ఎలాంటి ఉప-విభాగాలను కలిగి లేదని’’ శ్రీరామ్ నివేదించారు. దీనికి తోడు, ‘‘టౌన్ సర్వే అమలు తర్వాత, పాత సర్వే రికార్డులు సూపర్సీడ్ చేయబడ్డాయి… అందువల్ల సర్వే నెం. 74/8 (పాత సర్వే నెం.) పరిగణించబడదు’’ అని పేర్కొన్నారు. ఉన్నత న్యాయస్థానం డబుల్ బెంచ్ తీర్పు సబ్ డివిజన్ జరిగిందని, 74/2 నుండి 74/13 వరకు పట్టా భూమి అని స్పష్టంగా చెప్పినా, ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే శ్రీరామ్ అందుకు విరుద్ధంగా నివేదిక ఇవ్వడం, న్యాయస్థానాన్ని ధిక్కరించడమే అవుతుంది.
పట్టాదారుల డిమాండ్
కోర్టు ఉత్తర్వులను సైతం లెక్కచేయకుండా, ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహించి, కబ్జాదారులకు సహకరిస్తున్న డిస్ట్రిక్ట్ సర్వే ఆఫీసర్ వి. శ్రీరామ్, రికార్డ్ అసిస్టెంట్ వెంకటేష్, మండల సర్వేయర్ శ్రీనివాస్ చారిలపై జిల్లా కలెక్టర్ తక్షణం సమగ్ర విచారణ జరిపి, వారిని సస్పెండ్ చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని పట్టాదారులు డిమాండ్ చేస్తున్నారు.
