2028 లేదా 2029లో నిర్వహించే ఛాన్స్
ఈ దిశగా మరో ముందడుగు
బిల్లులకు అసెంబ్లీల ఆమోదం అవసరంలేదు
జేపీసీకి చెప్పిన లా కమిషన్
మరో రెండు నెలల్లో మరింత మందితో చర్చలు
బడ్జెట్ సమావేశాల్లోపు నివేదిక సమర్పణ
నివేదికను బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం
సార్వత్రిక ఎన్నికల చరిత్ర(General Elections Hisory)లో నూతన అధ్యాయం ప్రారంభం కాబోతోంది. ఒకే దేశం.. ఒకే ఎన్నిక (One Country One Election).. దిశగా కీలకమైన ముందడుగు పడింది. 2028లో లేదా 2029లో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో.. ఇప్పుడు సాధారణ ఎన్నికలకు జరుగుతున్న భారీ ఖర్చులో సగం ఖర్చుతోనే ఎలక్షన్లు పూర్తికానున్నాయి. ఎలక్షన్ కోడ్ (Election Code) కారణంగా అభివృద్ధి పనులకు ఆటంకం కలగటం అనేది ఇకపై ఉండబోదు. ఏడాదికొకసారి ఏదో ఒక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించటం అనేదీ ఇక మీదట జరగదు. ఒక్కసారి ఎలక్షన్ పూర్తయితే మళ్లీ ఐదేళ్ల దాక ఆ ఊసే ఎత్తే పరిస్థితి ఉండదు. తద్వారా మన దేశం ప్రగతిపథంలో దూసుకుపోతుంది.
ఒక దేశం- ఒకేసారి ఎన్నికలు అనే లక్ష్యంతో దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రవేశపెడుతున్న బిల్లులకు రాష్ట్రాల శాసన సభల ఆమోదం అవసరం లేదని లా కమిషన్ (Law Commission).. సంయుక్త పార్లమెంటరీ కమిటీ (JPC)కి తెలిపింది. ప్రతిపాదిత బిల్లులు రాజ్యాంగంలోని మౌలిక స్వరూపాన్ని మార్చేందుకు ఏమీ ప్రయత్నించడం లేదని పేర్కొంది. సమాఖ్య నిర్మాణానికి భంగకరమయ్యేలా రాజ్యాంగ నిబంధనల్నీ మార్చడం లేదని స్పష్టం చేసింది.
ఈ బిల్లులకు సంబంధించి ఇప్పటికే పలు వర్గాలతో చర్చించిన జేపీసీ.. తాజాగా లా కమిషన్‌తోనూ విస్తృత చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలో రాజ్యాంగంలోని 368వ అధికరణ కింద జమిలి ఎన్నికల నిర్వహణకు రాష్ట్రాల ఆమోదం అవసరం లేదని 23వ లా కమిషన్ చైర్మన్ జస్టిస్ దినేశ్ మహేశ్వరి.. జేపీసీ సభ్యులకు వివరించారు. ఇదిలాఉండగా.. మరో రెండు నెలల్లో మరింత మంది నిపుణులు, సంస్థలతో చర్చలు జరిపిన తర్వాత జేపీసీ తన నివేదికను వచ్చే బడ్జెట్ సమావేశాల్లోపు ప్రభుత్వానికి సమర్పించనుంది. అనంతరం.. ఈ రిపోర్టును పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఉభయ సభల ఆమోదం అనంతరం రాష్ట్రపతికి పంపిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేస్తే జమిలి ఎన్నికలకు ఎదురయ్యే ఆటంకాలకు తెరపడినట్లేనని పరిశీలకులు పేర్కొంటున్నారు.
