స్వతంత్ర భారత రెండవ ప్రధాన మంత్రి, పరమ దేశభక్తుడు, అద్వితీయ దార్శనికుడు లాల్ బహదూర్ శాస్త్రి 11 జనవరి 1966న ఉబ్జెకిస్థాన్, రష్యాలో ఉదయం తుది శ్వాస విడిచారు. 1965 ఇండో-పాక్ యుద్ధం తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించేలా ప్రయత్నాల్లో భాగంగా ‘‘తాష్కంట్ ఒప్పందం’’లో సంతకం చేయడానికి వెళ్లిన లాల్ బహదూర్ శాస్త్రీ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించం, మరణానంతరం పోస్ట్‌మార్టమ్ కూడా చేయకపోవడం, గుండె పోటుతో మరణించారని అధికారిక ప్రకటన చేయడం గత 60 ఏండ్లుగా వారి మరణం వీడని మిస్టరీఅబశ్రీశ్రీగానే మిగిలి పోవడం విచారకరం.
జై జవాన్ ; జై కిసాన్ నినాదమిచ్చిన భారత రత్న:
‘‘జై జవాన్ ; జై కిసాన్’’ అనబడే అత్యంత శక్తివంతమైన, అవసరమైన నిత్య నినాదాన్ని ఇచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి దేశాభివృద్ధిలో రైతులు, సైనికుల పాత్రను నొక్కివక్కానించారు. అపరిమిత అంకిత భావం, నైతిక ప్రవర్తన, నీతివంతమైన పాలన, పారదర్శకత, జవాబుదారీతనం, ప్రధాని పదవి ఇన్న ప్పటికీ అత్యంత సరసమైన జీవన విధానాన్ని కొనసాగించడం, దేశ భద్రతపై పట్టు సాధించి భరత మాత ముద్దు బిడ్డగా చరిత్రలో నిలిచారు. 1965లో జరిగిన ఇండో-పాక్ యుద్ధంలో శాస్త్రి చూపిన తెగువ,భారత్‌ను యుద్ధంలో విజేతగా నిలిపి జాతీయ, ఆంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.ప్రధానిగా శాస్త్రి ప్రతిభగల పాలన విధానాలు దేశానికి రాజకీయ,ఆర్థిక పునాదులను పటిష్ట పరిచారు.
శాస్త్రీ బిరుదాంకితుడు:
యూపీ, ముగల్‌సరాయ్ నగరంలోని ఒక సాధారణ కుటుంబంలో 02 అక్టోబర్ 1904న జన్మించిన లాల్ బహదూర్ కాశీ విద్యాపీఠ్ ప్రాంగణంలో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం స్వాతంత్య్ర సమరం లో చురుకుగా పాల్గొంటూ మహాత్మా గాంధీతో దగ్గర అయ్యారు. చదువుకున్న సమయం లోనే లాల్ బహదూర్ చూపిన ప్రతిభను మెచ్చి ‘‘శాస్త్రి’’ అనే మేధావిగా బిరుదును పొందారు. స్వతంత్ర భారత ప్రభుత్వంలో రైల్వే/విదేశాంగ/హోమ్ లాంటి మంత్రి పదవులను నిర్వహించి తన పాలనాదక్షతను రుచి చూపి 2వ ప్రధాన మంత్రిగా 1964-66 మధ్య సేవలు అందిస్తూ అకాల మరణం చెందారు.
శాస్త్రీ గారి అకాల, అనుమానాస్పద మరణం నాటి దేశానికి తీరని వేదనను మిగిల్చింది. అజాత శత్రువు, అలుపెరుగని సేవకుడు, నీతి నిజాయితీకి మారుపేరు, నిత్య కృషీవలుడు, ఆలోచనపరమైన ముందు చూపు, ఆధునిక భారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన దేశ భక్తిపరుడి 59వ వర్థంతి సందర్భంగా శాస్త్రి గారి స్మారక ‘‘విజయ్ ఘాట్’’ సాక్షిగా హృదయపూర్వక నివాళులు అర్పిద్దాం. శాస్త్రి గారి సేవలకు గుర్తింపుగా మరణానంతరం 1966లో ‘‘భారత రత్న’’ పౌర పురస్కారం కూడా ఇవ్వడం సముచితంగా ఉన్నది. లాల్ బహదూర్ శాస్త్రీ జీవితం నేటి రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలవాలని, దేశ పౌర సమాజానికి దారి దీపం కావాలని కోరుకుందాం.
- డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
9949700037

