- ఉదయ్ పూర్ లో ఘటన..JustKeth
- లైవ్ స్ట్రీమింగ్ లో ముద్దడిగిన వ్యక్తి..JustKeth
రాజస్థాన్‌లోని పర్యాటక నగరం ఉదయ్‌పూర్‌లో పర్యటిస్తున్న ప్రముఖ థాయ్-ఫ్రెంచ్ యూట్యూబర్ (JustKeth) ‘జస్ట్కెత్’కు చేదు అనుభవం ఎదురైంది. ఆమె బహిరంగ ప్రదేశంలో లైవ్‌స్ట్రీమింగ్ నిర్వహిస్తుండగా, ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉదయ్‌పూర్‌లోని రద్దీగా ఉండే ఓ ప్రాంతంలో రాత్రి వేళ జస్ట్కెత్ తన ఫాలోవర్ల కోసం లైవ్‌స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆమె వద్దకు వచ్చి అసభ్యంగా మాట్లాడటం ప్రారంభించాడు. “ఒక ముద్దు కావాలి.. ఒక్క లిప్ కిస్ ప్లీజ్” అంటూ ఆమెను పదేపదే అడిగాడు. ఆమె వెంటనే స్పందిస్తూ ముద్దు ఇచ్చేందుకు స్పష్టంగా నిరాకరించారు. అయినప్పటికీ అతడు వెనక్కి తగ్గకుండా అదే అభ్యర్థనను మళ్లీ మళ్లీ చేస్తూ ఆమెను ఇబ్బందికి గురిచేశాడు.
ఆమె ఎంతకీ అంగీకరించకపోవడంతో చివరకు ఫొటో దిగుతానని అడిగాడు. అందుకు ఆమె సమ్మతించి ఫొటో తీసుకున్నారు. అనంతరం ఆ వ్యక్తి ఆమెకు షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు చేయి ముందుకు చాచగా, ఆమె తిరస్కరిస్తూ ఫిస్ట్ బంప్ ఇచ్చి పరిస్థితిని నియంత్రించే ప్రయత్నం చేశారు. ఈ మొత్తం వ్యవహారం ఆమె చేపట్టిన లైవ్‌స్ట్రీమింగ్‌లో ప్రత్యక్షంగా రికార్డైంది. ఈ వీడియోను జస్ట్కెత్ సోషల్ మీడియాలో పంచుకోగా, అది క్షణాల్లో వైరల్‌గా మారింది.
అప్పటికే ఈ వీడియో దాదాపు 50 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. అయితే, ఒక మహిళ స్పష్టంగా నిరాకరించిన తర్వాత కూడా శారీరక సాన్నిహిత్యం కోసం పదేపదే ఒత్తిడి చేయడం తీవ్రమైన వేధింపుల కిందకే వస్తుందని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ ఘటన దేశంలో మహిళల భద్రత, వ్యక్తిగత సరిహద్దుల ప్రాధాన్యతపై మరోసారి తీవ్రమైన చర్చను లేవనెత్తింది. ముఖ్యంగా విదేశీ మహిళలను చూడగానే సులభంగా లోబడతారనే తప్పుడు భావన కొందరిలో ఉందని, ఇలాంటి ప్రవర్తన దేశ గౌరవానికి భంగం కలిగిస్తుందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరస్కరణను గౌరవించడం నేర్చుకోవాలని పలువురు సూచిస్తున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
