దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం(Jawaharlal Nehru Stadium) స్పోర్ట్స్ సిటీ(Sports City)గా మారనుంది. ఈ మేరకు ఖతార్(Qatar), ఆస్ట్రేలియా(Australia)లోని క్రీడా నగరాలను పరిశీలించి విధివిధానాలను ఖరారు చేస్తున్నారు. ఐకానిక్‌గా ఉన్న ఈ మైదానాన్ని కూల్చివేసి అన్ని ప్రధాన విభాగాలకు అనుగుణంగా, అథ్లెట్లకు వసతి సౌకర్యాన్ని కలిగి ఉన్న స్పోర్ట్స్ సిటీని సృష్టించనున్నారు. ఈ మేరకు క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాలు సోమవారం తెలిపాయి.
ఈ స్టేడియం 102 ఎకరాల్లో ఉంది. దీన్ని పూర్తిగా పునర్నిర్మిస్తారు. ప్రస్తుతానికి ఈ ప్రణాళిక కేవలం ప్రతిపాదన దశలోనే ఉంది. పూర్తి ప్రాజెక్ట్ షెడ్యూల్‌ను ఇంకా రూపొందించలేదు. స్టేడియంలో ప్రస్తుతం నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(National Anti Doping Agency-NADP), నేషనల్ డోప్ టెస్టింగ్ లాబొరేటరీ(National Dope Testing Laboratory-NDTL)తోపాటు వివిధ కార్యాలయాలు ఉన్నాయి. వీటిని వేరే చోటకు తరలిస్తారని మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.
స్పోర్ట్స్ సిటీ అనేది ప్రధానంగా బహుళ విభాగ సౌకర్యం. ఇది శిక్షణ కోసం మాత్రమే కాకుండా ప్రధాన కార్యక్రమాల నిర్వహణకు కూడా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కలిగి ఉంటుంది. స్పోర్ట్స్ సిటీకి ఉదాహరణగా అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చు. అక్కడ క్రికెట్, ఆక్వాటిక్స్, టెన్నిస్, అథ్లెటిక్స్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.
