Tuesday, March 10, 2026
Homeరంగారెడ్డిJawahar Nagar | డీజే శబ్ద కాలుష్యంపై చర్యలు తీసుకున్న పోలీసులపై దాడి

Jawahar Nagar | డీజే శబ్ద కాలుష్యంపై చర్యలు తీసుకున్న పోలీసులపై దాడి

  • ముగ్గురు అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శబ్ద కాలుష్యంపై చర్యలు తీసుకున్న పోలీసు సిబ్బందిపై దాడి చేసి విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

పోలీసుల వివరాల ప్రకారం, జవహర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఆలేటి మల్లేశ్ పి.సి. 12982, పెట్రోల్ కార్–1 ఇన్‌చార్జ్‌గా డ్రైవర్ శ్రీను, హెచ్.జి. 421తో కలిసి 7 మార్చి రాత్రి విధులు నిర్వహిస్తున్న సమయంలో 8 మార్చి తెల్లవారుజామున 00:30 గంటల సమయంలో డయల్ 100 ద్వారా సాయి కుమార్ నుంచి సీఎస్ నగర్, ఎల్లారెడ్డిగూడ ప్రాంతంలో శబ్ద కాలుష్యం జరుగుతోందని ఫిర్యాదు వచ్చింది.

- Advertisement -

ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని టీఎస్08యూఏ1565 నంబర్ గల అశోక్ లేలాండ్ వాహనంపై నడుస్తున్న ప్యాడ్ బ్యాండ్ డీజేను నిలిపివేశారు. ఆ సమయంలో డి. సందీప్ అనే వ్యక్తి పోలీసుల విధుల్లో అడ్డుపడి వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా అడ్డుకుని బండిని పంపివేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే పోలీసులను అడ్డుకుని వారి విధులకు ఆటంకం కలిగించాడు.

తర్వాత రాత్రి 01:36 గంటల సమయంలో అదే ప్రాంతంలో మళ్లీ శబ్ద కాలుష్యం జరుగుతోందని చాకలి వెంకటేశం నుంచి డయల్ 100 ద్వారా మరో ఫిర్యాదు వచ్చింది. వెంటనే పెట్రోల్ కార్ సిబ్బంది, నైట్ డ్యూటీ ఆఫీసర్ జె. నర్సిరెడ్డి ఎస్.ఐ., బ్లూ కోల్ట్ వాహనం సిబ్బంది పి.సి. 5977, హెచ్.జి. 1728 సంఘటన స్థలానికి చేరుకున్నారు.

అక్కడ కొంతమంది వ్యక్తులు పెద్ద శబ్దాలతో గందరగోళం సృష్టిస్తూ కనిపించారు. ఈ సమయంలో డి. సందీప్ తన సహచరులు పవన్, విశాల్‌తో కలిసి తాము స్థానికులమని చెప్పుకుంటూ పోలీసు సిబ్బందిని అసభ్య పదజాలంతో దూషించి విధులకు అడ్డుపడ్డారు. అక్కడ విధుల్లో ఉన్న మల్లేశ్ కానిస్టేబుల్‌ను గల్లా పట్టుకుని తోసివేయడంతో పాటు విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసు సిబ్బంది వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా వారు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులకు ఆటంకం కలిగించడం, రాత్రి సమయంలో అధిక శబ్దాలతో ప్రజలకు ఇబ్బందులు కలిగించడం వంటి ఆరోపణలపై సందీప్, పవన్, విశాల్‌పై బీఎన్ఎస్ సెక్షన్లు 132, 221, 223(ఎ), 292 రీడ్ విత్ 3(5), తెలంగాణ టౌన్ న్యూసెన్స్ యాక్ట్ సెక్షన్ 3(10), సీపీ యాక్ట్ 21/76 కింద కేసు నమోదు చేశారు.

తదుపరి నమ్మదగిన సమాచారం మేరకు ఆదివారం ఉదయం ఎల్లారెడ్డిగూడలో ఉన్న సందీప్, పవన్, విశాల్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. అనంతరం ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News