Tuesday, April 21, 2026
Homeనల్లగొండIllegal Mining | చల్లూరులో అక్రమ మైనింగ్ మాఫియా రాజ్యం…

Illegal Mining | చల్లూరులో అక్రమ మైనింగ్ మాఫియా రాజ్యం…

  • అధికారుల మౌనం వెనుక ఎవరి హస్తం?

ఆలేరు నియోజకవర్గం రాజాపేట మండలంలోని చల్లూరు శివారులో కొనసాగుతున్న అక్రమ క్రషర్ మైనింగ్ దందా రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికార యంత్రాంగం నిర్లక్ష్యం, ప్రభావశీలుల అండదండలతో ఈ దందా బహిరంగంగానే సాగుతోందని బీఆర్‌ఎస్ నాయకులు మండిపడ్డారు. తక్షణ చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ మేరకు బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి, మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేష్, కర్రె వెంకటయ్యతో పాటు నియోజకవర్గ నాయకులు భువనగిరిలోని కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ వెంకారెడ్డికి ఫిర్యాదు చేశారు. చల్లూరు గుట్టల పరిధిలోని 322 సర్వే నెంబర్లలో ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండానే అక్రమంగా మైనింగ్ కొనసాగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని తెలిపారు.

- Advertisement -

“ప్రకృతి సంపదను కాపాడాల్సిన బాధ్యత ఉన్న అధికారులు కళ్లెదుటే కోట్ల రూపాయల దోపిడీ జరుగుతుంటే ఎందుకు మౌనం వహిస్తున్నారు?” అని ప్రశ్నించిన నాయకులు, ఈ అక్రమ దందా వెనుక పెద్ద స్థాయి రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపించారు. కొంతమంది ప్రభావశీలులు అధికార దాహంతో ప్రభుత్వ భూములను ఆక్రమించి, నిబంధనలు తుంగలో తొక్కి అక్రమంగా మట్టిని తరలిస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు.

రేయింబవళ్లు జరుగుతున్న భారీ బ్లాస్టింగ్‌లతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని, ఇళ్లలో ఉండలేని పరిస్థితి నెలకొన్నదని చెప్పారు. పేలుళ్ల శబ్దాలతో వృద్ధులు, పిల్లలు నిద్రపోలేక ఇబ్బందులు పడుతున్నారని, పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ అంశంపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది అని ఆరోపించారు. “అధికారుల నిర్లక్ష్యం వెనుక ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయో బయటపెట్టాలి. వెంటనే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు. తక్షణ చర్యలు తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ఈ అక్రమ దందాను నిలిపివేస్తామని బీఆర్‌ఎస్ నాయకులు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి చామకూర గోపాల్ గౌడ్, గుంటి కృష్ణ, ఎర్ర గోగుల జస్వంత్, నాగిర్తి గోపిరెడ్డి, బొంగోని ఉప్పలయ్య గౌడ్, పల్లె సంతోష్ గౌడ్, గోపగాని రామిండ్ల నరేందర్, యమ్మ భాస్కర్, ఎడ్ల నరేష్ రెడ్డి, చెరుకు కనకయ్య, సోమలింగం గుప్తా, వరుణ్ రమేష్, యమ్మ ఎల్లయ్య, తుంగ అక్షయ్ కుమార్, తుంగ వేణు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఈ వ్యవహారం వేడెక్కుతుండగా, అధికార యంత్రాంగం స్పందనపై అందరి దృష్టి నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News