Thursday, October 9, 2025
ePaper
HomeతెలంగాణHigh Court | స్థానిక ఎన్నికలకు హైకోర్టు బ్రేక్..జీవో నెంబర్ 9పై స్టే..

High Court | స్థానిక ఎన్నికలకు హైకోర్టు బ్రేక్..జీవో నెంబర్ 9పై స్టే..

హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల అమలు పైన తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం ప్రకటించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై హైకోర్టు (HighCourt) స్టే విధించింది. జీవో అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ కౌంటర్లపై అభ్యంతరాలకు దాఖలుకు పిటిషనర్లకు రెండు వారాల గడువు విధించింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో రెండు రోజుల పాటు సుదీర్ఘ వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. బీసీ కులగణనకు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని, స్వాతంత్య్రం తర్వాత సమగ్ర కులగణన సర్వే తెలంగాణలోనే జరిగిందని అన్నారు. రాష్ట్రంలో బీసీ జనాభా 57.6శాతం ఉన్నట్లు తేలిందన్న ఆయన.. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు కోర్టుకు వివరించారు.

మరో న్యాయవాది రవివర్మ తన వాదనలు వినిపిస్తూ… రాజ్యాంగంలో రిజర్వేషన్లపై ఎక్కడా 50శాతం సీలింగ్ లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు కలిపి 85 శాతం జనాభా ఉన్నారని, 85 శాతం జనాభాకు 42 శాతంతో కలిపి 67య శాతమే రిజర్వేషన్లు ఇస్తున్నామని వివరించారు. 15 శాతం జనాభాకు 33 శాతం ఓపెన్గానే ఉందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9 పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

హైకోర్టు తాత్కాలిక ఆదేశాల నేపథ్యంలో.. స్థానిక ఎన్నికల నిర్వహణపై అస్పష్టత నెలకొంది. ఎన్నికల కమిషన్ అధికారులు కోర్టు ఆర్డర్ కాపీ అందిన తరువాత మాత్రమే తదుపరి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. దీంతో గ్రామ, మండల స్థాయిలో నిర్వహించాల్సిన ఎన్నికల షెడ్యూల్ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఈ తీర్పుతో స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Latest News