Wednesday, March 4, 2026
Homeహైదరాబాద్‌GOPA | భవిష్యత్తులో గౌడ సీఎంని చేయాలి

GOPA | భవిష్యత్తులో గౌడ సీఎంని చేయాలి

గోపా గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో వక్తలు
రూ.10 లక్షల విరాళం ప్రకటించిన..
టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
ప్రత్యేక స్మారక సంచిక విడుదల

హైదరాబాద్, డిసెంబర్ 26 (ఆదాబ్ హైదరాబాద్): గౌడ్స్ అఫిషియల్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్(Gouds Officials Professionals Association)(గోపా: GOPA) గోల్డెన్ జూబ్లీ(50 సంవత్సరాల) వేడుకలు హైదరాబాద్‌లోని కాచిగూడలో ఘనంగా జరిగాయి. టీపీసీసీ చీఫ్ (Tpcc Chief) బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ (Bomma Mahash Kumar Goud), మాజీ మంత్రులు వి.శ్రీనివాస్ గౌడ్(V.Srinivas Goud), జి.రాజేశం గౌడ్, శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గౌడ్, జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ డీఎస్పీ నాగేశ్వర్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్‌ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోపా హెల్త్ కార్డ్‌ను ఆవిష్కరించారు.

- Advertisement -

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..

సేవ చేసే గుణం కేవలం గౌడ్స్‌లోనే ఉంటుందని చెప్పారు. గోపా 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సహాయంతో గోపా భవన్ ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. గోపా ద్వారా ఒక నిధిని ఏర్పాటుచేయాలని సూచించారు. ఆ నిధికి తన వంతు సహాయంగా రూ.10 లక్షల విరాళాన్ని ప్రకటించారు. బీసీల సంఖ్య 56.3 శాతం అని అధికారికంగా పేర్కొనే కుల సర్వే డాక్యుమెంట్ ఉందని, గౌడ్‌ల ఐక్యతతో రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేయాలని కోరారు. గ్రూప్-1లో 11 మంది గౌడ కులస్తులు ఎంపికయ్యారని, వాళ్లందరికీ గోపా ఆధ్వర్యంలో సన్మానం చేయాలని సూచించారు.

మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..

గత ప్రభుత్వంలో అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు ఇచ్చామని, కుల వృత్తులకు శిక్షణా తరగతులు, విద్యార్థులకు స్టడీ సెంటర్ల ఏర్పాటుకు స్థలాలను కేటాయించామని చెప్పారు. గౌడ భవనం ఏర్పాటుకు 5 ఎకరాల స్థలం కేటాయించి రూ.5 కోట్ల నిధులను విడుదల చేశామని తెలిపారు. గౌడ్స్ ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో వైన్స్ షాపుల్లో 10% రిజర్వేషన్లు కేటాయించామని, గౌడ్స్ కులవృత్తి ఆత్మగౌరవం పెంపొందించడం కోసం ట్యాంక్ బండ్‌పై నీరా కేఫ్‌ను ఏర్పాటుచేశామని పేర్కొన్నారు. నీరా, ఈత, తాటి ఉత్పత్తుల అమ్మకానికి స్టాల్స్‌ను కూడా అందుబాటులోకి తెచ్చామని వివరించారు.

తెలంగాణలోని నందనం, సర్వేల్, మునిపల్లి, చరికొండలో నీరా ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటుచేశామని వెల్లడించారు. ట్యాంక్ బండ్‌పై సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించి, నిధులను కేటాయించామని చెప్పారు. సర్వాయి పాపన్నను ఆదర్శంగా తీసుకొని అన్ని కులాలను సమన్వయం చేసి కులవృత్తుల ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. అప్పుడే.. సమాజంలో కులవృత్తులు గౌరవప్రదంగా ఉంటాయని, కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకొని కుల సంఘాలకు ఇచ్చిన స్థలాల్లో భవన నిర్మాణాలు పూర్తి చేసి కులవృత్తుల అభివృద్ధికి పాటుపడాలని కోరారు.

మాజీ మంత్రి రాజేశం గౌడ్ మాట్లాడుతూ..

గోపాను విస్తరిస్తూ గీత కార్మికుల పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. గౌడ్ అధికారిక మరియు వృత్తి సంఘం గత 50 సంవత్సరాలుగా గౌడ్ సమాజ అభివృద్ధి, విద్య, ఉపాధి అవకాశాలు, సామాజిక చైతన్యం దిశగా విశేష సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. భవిష్యత్తులో కూడా సంఘం మరింత బలోపేతమై యువతకు మార్గదర్శకంగా నిలవాలని ఆకాంక్షించారు.

శాసన మండలి మాజీ చైర్మన్ కనకమామిడి స్వామి గౌడ్ మాట్లాడుతూ..

సంఘాలన్నింటినీ ఏకం చేసే సంఘం కావాలని, గౌడ మహాసభ ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు. హక్కుల కోసం ఏ ఉద్యమం చేయలేకపోవడం వల్లే రిజర్వేషన్లు వెనక్కి పోయాయని అన్నారు. రిజర్వేషన్ల విషయంలో తమిళనాడును ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. రాజ్యాంగపరంగా రాదని ఆనాడు తమిళనాడు ప్రజలకు చెబితే మాకు రిజర్వేషన్ లేకుంటే భారతదేశం నుంచి రాష్ట్రాన్ని వేరుచేసుకుంటామనడంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి రిజర్వేషన్ కల్పించిందని గుర్తుచేశారు. మహాసభకు కావలసిన సలహాలు, సూచనలు ఇస్తానని అన్నారు.

జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ..

బెంగాల్ ప్రాంతంలో గౌడ రాజులు ఉన్నారని చెప్పారు. కల్లుగీత ద్వారా విడిపోయి నేడు తెలంగాణలో 30 లక్షల గౌడ‌లు ఉన్నారని తెలిపారు. గోపా ద్వారా 5 లక్షల సభ్యత్వం చేయించి వచ్చే రుసుంతో విద్యా సంస్థలను నిర్వహించాలని సూచించారు. గౌడ పేదలకు, సమాజ సేవకు మాత్రమే వినియోగిస్తే మంచిదని అన్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీఎం కావాలని ఆకాంక్ష వెలిబుచ్చారు. తద్వారా గౌడ రాజ్యాన్ని ఏర్పాటుచేసుకోవాలని, అందుకు కుల ఐక్యత ముఖ్యమని అభిప్రాయపడ్డారు. అనంతరం.. సుప్రజా హాస్పిటల్, గోపా ద్వారా సభ్యులందరికీ హెల్త్ కార్డులను ఆవిష్కరించారు.

మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ..

తెలంగాణ రాష్ట్రంలో కేవలం 10 కుటుంబాల వద్దే రూ.5 లక్షల కోట్ల సంపద ఉందని అన్నారు. వెనకబడిన తరగతులైన మన వద్ద అంత సంపద లేదని చెప్పారు. కులం, అధికారం, సంపద ఈ మూడింటిలో మనం ముందుండాలని, ఆ దిశగా ప్రయాణం ఇప్పటికైనా సాగాలని సూచించారు.

బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వంలో భాగంగా ఉన్నందుకు తన వంతు సహాయ సహకారాలను అందిస్తానని చెప్పారు. ఈ విషయంలో ఎల్లవేళలా ముందుంటానని తెలిపారు.

ఉమెన్ కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద గౌడ్ మాట్లాడుతూ..

గౌడ కులస్తులమని గర్వంగా చెప్పుకోవాలని సూచించారు. ఎవరూ చేయని పనిని మనం చేస్తామని, గ్రామంలో ప్రతి ఒక్కరితో సత్సంబంధాలు నెలకొల్పడంలో గౌడ కులం అగ్రగామిగా ఉంటుందని తెలిపారు. గతంలో ప్రభుత్వం 5 ఎకరాల స్థలం ఇచ్చిందని, ఇప్పటికీ ఇవ్వని గ్రామం ఏదైనా ఉంటే తన దృష్టికి తీసుకొని వస్తే సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి ఇప్పించేలా కృషి చేస్తానని అన్నారు. నవ తరానికి, యువ తరానికి మెట్టు లాగా మనం ఉపయోగపడాలని కోరారు. సమాజంలో మహిళల సాధికారత, విద్యాభివృద్ధికి ఇలాంటి సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. GOPA సేవలను ప్రశంసించారు.

మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గౌడ్, రిటైర్డ్ డీఎస్పీ నాగేశ్వర్ గౌడ్‌ మాట్లాడుతూ.. సంఘం స్థాపన నుంచి ఇప్పటివరకు చేసిన సేవలను అభినందించారు. స్వర్ణోత్సవం సందర్భంగా నాయకులు, సభ్యులు అందరూ ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

పీఎస్పీ సభ్యురాలు బాలలక్ష్మి మాట్లాడుతూ గోపాలో మహిళల ప్రాధాన్యతను పెంచాలని సూచించారు. జనరేషన్‌పరంగా ఐక్యత ముఖ్యమని తెలిపారు.

ఈ స్వర్ణోత్సవ కార్యక్రమాన్ని GOPA అధ్యక్షుడు బండి సాయన్న గౌడ్ అధ్యక్షతన నిర్వహించగా ప్రధాన కార్యదర్శి జీవీ శ్రీనివాస్ గౌడ్ సమన్వయంతో విజయవంతంగా జరిగింది. సంఘం వ్యవస్థాపకులు, సీనియర్ సభ్యులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా సంఘం 50 సంవత్సరాల ప్రస్థానాన్ని వివరిస్తూ ప్రత్యేకంగా స్మారక సంచిక విడుదల చేయడంతోపాటు విశిష్ట సేవలు అందించిన సభ్యులను సత్కరించారు. ‎ఈ కార్యక్రమంలో రఘునాథ్ గౌడ్, చెక్కిళ్ల మధుసూదన్ గౌడ్, చక్రవర్తి గౌడ్, ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, పల్లె లక్ష్మణ్ రావ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ గోల్డెన్ జూబ్లీ వేడుకలకు 22 జిల్లాల నుంచి జిల్లాల బాధ్యులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News