- బంజారా హిల్స్‌లో అక్రమ భవన నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యం
- లంచాలకు తలొగ్గి అక్రమాలకు పచ్చజెండా, జీహెచ్‌ఎంసీ సర్కిల్ 18లో అవినీతి జాతర?
- చట్టాలు, ప్రభుత్వ ఉత్తర్వులు కాగితాలకే పరిమితమా?
- జీహెచ్‌ఎంసీ కమిషనర్ అవినీతి అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజల డిమాండ్
హైదరాబాద్ లాంటి పెద్ద నగరాల్లో అక్రమ నిర్మాణాలు ఒక పెద్ద సమస్యగా మారాయి. నిర్మాణాలకు సంబంధించి జీహెచ్‌ఎంసీ కొన్ని నియమ నిబంధనలను రూపొందించింది. భవనాల ఎత్తు, సెట్‌బ్యాక్‌లు, పార్కింగ్ స్థలం, అగ్నిమాపక భద్రతా చర్యలు వంటివి ఈ నియమాల్లో ఉంటాయి. టీఎస్ – బి పాస్ వంటి ఆన్‌లైన్ వ్యవస్థల ద్వారా అనుమతులను మరింత సులభతరం చేసినప్పటికీ, అక్రమ నిర్మాణాలను అరికట్టడం ఒక సవాలుగా మిగిలిపోయింది. అధికారులు చర్యలు తీసుకోకపోవడం, అవినీతి వంటి కారణాల వల్ల ఇలాంటి అక్రమ నిర్మాణాలు పెరిగిపోతు న్నాయని ఆరోపణలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో, కోర్టులు కూడా ఈ విషయంపై జోక్యం చేసుకుని, అక్రమ నిర్మాణాలను తొలిదశలోనే అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నారని విమర్శించాయి. ఈ అక్రమ నిర్మాణాల వల్ల నగరంలో రద్దీ పెరగడం, మౌలిక వసతులపై ఒత్తిడి పెరగడం, ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. అయినప్పటికీ, జీహెచ్‌ఎంసీ అధికారుల స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వ ఉత్తర్వులను సైతం ధిక్కరిస్తున్నారు అంటే నగరంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
బంజారా హిల్స్‌లో అక్రమ నిర్మాణంపై కలకలం..
బంజారా హిల్స్ రోడ్ నెం. 12లో అక్రమ నిర్మాణాల వ్యవహారం ఇప్పుడు జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం, అవినీతికి నిలు వుటద్దంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా మూడు అదనపు అంతస్తుల నిర్మాణం 80 శాతం పూర్తయ్యే వరకూ అధికారులు చూస్తూ ఊరుకోవడం వెనుక భారీగా ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలు తీవ్ర కల కలం రేపుతున్నాయి. ప్రజా ప్రయోజ నాలను గాలికొదిలి, అక్రమార్కులకు అం డగా నిలిచిన అధికారులపై వెంటనే చర్యలు తీసు కోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
‘‘స్పీకింగ్ ఆర్డర్’’ ఉన్నా చర్యలు శూన్యం..
జూబ్లీ హిల్స్ సర్కిల్ నెం. 18 డిప్యూటీ కమిషనర్ ఇటీవల బంజారా హిల్స్‌లోని ఒక భవనంపై ‘‘స్పీకింగ్ ఆర్డర్’’ జారీ చేశారు. రోడ్ నెం. 12లోని ఇంటి నెంబర్ 8-2-684/జ/2 యజమాని కావురి రమేష్, కేవలం స్టిల్ట్ ం 2 అంతస్తులకు మాత్రమే అనుమతి పొంది, మరో మూడు అదనపు అంతస్తులను (3వ, 4వ, మరియు 5వ అంతస్తులు) అక్రమంగా నిర్మించారు. ప్రజల ఫిర్యాదుతో కదలిక వచ్చిన అధికారులు.. నిర్మాణం దాదాపు పూర్తయిన తర్వాత నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని స్థానికులు మండిపడుతున్నారు.

అవినీతి ఆరోపణలపై అధికారుల మౌనం..
నోటీసులు, హెచ్చరికలు కేవలం కంటితుడుపు చర్యలేనని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ నిర్మాణంపై మొదటి దశలోనే చర్యలు తీసుకోవాల్సిన అప్పటి సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్, డిప్యూటీ కమిషనర్.. భవన యజమాని నుండి భారీ ముడుపులు తీసుకొని, నిర్మాణ పనులను యథేచ్ఛగా కొనసాగించుకునేందుకు పరోక్షంగా సహకరించారని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘‘భయపడకండి, మీకు మేము అండగా ఉంటాం’’ అని అధికారులు భరోసా ఇచ్చారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.

చట్టాలు కాగితాలకే పరిమితమా?..
జీహెచ్‌ఎంసీ చట్టాలు, నిబంధనలు కేవలం కాగితాలకే పరిమితమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిజంగా అధికారుల ఉద్దేశం పారదర్శకంగా ఉంటే, ‘‘స్పీకింగ్ ఆర్డర్’’లో ఇచ్చిన ఆదేశాల ప్రకారం భవనం కూల్చివేత ఎందుకు ఆలస్యమవుతోంది? నోటీసులు జారీ చేసినా చర్యలు తీసుకోకపోవడం అధికారుల నిష్పక్షపాత వైఖరిని అనుమానించేలా చేస్తోంది. అక్రమాలకు లంచాలు ముట్టగానే, నిబంధనలను పక్కన పెడుతున్నారని ఇది స్పష్టం చేస్తోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, అవినీతికి పాల్పడిన అధికారులపై కఠిన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, అలాగే అక్రమ నిర్మాణంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇలాంటి నిర్లక్ష్యం, అవినీతి వలన హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఆరోపణలపై సర్కిల్ 18 అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఇంజ శ్రీనివాస్‌ను వివరణ కోరగా, ఆయన డిప్యూటీ కమిషనర్, జోనల్ కమిషనర్‌లను సంప్రదించమని సూచించారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకునే అధికారం వారికే ఉంటుందని ఆయన వివరించారు.