రైతులకు మళ్లీ మొదలైన యూరియా కష్టాలు
చల్లటి చలిలో క్యూలు కడుతున్న అన్నదాతలు
ప్రైవేట్ షాపుల్లో పురుగుల మందులను కొనుగోలు చేసినట్లు లింకు చూపాలని ఏవో షరతు
ఏవో కాళ్లపై పడి వేడుకున్న రైతన్న
అధికారుల తీరుపై రైతుల్లో ఆగ్రహం, వాగ్వాదం
నర్సింహులపేట మండలంలో ఉద్రిక్త పరిస్థితి
ఎరువుల(Fertilizers) కష్టాలు తీరడం లేదు. యాప్(App) వచ్చినా.. యూరియా కష్టాలు షరామామూలు అన్నట్లుగా సాగుతున్నాయి. చల్లని చలిలో రైతులు(Farmers) క్యూలో చెప్పులు, కర్రలు పెట్టి పడిగాపులు పడుతున్నారు. పలు గ్రామాల్లో రైతులు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. యూరియా ఇప్పించండని వేడుకుంటున్నారు. వానా కాలంలో యూరియా కోసం గంటల తరబడి క్యూలోనే ఉన్న అన్నదాతలను సర్కారు ‘ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్'(Fertilizer Booking App)తో చిక్కుల్లోకి నెట్టింది.
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. యూరియా బస్తాలు అందిస్తారనే సమాచారంతో పెద్ద నాగారం వద్ద ఉన్న నర్సింహులపేట రైతు వేదికకు రైతులు తెల్లవారుజామునే పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అయితే కొంత మంది రైతులకు యూరియా ఇవ్వడానికి వ్యవసాయ అధికారులు నిరాకరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రైవేట్ షాపుల్లో పురుగుల మందులు కొనుగోలు చేసినట్లు లింకు చూపించాలని అధికారులు షరతు విధించడంతో రైతుల్లో అసంతృప్తి వ్యక్తమైంది. ఈ క్రమంలో రైతులు, అధికారుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.
అక్కడి నుంచి వెళ్లిపోతున్న ఏవోను సూర్య అనే రైతు అడ్డుకొని యూరియా ఇవ్వాలని వేడుకున్నాడు. మొక్కజొన్న పంట వేసి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు యూరియా అందలేదని, తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ దుకాణాల్లో అధిక ధరలకు యూరియా, పురుగుల మందులు కొనాల్సి వచ్చిందని వాపోయాడు. ప్రైవేట్ కొనుగోళ్లకు లింకు పెట్టి ప్రభుత్వ యూరియా నిరాకరించడం అన్యాయమని పేర్కొంటూ ఏవో కాళ్లపై పడి ఆవేదన వ్యక్తం చేయడం అక్కడున్నవారిని కలచివేసింది. ఈ ఘటన రైతుల ఇబ్బందులకు అద్దం పడుతోందని స్థానికులు వ్యాఖ్యానించారు.
కాగా.. రైతులకు ఎరువుల కష్టాలు తీరడం లేదు. యాప్ వచ్చినా యూరియా కష్టాలు షరామామూలు అన్నట్లుగా సాగుతున్నాయి. చల్లని చలిలో రైతులు క్యూలో చెప్పులు, కర్రలు పెట్టి పడిగాపులు పడుతున్నారు. పలు గ్రామాల్లో రైతులు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. యూరియా ఇప్పించండని వేడుకుంటున్నారు. వాసా కాలంలో యూరియా కోసం గంటల తరబడి క్యూలోనే ఉన్న అన్నదాతలను సర్కారు ‘ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్’తో చిక్కుల్లోకి నెట్టింది. రైతులకు ఎరువులను అందుబాటులో ఉంచాల్సింది పోయి ఎరువుల కష్టాలను మరింత ఎక్కువ చేసేలా యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.
ఈ యాప్‌ను ప్రారంభించిన తొలి రోజే పనిచేయకపోవడం గమనార్హం. దీంతో రైతులకు యాసంగిలో కష్టాలు తప్పేలా లేవనే వాదనలు వినిపిస్తున్నాయి. అసలే అంతంత మాత్రం చదువులతో సేద్యం చేసుకుంటున్న రైతన్నకు మొబైల్ యాప్ ద్వారా ఎరువులను బుక్ చేసుకోవాలంటే కత్తి మీద సాములాంటిదేనని పేర్కొంటున్నారు. గతంలో ఇచ్చినట్లే ఎరువులను పాత పద్ధతిలోనే ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ఫోన్ల గురించి మాకు తెలియదు. మేము ఇప్పటికీ చిన్న ఫోన్లనే వాడుతున్నం. ఎప్పుడు, ఎలా బుక్ చేసుకోవాలో మాకు తెలియదు. వానకాలంలో ఇచ్చినట్లు గోదాంలో పైసలు కట్టి తీసుకపోయినట్లు ఇస్తే బాగుంటుందని సూచిస్తున్నారు.
సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నప్పటికీ చాలా మంది రైతుల వద్ద ఆండ్రాయిడ్ ఫోన్లు లేవు. ఇప్పటికీ కీ ప్యాడ్ ఫోన్లనే ఉపయోగిస్తున్నారు. ఒకవేళ ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నా యాప్‌లో ఎరువులను బుక్ చేయడం, ఓటీపీలు చెప్పడంపై ఏమాత్రం అవగాహన లేదు. ఈసారి యాసంగికి కూడా కష్టాలు తప్పేలా లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు. చాలా మంది రైతులకు ఎరువుల షాపుల పేర్లు కూడా తెలియని పరిస్థితి. యాప్‌లో ఎరువులను బుక్ చేసుకుంటే ఊరు, దుకాణం పేరు నమోదై ఉంటుంది. ఏ షాపు పేరు బుక్ చేస్తే అదే దుకాణానికి వెళ్లి నంబర్ చెబితేనే ఎరువులు ఇస్తారు. లేకపోతే ఎరువులు తీసుకోవడం కుదరదు.
15 రోజులు దాటితే ఎరువుల బుకింగ్ క్యాన్సిల్ అవుతుంది. ఈ సమస్యలను రైతులు అధిగమిస్తారా లేక పాత పద్ధతినే ఎంచుకుంటారా అనేది వేచిచూడాలి. పంటల వివరాలను నమోదు చేసుకొని రైతులకు సాగుపై అవగాహన కల్పించాల్సిన వ్యవసాయ శాఖకు ప్రభుత్వం కొత్త టాస్క్ అప్పజెప్పింది. యాప్‌లపై అవగాహన లేని రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత వ్యవసాయ విస్తరణ అధికారులదే. డీలర్ షాపుల వద్ద ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటుచేసి యాప్‌పై అవగాహన కల్పించాలని చెప్పడంతో అధికారులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తున్నది.
ఇప్పటికే ఏఈవోలకు జిల్లా అధికారులు అవగాహన కల్పించే పనిలో పడ్డారు. మారుమూల గ్రామాల్లో రైతులకు అసలు సమాచారం చేరుతుందా, ఆ గ్రామాలకు ఏఈవోలు వెళ్తారా అనేది పెద్ద ప్రశ్న. కామారెడ్డి జిల్లాలో 4 లక్షల 4 వేల 525 ఎకరాల్లో రైతులు పంటలను సాగుచేస్తున్నట్లు వ్యవసాయ శాఖ వద్ద లెక్కలు ఉన్నాయి. దీంతోపాటు 40 వేల మంది కౌలు రైతులు కూడా సాగుచేస్తున్నట్లు అంచనా వేశారు. యాసంగి పంటలకు సకాలంలో రైతులకు ఎరువులు అందుతాయో లేదా చూడాల్సి మరి.
