- తిరుమలగిరి మండల కేంద్రంగా అధికారుల నకిలీ స్టాంపుల తయారీ..
- దళారిగా అవతారమెత్తిన ఓ మాజీ బైక్ మెకానిక్ ఘరానా మోసం
- ఖాళి స్థలాలు, పాత ఇండ్లకు అవలీలగా రిజిస్ట్రేషన్లు.. వెంటనే ప్రయివేటు బ్యాంకుల్లో లోన్లు..
- నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ను పట్టుకొని వదిలేసిన సూర్యాపేట సబ్ రిజిస్ట్రార్!
- తిరుమలగిరి తహశీల్దార్ కు విషయం చెప్పి, ఊరుకున్న సబ్ రిజిస్ట్రార్ వైనం అనుమానాస్పదం!
పెరుమాళ్ళ నర్సింహారావు,
ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేక ప్రతినిధి
సూర్యాపేట జిల్లా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గత కొంత కాలంగా భారీ నకిలీ రిజిస్ట్రేషన్ల దందా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఖాళీ స్థలాలు, పాత ఇండ్ల పత్రాలను వేరే వ్యక్తుల పేర్లకు అవలీలగా మళ్లించి, వెంటనే ప్రైవేట్ బ్యాంకుల్లో లోన్లు ఇప్పించడం, అందునుండి కమిషన్లు నొక్కేయడం వరకు జరిగే ఈ దందాకు ఓ ముఠా తెరలేపినట్లు సమాచారం. సూర్యాపేట జిల్లా సమీప మండలాలకు చెందిన తహశీల్దార్లు, గ్రామ కార్యదర్శుల నకిలీ స్టాంపులను ఈ ముఠా తయారు చేసుకొని, రిజిస్ట్రేషన్లకు కావాల్సిన గ్రామ కార్యదర్శి ఎన్.ఓ.సి, తహశీల్దార్ జారీ చేసే ఫ్యామిలీ మెంబర్ ధ్రువపత్రాలు తదితరమైన అన్ని నకిలీ సర్టిఫికెట్లు దర్జాగా వీళ్ళే తయారు చేసుకొని, గంట సేపట్లో సూర్యాపేట జిల్లా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, సదరు ఆస్తులపై ప్రైవేట్ బ్యాంకుల్లో లోన్లు ఇప్పించడం ఈ ముఠా ప్రత్యేకత.
తిరుమలగిరి మండల కేంద్రంగా అధికారుల నకిలీ స్టాంపుల తయారీ..
తిరుమలగిరి మండల కేంద్రంలో కొంతకాలంగా నడుస్తున్న ఒక ప్రింటింగ్ ప్రెస్ లోనే ఈ నకిలీ స్టాంపులు తయారీ అవుతున్నట్లు సమాచారం! గ్రామ కార్యదర్శులు, మండల తహశీల్దార్ల ముద్రలు ఇక్కడి నుండే సరఫరా జరుగుతున్నట్లు వినికిడి. సూర్యాపేట చుట్టుపక్కల మండలాల తహశీల్దార్లు, గ్రామ కార్య దర్శుల నకిలీ స్టాంపుల ఉత్పత్తి జోరుగా ఇక్కడి నుండే కొనసా గుతున్నట్లు తెలుస్తోంది. స్థానిక క్రాస్ రోడ్డులోని ఒక ప్రెస్ లో ఈ రకం స్టాంపులు చేస్తున్నట్లు తెల్సింది. నకిలీ సంతకాలు, కల్పిత ఫేక్ ఎంకంబ్రెన్స్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు, గ్రామా కార్యదర్శి జారీచేసే ఎన్.ఓ.సి, ఇలా అనేక రూపాల్లో జరుగుతున్న ఈ దందాపై సూర్యాపేటకు చెందిన పలువురు డాక్యుమెంట్ లేఖరులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

దళారిగా అవతారమెత్తిన ఓ మాజీ బైకు మెకానిక్ ఘరానా మోసం..
తిరుమలగిరికి చెందిన ఓ మాజీ బైక్ మెకానిక్ దళారి అవతారమెత్తి, ఈ దందాకు తెరలేపినట్లు తెలుస్తోంది. గతంలో ఇక్కడ బైక్ మెకానిక్ గా సాధారణ జీవితం గడిపిన ఇతగాడు అప్పటి తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ అనుచరులకు చెందిన భూ వివాదంలో తలదూర్చి, పలు పోలీస్ కేసులను ఎదుర్కొన్న సంఘటన అనంతరం, తిరుమలగిరి నుండి కొన్నాళ్లపాటు అదృశ్యం అయ్యాడు. ఇప్పుడు సడెన్ గా ప్రత్యక్షమై, ఖాళి భూములు, పాత ఇండ్ల రిజిస్ట్రేషన్లు చేయిస్తూ, సదరు దస్త్రాలను పలు ప్రయివేటు బ్యాంకుల్లో కుదువ పెట్టించి, వాటి విలువను బట్టి లక్షల్లో లోన్లు ఇప్పించి, తనకు కావాల్సిన పర్సంటేజీని నొక్కేస్తున్నట్లు తెలుస్తోంది. గడచిన రెండు సంవత్సరాలుగా ఈ దందాను మొదలుపెట్టి, కోట్లు గడిరచినట్లుగా సూర్యాపేట సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ చుట్టుపక్కల ఉన్న లేఖరులు చర్చించుకుంటున్నారు.
నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ను పట్టుకొని వదిలేసిన సూర్యాపేట సబ్ రిజిస్ట్రార్!
కొద్దీ రోజుల క్రితం తిరుమలగిరి ప్రాంతానికి చెందిన ఓ నకిలీ రిజిస్ట్రేషన్ కొరకు తిరుమలగిరి మండల తహశీల్దార్ జారీచేసినట్లుగా ఒక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ను తయారు చేసుకొని, సూర్యాపేట సబ్ రిజిస్ట్రార్ వద్దకు తీసుకవెళ్ళగా, దీని వరిజినల్ ఒకసారి చూపించాలని రిజిస్ట్రార్ దళారిని కోరడంతో వరిజినల్ తెచ్చి ఇస్తానని అక్కడినుంచి వెళ్లి, మళ్ళీ సదరు రిజిస్ట్రేషన్ కొరకు రాలేదని తెస్తోంది. జరిగిన ఈ విషయం గురించి సబ్ రిజిస్ట్రార్ తిరుమలగిరి మండల తహశీల్దార్ కు ఫోన్ చేసి వివరించినట్లు తెలిసింది. మీ ప్రాంతం నుండి ఇలాంటి అనుమానపు సర్టిఫికెట్లు వస్తున్నాయని తెలియజేయడం తో అప్రమత్తమైన తహశీల్దార్ స్థానిక పోలీసు ఇంటలిజెన్స్ వారికి అయన సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అప్పటికే సూర్యాపేట జిల్లా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలోని కొంత మంది దళారి ఉద్యోగులతో చేతులు కలిపి, నకిలీ స్టాంపులతో కూడిన సర్టిఫికెట్లు పెట్టి ఎన్నో రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు. వాటిపై బ్యాంకుల్లో లోన్లు పొందిన బోగస్ లబ్ధిదారులు నెలసరి వాయిదాలు కూడా చెల్లిస్తున్నట్లు సమాచారం. జరుగుతున్న ఈ దందా గురించి సూర్యాపేట జిల్లా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉన్న ఉద్యోగులందరికీ తెలుసుననేది జగమెరిగిన సత్యం.
తిరుమలగిరి తహశీల్దార్ కు విషయం చెప్పి, వదిలేసిన సబ్ రిజిస్ట్రార్ వైనం అనుమానాస్పదం!
తన చేతికి చిక్కిన నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ విషయం గురించి వెంటనే విచారణ చేయకుండా సూర్యాపేట సబ్ రిజిస్ట్రార్ తేలికగా తీసుకున్నట్లు తెలుస్తోంది. జరిగిన విషయం తెలుసుకున్న ‘ఆదాబ్’ ప్రతినిధి సబ్ రిజిస్ట్రార్ ను ఫోన్లో సంప్రదించి, వివరణ కోరగా వాళ్ళు వరిజినల్ ఇస్తామని చెప్పి, తన దగ్గర నుండి జిరాక్స్ కాపీని తీసుకువెళ్లి మళ్ళి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి, స్థానిక తిరుమలగిరి మండల తహశీల్దార్ కు విషయం తెలియజేసినట్లు సబ్ రిజిస్ట్రార్ తెలిపారు. మరి సదరు వ్యక్తిపై అనుమానం వచ్చినప్పుడు ఎందుకు అతను గతంలో చేయించిన ఇతర రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్లను పరిశీలించలేదని రిజిస్ట్రార్ ను అడిగితే, అయన సమాధానం దాటవేశారు. డాక్యుమెంట్ లేఖరిగా అవతారమెత్తిన మాజీ బైకు మెకానిక్ ఇప్పటి వరకు సూర్యాపేట జిల్లా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చేయించిన సంబంధిత రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అధికారులు పరిశీలన చేస్తే, అనేక నకిలీ ధ్రువ పత్రాలు బయటపడే అవకాశం లేకపోలేదు.
జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశిస్తే, అందరి బాగోతం బట్టబయలు..!
గడిచిన ఏడాది జూన్ మాసంలో సూర్యాపేట జిల్లా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంపై ఏ.సి.బి అధికారులు దాడులు చేసి, అవినీతి అధికారులను వలపన్ని పట్టుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మళ్ళి ఇదే పాత పద్ధతి కొనసాగుతోందని అందరి అనుమానం. ‘ఆదాబ్’ కు వచ్చిన సమాచారం అత్యంత విశ్వసనీయమైనది. గతకొంత కాలంగా ఇక్కడ జరుగుతున్న ఈ నకిలీ రిజిస్ట్రేషన్ల బాగోతం బయటికి వస్తే, ఈ నకిలీ డాక్యుమెంట్లకు తప్పుడు పద్దతిలో కోట్ల రూపాయల లోన్లు ఇచ్చిన ఆయా ప్రయివేటు బ్యాంకులు, సంస్థల బండారం కూడా బయటికి వచ్చే అవకాశం ఉంది. జిల్లా కలెక్టర్ కాస్త చొరవ చూపి, లోతైన విచారణకు ఆదేశిస్తే, కోట్ల కుంభకోణం బయటికి రావడం ఖాయమని, భారీ స్కాం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సూర్యాపేట జిల్లా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం చుట్టూ ఉన్న అనేకమంది డాక్యుమెంట్ లేఖరులు అభిప్రాయపడు తున్నారు. వేచి చూద్దాం! ఏం జరగనుందో.
