- నోముల ప్రకాష్ రావు
సికింద్రాబాద్ నియోజకవర్గంలోని సీతాఫల్మండి డివిజన్‌కు చెందిన కార్పొరేటర్‌గా రెండుసార్లు దిగ్విజయంగా ఎన్నికై ప్రజాసేవలో ప్రత్యేక గుర్తింపు పొందిన డాక్టర్ సామల హేమ పదవీకాలం ఫిబ్రవరి 10న విజయవంతంగా ముగిసిన సందర్భంగా ఆమెకు ఘన సన్మానం నిర్వహించారు.బుధవారం నామాలగుండు కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ఛైర్మన్ నోముల ప్రకాశరావు తన కార్యాలయంలో సామల హేమను పూలమాలలు వేసి శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ డివిజన్‌లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు,మౌలిక వసతుల మెరుగుదల,ప్రజా సమస్యల పరిష్కారంలో ఆమె చూపిన చొరవ ప్రశంసనీయమని పేర్కొన్నారు.ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి వారి విశ్వాసాన్ని నిలబెట్టుకున్న ప్రజాప్రతినిధిగా సామల హేమ నిలిచారని అభినందించారు.తన పదవీకాలంలో తాగునీటి సమస్యల పరిష్కారం,కాలువల మరమ్మతులు,రహదారి అభివృద్ధి,వీధి దీపాల ఏర్పాటు వంటి పలు పనులు చేపట్టి డివిజన్ అభివృద్ధికి కృషి చేసిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా సామల హేమ మాట్లాడుతూ సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ సహకారం,ప్రజల ఆదరణ,పార్టీ నాయకుల సహకారం వలనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కరాటే రాజు,రాజాసుందర్,రవి,కిరణ్ బెజాడి తదితరులు పాల్గొని సామల హేమకు శుభాకాంక్షలు తెలియజేశారు.
