- రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించిన జిల్లా పోలీసు కళా బృందం
- సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం
సూర్యాపేట, నవంబర్ 13 (ఆదాబ్ హైదారాబాద్): ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను (Passengers) తీసుకెళ్లొద్దని సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం డ్రైవర్లను కోరారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు (Road Accidents) సంభవించొద్దని, ఒక్క ప్రాణం (Life) కూడా పోవద్దనే ఉద్దేశంతో ఎస్పీ నర్సింహ ఆదేశాల మేరకు గురువారం అవగాహన కార్యక్రమం (Awareness Programme) నిర్వహించారు. పోలీసు ప్రజా భరోసా (Police Praja Bharosa) కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.
పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద సూర్యాపేట ట్రాఫిక్ పోలీసులు, పట్టణ పోలీసులు, పోలీసు కళా బృందం ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పోలీసు కళా బృందం పాటల (Songs) ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదంలో కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడుతుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం మాట్లాడుతూ.. రోజురోజుకు పట్టణంలో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్ నియంత్రణ (Traffic Control) చర్యలు తీసుకున్నామని తెలిపారు.
ప్రమాదాలు సంభవించకుండా ప్రణాళిక (Planning) ప్రకారం పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి వాహనదారుడు బాధ్యతగా వ్యవహరించాలని, ఇతరులకు ఇబ్బందులు కలగకుండా వాహనాలను జాగ్రత్తగా నడపాలని సూచించారు. రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తూ ముందుకు వెళ్లాలని కోరారు. అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ ఎస్ఐ నీలిమ, సూర్యాపేట పట్టణ ఎస్ఐ శివతేజ, కళా బృందం, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
