- అందుకే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించను..
- మీడియాతో వెల్లడించిన డొనాల్ట్ ట్రంప్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించకపోవడానికి కారణాన్ని వెల్లడించారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరిస్తే తాను లావుగా కనిపిస్తానని, అందుకే బహిరంగ కార్యక్రమాల్లో దానిని ధరించనని ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా ట్రంప్‌పై పలుమార్లు హత్యాప్రయత్నాలు జరిగాయి. అయినప్పటికీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించకపోవడంపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఓవల్ కార్యాలయంలో జరిగిన ఓ సమావేశంలో ఒక మీడియా ప్రతినిధి ట్రంప్‌ను ప్రశ్నించారు.
తాను బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరిస్తే 20 పౌండ్ల బరువు పెరిగినట్లుగా కనిపిస్తానని, ఇది తనకు ఇష్టం ఉండదని ట్రంప్ అన్నారు. దాంతో అక్కడున్న వారంతా నవ్వులు చిందించారు. హత్యాయత్నం నేపథ్యంలో బుల్లెట్ ప్రూఫ్ ధరించడం లాంటి జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమే అన్నారు. ఈ విషయం తనను చాలామంది అడిగారని, ఈ విషయం ఆలోచించవలసిందే వ్యాఖ్యానించారు. కానీ తనకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించడం ఇష్టం ఉండదని చెప్పారు. అలా చేస్తే మనం ఒక చెడుశక్తికి లొంగిపోయినట్లు అవుతుందని అన్నారు.
