Government Lands | ప్రభుత్వ భూముల విధ్వంసం
అక్రమార్కులకు రెవెన్యూ అండ!
తహసీల్దార్ మారగానే మళ్లీ మొదలైన కబ్జా భాగోతం!
హైడ్రా చూస్తున్నా.. కోట్లు విలువ చేసే స్థలం అక్రమార్కుల పరం!
హైదరాబాద్ నవంబర్ 19 (ఆబాబ్ హైదరాబాద్): ప్రభుత్వ భూములంటే (Government Lands) అక్రమార్కులకు (lawbreakers) కామధేనువుగా, కల్పవృక్షంగా మారుతున్నాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని నాగారం మున్సిపాలిటీలో సర్వే నంబర్ 291/4లోని కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ‘జీవో 59’ ముసుగులో కొందరు కబ్జాకోరులు (Encroachers) అడ్డగోలుగా క్రమబద్ధీకరించుకున్న వైనం మరోసారి సంచలనం సృష్టిస్తోంది. ఈ భూఅక్రమ భాగోతంపై గతంలో ‘ఆదాబ్ హైదరాబాద్’ కథనాన్ని ప్రచురించినా, అప్పటి తహసీల్దార్(Tahsildar) చర్యలు తీసుకున్నా… ఆయన బదిలీ కాగానే అక్రమార్కులు మళ్లీ శరవేగంగా నిర్మాణ పనులు కొనసాగించడం ప్రభుత్వ వ్యవస్థలోని లోపాలను, నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది..
తొలగించినా మళ్లీ నిర్మాణం.. అక్రమార్కులకు ఎంత ధైర్యం?
గతంలో ఈ అవినీతి(Corruption)పై కథనం వెలువడినప్పుడు, అప్పటి తహసీల్దార్ అక్రమంగా నిర్మించిన తాత్కాలిక గదులను తొలగించారు. అంతేకాకుండా, దీనిపై కలెక్టర్‌కు, హైడ్రా అధికారులకు లేఖ రాసి ప్రభుత్వ భూమిని రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే, అధికారి బదిలీ అయిన మరుక్షణమే ‘భూ అక్రమార్కులు’ రెచ్చిపోయారు. ఏమాత్రం భయం, బెరుకు లేకుండా మళ్లీ శరవేగంగా నిర్మాణ పనులు మొదలుపెట్టారు. అంటే, ప్రభుత్వ యంత్రాంగం కంటే అక్రమార్కుల శక్తి, పలుకుబడి ఎక్కువైనట్టేనా?
రెవెన్యూ అధికారుల సహకారంపై విమర్శలు!
అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే… ఈ భూమి కబ్జాలో లేకపోయినా కూడా, కబ్జాలో ఉన్నట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించి జీవో 59 కింద క్రమబద్ధీకరించుకున్నారు. కేవలం కబ్జాలో ఉన్నట్లు కలరింగ్’ ఇచ్చేందుకే తాత్కాలిక నిర్మాణాలను చేపడుతున్నారు. ప్రభుత్వ అవసరాలకు వినియోగించాల్సిన ఈ విలువైన భూములను కొల్లగొట్టేందుకు అక్రమార్కులు ప్రయత్నం చేస్తే, అందుకు రెవెన్యూ అధికారులు పూర్తిగా సహకరించడం విస్మయాన్ని, ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన వారే భూ బకాసురులకు వంత పాడితే ఇక ప్రభుత్వానికి రక్షణ ఏముంది? ఈ క్రమబద్ధీకరణ వెనక ఉన్న పెద్ద తలకాయలు ఎవరు? అధికార యంత్రాంగంలో ఈ అవినీతి భాగోతం ఎంత లోతుగా పాతుకుపోయిందో అర్థంచేసుకోవచ్చు.
అసెంబ్లీ ఎన్నికల ముందు హడావుడిగా రిజిస్ట్రేషన్లు!
జీవో 59 ద్వారా జరిగిన ఈ అక్రమ క్రమబద్ధీకరణలన్నీ అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ముందు హడావుడిగా రిజిస్ట్రేషన్ (Registration) చేయబడ్డాయి. (డాక్యుమెంట్లు: 7911/2023, 7912/2023, 7916/2023, 8410/2023, 8411/2023, 11229/2023, 11230/2023. 11231/2023, 11232/2023, 11234/2023, 11235/2023, 11236/2023, 11598/2023 – 05 : 15-07-2023 నుంచి 17-10-2023 వరకు) ఒకే సర్వే నంబర్లో ఇంత పెద్ద మొత్తంలో, ఇంతమందికి, ఇంత తక్కువ సమయంలో క్రమబద్ధీకరించడం వెనక భారీగా లావాదేవీలు జరిగి ఉంటాయనే అనుమానాలు బలపడుతున్నాయి.
హైడ్రా తక్షణమే రంగంలోకి దిగాలి
ప్రభుత్వ భూముల రక్షణ కోసం ఏర్పడిన హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (Hydraa) ఇప్పటికైనా మేల్కొనాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గతంలోని, ఇప్పటి శాటిలైట్ మ్యాప్‌లను పరిశీలిస్తే భూమి కబ్జాలో ఉందా లేదా అన్నది స్పష్టంగా తెలుస్తుంది.
“కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆస్తిని కళ్లముందే అప్పనంగా కొట్టేస్తుంటే, రెవెన్యూ యంత్రాంగం చోద్యం చూస్తోంది. తక్షణమే హైద్రా దృష్టి సారించి, ఈ అక్రమ క్రమబద్ధీకరణలను రద్దు చేసి, బాధ్యులైన అధికారులపై, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలి, లేకపోతే, రేపటి తరానికి ప్రభుత్వ అవసరాల కోసం ఒక్క గుంట భూమి కూడా మిగలరు.” అని మున్సిపల్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
