Thursday, February 19, 2026
Homeఆంధ్రప్రదేశ్Defamation | సాక్షి మీడియాకు ఎదురుదెబ్బ..

Defamation | సాక్షి మీడియాకు ఎదురుదెబ్బ..

  • 24 గంటల్లోగా లింకులు తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం
  • భోలేబాబా డెయిరీతో తమకు సంబంధం లేదని హెరిటేజ్ స్పష్టీకరణ

సాక్షి మీడియా సంస్థకు ఢిల్లీ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ దాఖలు చేసిన రూ.100 కోట్ల పరువు నష్టం దావాలో, వివాదాస్పద కథనాలకు సంబంధించిన లింకులను తక్షణమే తొలగించాలని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. భోలేబాబా డెయిరీ నెయ్యి వివాదంతో హెరిటేజ్ ఫుడ్స్‌కు సంబంధం ఉందంటూ సాక్షి మీడియాలో ఇటీవల కొన్ని కథనాలు ప్రచురితమయ్యాయి.

ఈ కథనాలు తమ సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేలా, పూర్తిగా అసత్యాలతో ఉన్నాయని ఆరోపిస్తూ హెరిటేజ్ ఫుడ్స్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేసింది. ఈ సందర్భంగా హెరిటేజ్ ఫుడ్స్ కీలక విషయాలను స్పష్టం చేసింది. భోలేబాబా డెయిరీతో తమకు ఎలాంటి వాణిజ్య సంబంధాలు లేవని తేల్చిచెప్పింది. అంతేకాకుండా, తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) తాము నెయ్యి సరఫరా చేయడం లేదని కూడా వెల్లడించింది.

- Advertisement -

ఈ వ్యవహారంలో ఆరోపణలు చేసిన మరికొందరికి కూడా లీగల్ నోటీసులు పంపినట్లు తెలిపింది. పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, 24 గంటల్లోగా సదరు కథనాల లింకులను అన్ని వేదికల నుంచి తొలగించాలని సాక్షి మీడియాను ఆదేశించింది. ఒకవేళ సాక్షి ఆ ఆదేశాలను పాటించకపోతే, ఆ లింకులను తొలగించేలా చర్యలు తీసుకోవాలని గూగుల్, యూట్యూబ్, మెటా వంటి సంస్థలకు సూచించింది. ఈ మేరకు సాక్షి యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News