Tuesday, February 10, 2026
Homeఆదాబ్ ప్రత్యేకందమ్మాయిగూడలో 'మామూళ్ల' జోరు!

దమ్మాయిగూడలో ‘మామూళ్ల’ జోరు!

  • కొత్త కమిషనర్ రాకతో మాస్టర్ ప్లాన్ రోడ్డులో అక్రమాలకు మళ్ళీ జీవం.
  • తెర వెనుక భారీ ఒప్పందాలపై అనుమానాలు

ప్రజా సౌకర్యాల కోసం, భవిష్యత్ అవసరాల కోసం కేటాయించిన మాస్టర్ ప్లాన్ రోడ్లను సైతం కబళించి సొమ్ము చేసుకుంటున్న అవినీతి తిమింగలాలకు దమ్మాయిగూడ మున్సిపల్ అధికారులు కొమ్ముకాస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో ప్రజా ఫిర్యాదులతో నిలిచిపోయిన అక్రమ నిర్మాణాలు, నూతన మున్సిపల్ కమిషనర్ వెంకట్ రెడ్డి రాకతో ఒక్కసారిగా తిరిగి ప్రారంభం కావడం వెనుక భారీ ‘అక్రమ వ్యవహారం’ జరిగినట్లు అనుమానాలు బలపడుతున్నాయి.

Dammaiguda Commissioner Venkat Reddy

దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని 30 మీటర్ల మాస్టర్ ప్లాన్ రోడ్డులో కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా నిర్మాణాలు చేపట్టారు. గతంలో పనిచేసిన కమిషనర్ నాగమణి, టీపీవో శ్రీదేవిలు ఈ నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. స్థానికుల నుంచి, సామాజిక కార్యకర్తల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో ఆ నిర్మాణాలను అధికారులు నిలిపివేశారు.

- Advertisement -

కొన్ని నెలల పాటు ఆగిపోయిన ఆ అక్రమ కట్టడాల పనులు, దమ్మాయిగూడ మున్సిపాలిటీకి నూతన కమిషనర్‌గా వెంకట్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన వెంటనే మళ్లీ జోరందుకోవడం అనేక సందేహాలకు తావిస్తోంది. అధికారి మారగానే, ఆగిపోయిన అక్రమ నిర్మాణాలకు తిరిగి ‘జీవం’ ఎలా వచ్చిందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. తెర వెనుక భారీ ‘మామూళ్లు’ చేతులు మారి, ఉన్నత స్థాయిలోనే ‘డీల్’ కుదిరిందన్న ఆరోపణలు మున్సిపల్ వర్గాల్లోనే గుప్పుమంటున్నాయి.

జీహెచ్ఎంసీ విలీనం సాకుతో… ఆఖరి దోపిడీ!
మరో నాలుగు నెలల్లో దమ్మాయిగూడ మున్సిపాలిటీ రద్దయి, జీహెచ్ఎంసీలో విలీనం అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇదే అదనుగా భావించిన కొందరు అధికారులు, ‘అందిన కాడికి దండుకునే’ పనిలో పడ్డారని స్థానికులు మండిపడుతున్నారు. “మామూళ్ల మత్తులో పడి, భవిష్యత్ ప్రణాళికలను కాలరాస్తూ మాస్టర్ ప్లాన్ రోడ్లలో నిర్మాణాలు జరుగుతున్నా కళ్లు మూసుకోవడం దారుణం. దమ్మాయిగూడ మున్సిపాలిటీలో అవినీతి ఏ స్థాయిలో రాజ్యమేలుతోందో చెప్పడానికి ఇదే నిదర్శనం” అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అక్రమాలకు అనుమతులిచ్చిన వారిపై చర్యలేవి?
మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 575, 579 లలోని మాస్టర్ ప్లాన్ రోడ్డులో నాలుగు నిర్మాణాలకు (పర్మిట్ నెం: 409645/DMGA/0420/2024, 409110/DMGA/0413/2024, 409647/DMGA/0421/2024, 409990/DMGA/0423/2024) చట్టవిరుద్ధంగా అనుమతులిచ్చిన గత కమిషనర్ నాగమణి, ప్రస్తుత టీపీవో శ్రీదేవిలపై చర్యలు తీసుకోవాలని గతంలోనే డిమాండ్లు వచ్చాయి. ఇప్పుడు, ఆ ఆగిన పనులను తిరిగి ప్రోత్సహిస్తున్న ప్రస్తుత కమిషనర్ వెంకట్ రెడ్డిపైనా తక్షణమే ఉన్నతాధికారులు విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ వాసులు డిమాండ్ చేస్తున్నారు.

ఫిర్యాదులొస్తేనే పనిచేస్తారా..? కమిషనర్ వింత వాదన!
ఈ మొత్తం వ్యవహారంపై కమిషనర్ వెంకట్ రెడ్డి స్పందన మరింత విస్మయానికి గురిచేస్తోంది. “ఫిర్యాదులొస్తే చర్యలు తీసుకుంటాం” అని ఆయన చెప్పడం తన బాధ్యతనుంచి తప్పించుకోవడమేనన్న విమర్శలు వస్తున్నాయి. కళ్ల ముందే మాస్టర్ ప్లాన్ రోడ్డు కబ్జాకు గురవుతుంటే, చట్టవిరుద్ధ నిర్మాణాలు జరుగుతుంటే… ఎవరో వచ్చి ఫిర్యాదు చేసే వరకు అధికారులు వేచి చూస్తారా? ఇది వారి విధి నిర్వహణలో వైఫల్యం కాదా? లేక అక్రమార్కులకు ఇచ్చిన ‘అభయహస్తం’లో భాగమా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

నూతన కమిషనర్ రాక, అక్రమ నిర్మాణాల పునఃప్రారంభం కేవలం యాదృచ్ఛికమేనా, లేక తెర వెనుక కుదిరిన ‘అక్రమ ఒప్పంద’ ఫలితమా? అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికైనా కమిషనర్ వెంకట్ రెడ్డి స్పందించి, ఆ అక్రమ నిర్మాణ అనుమతులను తక్షణమే రద్దు చేసి, బాధ్యులపై చర్యలు చేపడతారో… లేక తనపై వస్తున్న అవినీతి ఆరోపణలను నిజం చేస్తూ మౌనం వహిస్తారో వేచి చూడాలి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News