- సైబర్ క్రైమ్ వలలో చిక్కుకున్న మహారాష్ట్ర నివాసి..
- దాదాపు రూ. 64 లక్షలు పోగొట్టుకున్న వైనం..
అధిక లాభాలు వస్తాయన్న ఆశతో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి దాదాపు రూ.64 లక్షలు కోల్పోయాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఠాణేలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న 44ఏళ్ల వ్యక్తికి క్రిప్టోకరెన్సీ సంస్థ నుంచి ఫోన్ చేస్తున్నానంటూ ఓ మహిళ తొలుత సంప్రదించింది. క్రిప్టోల్లో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయంటూ నమ్మబలికింది.
ఆపై ఆ సంస్థ ప్రతినిధులమంటూ వేర్వేరు వ్యక్తులు అతడికి కాల్ చేసి 13 దఫాలుగా వేర్వేరు బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేయించుకున్నారు. అలా రెండు నెలల వ్యవధిలో ఏకంగా రూ.63.90 లక్షలను బదిలీ చేశాడు. లాభాల మాట అటుంచితే తాను మోసపోయి పోగుచేసుకున్న సొమ్మును కోల్పోయినట్లు ఆలస్యంగా గ్రహించి చివరకు పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
