Sunday, February 15, 2026
HomeతెలంగాణBandi Sanjay | ఎంసిల్ బంధం

Bandi Sanjay | ఎంసిల్ బంధం

మేయర్ పదవి కోసం కాంగ్రెస్, ఎంఐఎంతో జట్లు

  • బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయం
  • ఇలాంటి రాజకీయాలను తిప్పికొడుతాం
  • కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీ పార్టీదే..
  • ప్రజాతీర్పును కాలరాసేలా కుట్రలు
  • కరీంనగర్ నుంచే యుద్ధం చేస్తాం
  • మండిపడ్డ కేంద్రమంత్రి బండి సంజయ్

కరీంనగర్ మేయర్ పదవి కోసం ప్రధాన పార్టీల మధ్య రాజకీయ పరిణామాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ‘మేయర్’ పదవి కోసం బీఆర్ఎస్ తన సిద్ధాంతాలను పక్కన పెట్టి కాంగ్రెస్, ఎంఐఎం కుమ్మక్కైనట్లు ప్రచారం సాగుతోంది. భారతీయ జనతా పార్టీని ఓడించేందుకు మూడు పార్టీలు ఒక్కటైనట్లు సమాచారం. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి బీజేపీని ఓడించేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇండిపెండెంట్ కార్పొరేటర్ను మేయర్ అభ్యర్థిగా నిలబెట్టేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు శుక్రవారం ರಾತ್ರಿ సదరు కార్పొరేటర్ సమావేశమయ్యారు.

- Advertisement -

అదే సమయంలో బీఆర్ఎస్ నేతలు కూడా కార్పొరేటర్ తో రహస్యంగా చర్చలు జరిపినట్లు సమాచారం. ఇండిపెండెంట్లు, ఇతర కార్పొరేటర్లు, బీజేపీ సభ్యుల మద్దతు కోసం ఆఫర్లు ఇవ్వాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. తనకు మేయర్గా మద్దతిస్తే ఆర్థిక సహాయం కూడా అందిస్తానని కూడా ఆ ఇండిపెండెంట్ కార్పొరేటర్ సంప్రదింపులు జరుపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలను కమలం పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. తమ పార్టీ కార్పొరేటర్లను ప్రలోభాలకు గురిచేయడాన్ని ప్రజాస్వామ్య విరుద్ధమైన చర్యగా బీజేపీ అభివర్ణిస్తోంది.

అధికార పార్టీ కాంగ్రెస్ తో బీఆర్ఎస్, ఎంఐఎం అనైతిక పొత్తులు పెట్టుకొని భాజపాని మున్సిపల్ ఎన్నికల్లో ఓడించాలని చూసినా.. ప్రజలు మాత్రం తమని ఆశీర్వదించారని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. అత్యధిక స్థానాలు చేజెక్కించుకున్న తామే కరీంనగర్ మేయర్ పీఠం పక్కా ప్లాన్తో వ్యూహాత్మకంగా దక్కించుకోబోతున్నామని స్పష్టం చేశారు. ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యవహరిస్తే.. వారి మధ్య ఉన్న లోపాయికారి ఒప్పందం బయట పెడతానని తేల్చి చెప్పారు.

ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్, బీఆర్ఎస్ కు అనుసంధానకర్తగా ఎంఐఎం పనిచేస్తుందని ఆరోపించారు. కరీంనగర్లో కార్యకర్తల కష్టం, ప్రధాని మోడీ ఆశీస్సులతో గెలవడం సంతోషంగా ఉందని కేంద్రమంత్రి హర్షం వ్యక్తం చేశారు. స్వతంత్ర అభ్యర్థులు భాజపాలో చేరారని, మేయర్ పీఠానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ దాటేశామని వెల్లడించారు. మున్సిపల్ పీఠం ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ అభివృద్ధి కోసం ఇప్పటివరకూ రూ.1,400 కోట్ల పనులు చేశామని తెలిపారు. ఎన్నికల్లో భాజపా అభ్యర్థులను గెలిపించినందుకు కరీంనగర్ ప్రజలకు బండి కృతజ్ఞతలు చెప్పారు.

ఎంఐఎం రివైవల్ డే నిర్వహించడంపై కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. దేనికోసం రివైవల్ డే చేస్తున్నారని ప్రశ్నించారు. రజాకర్ల రాజ్యం తెస్తారా.. మహిళలను కించపరిచి బతుకమ్మ ఆడిస్తారా.. పాత రాజ్యం తెస్తామని ఎంఐఎం రివైవల్ డే చేస్తుందా? అని నిలదీశారు. వారి ఆటలు సాగనివ్వమని స్పష్టం చేశారు. ఎంఐఎం ప్రాబల్యం ప్రతి ఎన్నికల్లో తగ్గుతుందని, భాజపా బలపడుతూ వస్తోందని చెప్పారు. రాష్ట్రంలో భాజపా జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. భాజపా అభ్యర్థుల విజయం పట్ల రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన మిఠాయిలు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News