దేశంలోనే తొలి (First In Country) భూ విజ్ఞాన శాస్త్ర (Earth Sciences) విశ్వవిద్యాలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నెలకొల్పిన ఈ యూనివర్సిటీకి ప్రముఖ ఆర్థికవేత్త, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ (Dr Manmohan Singh Earth Sciences University of Telangana) పేరు పెట్టారు. కొత్తగూడెంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..
6 దశాబ్దాల కిందట తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షకు మొట్టమొదటిసారిగా పాల్వంచ, కొత్తగూడెం ప్రాంతంలోనే పునాది పడిందని గుర్తుచేశారు. తెలంగాణ ఆకాంక్షను ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నెరవేర్చిన నేపథ్యంలో యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టినట్టు వెల్లడించారు.
- దేశాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం దిశగా నడిపించిన ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అని ప్రశంసించారు.
- రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాలనే పండిట్ జవహర్ లాల్ నెహ్రూ (Pandit Jawaharlal Nehru) స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం విద్య, నీటి పారుదల రంగాలకు ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు.
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అపార ఖనిజ సంపదను గుర్తించడంతోపాటు సింగరేణి లాంటి పేరొందిన సంస్థలున్న ఈ ప్రాంతంలో ఖనిజ సంపదపై పరిశోధన కోసం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణ(DrMMSESUT)ను ఇక్కడ నెలకొల్పామని పేర్కొన్నారు.
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదేండ్లుగా నిర్లక్ష్యానికి గురైన నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు.
- ఈ జిల్లాను అభివృద్ధి వైపు నడిపించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు.
- తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాలన్న సంకల్పంతో విద్య, నీటి పారుదల రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం వివరించారు.

