- హెచ్చరించిన సీఎం చంద్రబాబు..
- కలెక్టర్ల సదస్సులో ఆదేశాలు జారీ..
ప్రభుత్వ దస్త్రాల పరిష్కారంలో జాప్యాన్ని ఏమాత్రం సహించేది లేదని, పాలనలో వేగం పెంచాలని సీఎం చంద్రబాబు(Chandrababu) అధికారులను గట్టిగా హెచ్చరించారు. మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్లు ఫైళ్లను వీలైనంత వేగంగా క్లియర్ చేయాలని స్పష్టం చేశారు. అమరావతిలో జరిగిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన పరిపాలనపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.(epaper.aadabhyderabad.in)
సకాలంలో దస్త్రాలను పరిష్కరించకుండా జాప్యం చేస్తున్న కొందరు అధికారుల తీరుపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లోపు ఫైళ్లు క్లియర్ చేసిన వారిని అభినందిస్తూనే, గంటల వ్యవధిలోనే పూర్తి చేసిన వారిని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ సమావేశానికి కొందరు ఉన్నతాధికారులు గైర్హాజరు కావడంపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారి నుంచి వివరణ తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌ను ఆదేశించారు. పరిపాలనలో జవాబుదారీతనం ముఖ్యమని, ఐఏఎస్ అధికారుల పనితీరుపై 360 డిగ్రీల నివేదికను అందరి అభిప్రాయాలతో రూపొందిస్తామని తెలిపారు. కార్యదర్శులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించి, ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు సేకరించాలని, అప్పుడే పనితీరును మెరుగుపరుచుకోగలమని సూచించారు.
ప్రభుత్వ కార్యకలాపాల్లో పారదర్శకత, వేగం కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. నెల రోజుల్లో అన్ని శాఖల దస్త్రాలను పూర్తిగా ఆన్‌లైన్‌లోకి మార్చాలని స్పష్టం చేశారు. ఈ గడువు తర్వాత భౌతిక (మాన్యువల్) ఫైళ్ల నిర్వహణను తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. ఈ అంశంపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ, మంత్రులు కూడా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చంద్రబాబు సూచించారు.
